UK Blood Scandal Report: వైద్యులు, సర్వెంట్లు చేసే ఒక చిన్న తప్పు ఎన్నో జీవితాలను నాశనం చేస్తుంది. కలుషితమైన రక్తం ఎక్కించడం, కలుషితమైన సిరంజులు, రక్తంకు సంబంధించిన పరికరాలు వాడకం వల్ల రోగాల భారినపడి జీవితాలు కోల్పోతున్నవారు ఎంతో మంది ఉన్నారు. అయితే, యూకేలో ఇది ఒక భారీ కుంభకోణంలా సాగింది. 1948లో ఈ కుంభకోణం ప్రారంభమైంది.
బ్రిటన్ ప్రభుత్వ జాతీయ ఆరోగ్య సేవా చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తుగా ఇది పరిగణించబడుతుంది. ఈ విషయంలో ప్రధాన మంత్రి రిషి సునక్ యూకే ప్రజలకు
సోమవారం (మే 20) క్షమాపణలు చెప్పారు. గత ప్రభుత్వాలు ఈ తప్పును అంగీకరించలేదు సరికదా అసలు తప్పే జరగనట్లు వ్యవహరించాయి.
UK లో గతంలో జరిగిన ఒక వినాశనకర కుంభకోణంపై ఆ దేశ చట్టసభల్లో చర్చకు జరిగింది. కలుషిత రక్తంతో వ్యాధుల బారిన పడిన బాధితులను ఆదుకుంటామని ప్రధాని రిషి సునాక్ చట్ట సభల సాక్షిగా ప్రకటించారు. వీరికి పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. కలుషిత రక్తం కుంభకోణంకు సంబంధించి బాధితులకు యూకే ప్రభుత్వం తుది పరిహారం అందజేస్తుందని రిషి హౌజ్ లో తెలిపారు. బాధితులు 10 వేల మందికి తుది పరిహారం చెల్లిస్తామని తెలిపారు.
క్యాబినెట్ ఆఫీస్ మినిస్టర్ జాన్ గ్లెన్ చట్టసభలో మంగళవారం (మే 21) మాట్లాడుతూ, దీన్ని తాము గుర్తించామని, అత్యవసర వైద్యం అవసరమైన బాధితులకు 90 రోజుల్లో 210,000 పౌండ్ల ($267,000) మధ్యంతర పరిహారం అందుతుందని చెప్పారు. కలుషిత రక్తంతో ప్రాణాంతక వ్యాధులు సోకిన బాధితులను చూసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అర్హులని ఆయన అన్నారు.
2022లో ప్రాణాలతో బయటపడిన ప్రతి ఒక్కరికీ, మరణించిన వారి భాగస్వామికి 100,000 పౌండ్ల మొదటి మధ్యంతర చెల్లింపును అధికారులు అందజేశారు. 10 బిలియన్ పౌండ్ల ($12.7 బిలియన్) కంటే ఎక్కువగా ఉన్నట్లు నివేదించినా.. గ్లెన్ పరిహారం ప్యాకేజీ మొత్తం ధరను నిర్ధారించలేదు.
380 మంది పిల్లలతో సహా రక్తస్రావం రుగ్మతలతో బాధపడుతున్న 1,250 మంది హెచ్‌ఐవీ కలుషిత రక్త ఉత్పత్తుల బారిన పడ్డారని నివేదిక పేర్కొంది. వారిలో మూడు వంతుల మంది చనిపోయారు. ప్రసవం, శస్త్ర చికిత్స లేదా ప్రమాదం జరిగిన తర్వాత ఆసుపత్రుల్లో రక్త మార్పిడి చేయించుకున్న తర్వాత 26,800 మంది హెపటైటిస్ సీ బారిన పడ్డారని అంచనా.
రక్త ఉత్పత్తుల వినియోగం, రక్త మార్పిడి విషయంలో యూకే ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ విపత్తును నివారించవచ్చు. ఈ విషయాల్లో చాలాదేశాల కంటే యూకే వెనుకంజలోనే ఉందని ఇటీవల ఒక నివేదిక స్పష్టం చేసింది.