https://oktelugu.com/

Modi Ukraine Visit: మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై స్పందించిన అమెరికా.. అగ్రరాజ్యం ఏమన్నదంటే..!

భారత ప్రధాని మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల వ్యవధిలో మూడు విదేశీ పర్యటనలు చేశారు. ఇటలీ, రష్యా, పోలాండ్, ఉక్రెయిల్‌పో పర్యటించారు. ప్రతీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 24, 2024 / 03:02 PM IST

    Modi Ukraine Visit

    Follow us on

    Modi Ukraine Visit: భారత పార్లమెంటు ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నరేంద్రమోదీ వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు. ఇప్పటి వరకు పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును మోదీ సమం చేశారు. అయితే 2014, 2018లో పూర్తి మెజారిటీతో అధికారం చేపట్టి మోదీ.. 2024 ఎన్నికల్లో మాత్రం బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌కు 35 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో టీడీపీ, జేడీయూ మద్దతులో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మోదీ విదేశీ పర్యటనకు వెళ్లారు. జీ7 దేశాల్లో భారత్‌కు సభ్యత్వం లేకపోయినా ఇటలీ ఆహ్వానం మేరకు ఆదేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇటలీకి వచ్చిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోల్డిమిర్‌ జెలెన్‌స్కీ మోదీతో భేటీ అయ్యారు. తమ దేశానికి రావాలని ఆహ్వానించారు. తర్వాత మోదీ.. మిత్రదేశమైన రష్యాలో మూడు రోజులు పర్యటించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆయనను ఆలింగనం చేసుకోవడం ఉక్రెయిన్‌కు ఆగ్రహం తెప్పించింది. తర్వాత తాజాగా మోదీ పోలాండ్, ఉక్రెయిన్‌లో పర్యటించారు. పోలాండ్‌తో వాణిజ్య ఒప్పందం జరిగి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన చేశారు. 40 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించారు. ఇక ఉక్రెయిన్‌ స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత భారత ప్రధాని ఆదేశంలో పర్యటించడం ఇదే మొదటిసారి. రష్యాలో పర్యటించిన నెల తర్వాత ఆ దేశం యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ పర్యటనను అగ్రరాజ్యం అమెరికా నిశితంగా పరిశీలించింది. తాజాగా మోదీ పర్యటనపై స్పందించింది.

    ఉక్రెయిన్‌ ప్రయత్నాలు ఫలించాలి..
    భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని పేర్కొంది. ఈ పర్యటన ద్వారా రష్యా, ఉక్రెయిన్‌ సంఘర్షణకు ముగింపు పలికితే అది బాగా ఉపయోకరంగా ఉంటుందని భావిస్తున్నామని అమెరికా భద్రతామండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ పేర్కొన్నారు.

    7 గంటలు ఉక్రెయిన్‌లో మోదీ..
    ఇదిలా ఉంటే.. మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించారు. సుమారు 7 గంటలపాటు ఆ దేశంలో గడిపారు. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. ఇంకెంత మాత్రమూ సమయం వృథా చేయకుండా కూర్చుని మాట్లాడుకోవాలని.. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా, ఉక్రెయిన్‌లకు పిలుపునిచ్చారు. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో భారత్‌ తటస్థంగా కాకుండా, శాంతివైపు ఉందని మోదీ చెప్పారు. యుద్ధంతో ఏ సమస్యకూ పరిష్కారం దొరకదని, చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌ శాశ్వత సభ్యత్వానికి ఉక్రెయిన్‌ మద్దతు పలికినట్లు పేర్కొన్నారు.