Amrutha Pranay: 2018లో మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. అగ్ర కులానికి చెందిన అమృతను దళితుడైన ప్రణయ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమృత తండ్రి మారుతీ రావు డబ్బు, హోదా, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. తన కూతురు వేరే సామాజిక వర్గానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. రూ. 10 లక్షల సుపారీ ఇచ్చి ప్రణయ్ హత్యకు ప్లాన్ చేశాడు.
గర్భవతిగా ఉన్న అమృతను రెగ్యులర్ చెకప్ కోసం ప్రణయ్ మిర్యాలగూడలో గల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్షల అనంతరం రోడ్డు పై నడుచుకుంటూ వస్తున్న ప్రణయ్ పై ఓ వ్యక్తి వెనుక నుంచి కత్తితో దాడి చేశాడు. కళ్ళ ముందు భర్త పై జరిగిన దాడికి భయాందోళనకు గురైన అమృత సహాయం కోసం ఆసుపత్రిలోకి పరుగెత్తింది. కానీ ప్రణయ్ కి తీవ్ర గాయాలు కావడంతో కన్నుమూశాడు.
తెలుగు రాష్ట్రాల్లోని దళిత సంఘాలు ప్రణయ్ హత్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. చాలా కాలం ఈ ఘటన మీడియాలో హైలెట్ అయ్యింది. ప్రణయ్ హత్య వెనుక అమృత తండ్రి ఉన్నాడని తేల్చిన పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్ పై వచ్చిన అమృత తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అమృత జీవితం ఆధారంగా వర్మ మర్డర్ పేరుతో ఓ మూవీ చేశాడు. ఈ పరిణామాలతో అమృత పాపులారిటీ తెచ్చుకుంది. అనంతరం ఆమె యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్ లో తన అభిమానులకు అందుబాటులో ఉంటుంది.
ఈ క్రమంలో అమృత ప్రణయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేస్తున్నారన్న న్యూస్ తెరపైకి వచ్చింది. తండ్రి మరణానికి కారణమైందనే కోణంలో ఆమె మీద కాంట్రవర్సీ, వ్యతిరేకత ఉన్నాయి. కాబట్టి బిగ్ బాస్ షోకి ఇలాంటి వారు కావాలి. దాంతో అమృత బిగ్ బాస్ షోకి వస్తున్నారన్న పుకార్లను జనాలు విశ్వసించారు. తాజాగా దీనిపై ఆమె క్లారిటీ ఇచ్చింది.
తన యూట్యూబ్ ఛానల్ లో అమృత వీడియో పోస్ట్ చేసింది. సదరు వీడియోలో తాను బిగ్ బాస్ షోకి వెళుతున్నానన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చేసింది. బిగ్ బాస్ షోకి రావాలని నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదు. నేను బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో కంటెస్ట్ చేస్తున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదు, అన్నారు. ఒకవేళ అవకాశం వస్తే వెళ్ళాలా? వద్దా? అప్పుడు ఆలోచిస్తానని అమృత స్పష్టత ఇచ్చింది. ఇది ఒకింత అమృత అభిమానులను ఇబ్బంది పెట్టే సమాచారమే..