RCB Vs RR: అహ్మదాబాద్ లో నలుగురి అరెస్ట్.. ఆర్సీబీ ప్రాక్టీస్ రద్దు.. కోహ్లీకి కట్టుదిట్టమైన సెక్యూరిటీ..

రాట్ కోహ్లీ కి భద్రతను పోలీసులు భారీగా పెంచారు. "బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీని జాతీయ సంపదగా భావిస్తోంది. అందువల్ల ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలని అనుకుంటున్నాం.

Written By: Anabothula Bhaskar, Updated On : May 22, 2024 5:14 pm

RCB Vs RR

Follow us on

RCB Vs RR: మరికొద్ది గంటల్లో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది.. ఇప్పటికే మైదానంలోకి ప్రేక్షకులకు పోలీసులు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక షాక్ కు గురి చేసే వార్త మీడియాలో ప్రసారమవుతోంది. ” అహ్మదాబాదులో ఉగ్ర అనుమానితులను అరెస్టు చేశారు. బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీకి భద్రతను పెంచారు. బెంగళూరు జట్టు తమ సాధనను కూడా నిలిపివేసింది. మరోవైపు అహ్మదాబాద్ విమానాశ్రయంలో భద్రతను పెంచారని ” మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూర్చే విధంగా అహ్మదాబాద్ విమానాశ్రయంలో నలుగురు ఉగ్ర అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారించగా.. ఉగ్రవాదులు తాము ఇన్ని రోజులుగా ఉన్న రహస్య నివాసాన్ని, ఆయుధాలు, అనుమానాస్పద వీడియోలను బయటపెట్టారు.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పరిణామాలు మంగళవారం చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో బెంగళూరు జట్టు ప్రాక్టీస్ సెషన్ ను రద్దు చేసింది. విలేకరుల సమావేశాన్ని క్యాన్సిల్ చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేడియం వద్ద భారీగా భద్రతను పెంచారు. బెంగళూరు ఆటగాళ్లు బస చేసిన హోటల్ వద్ద సెక్యూరిటీని టైట్ చేశారు. రాజస్థాన్ జట్టు ఆటగాళ్లు ఉన్న హోటల్లోనూ నిఘా ను పటిష్టం చేశారు. దీంతో రాజస్థాన్ జట్టు కూడా తన ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసింది. పోలీసులు రక్షణ కల్పించడంతో రాజస్థాన్ జట్టు ప్రాక్టీస్ చేసుకోవడం మొదలుపెట్టింది.

ఇక విరాట్ కోహ్లీ కి భద్రతను పోలీసులు భారీగా పెంచారు. “బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీని జాతీయ సంపదగా భావిస్తోంది. అందువల్ల ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలని అనుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఆయనని ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనద్దని సూచించాం. మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవాలని విన్నవించామని” ఓ పోలీస్ అధికారి పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్ నిర్వహణలో ఎటువంటి ఇబ్బంది లేదని.. రాత్రి 7:30 కు ప్రారంభమవుతుందని ఐపీఎల్ నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించిన జట్టు క్వాలిఫైయర్ -2 కు అర్హత సాధిస్తుంది. ఓడిపోయిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్లో విజేతగా నిలిచిన జట్టుతో హైదరాబాద్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ పోరులో కోల్ కతా జట్టును చెన్నై వేదికగానే ఢీకొంటుంది.