Monkey Money Viral: ఈ సృష్టిలో ప్రతి జీవికి ఒక ఆశ అంటూ ఉంటుంది. కానీ మనిషికి మాత్రమే అత్యాశ ఉంటుంది. మనుషుల్లో మెజారిటీ వర్గాలకు ఏదైనా సరే పుణ్యానికి రావాలి. కష్టపడకూడదు. ఒంటి నుంచి చెమట చుక్క రాకూడదు. కాలు బయట పెట్టకుండా కోట్లు ఇంట్లోకి రావాలి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా.. ఎన్ని రకాల అనుభవాలు ఎదురైనా సరే ఇటువంటి మనుషులు మారరు. మారే అవకాశం కూడా లేదు. అలాంటి సంఘటన ఒకటి జరిగింది. ఆ సంఘటన ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత రకరకాల వీడియోలు తెరపైకి వస్తున్నాయి. అందులో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే.. ఇంకొన్ని కనువిప్పు కలిగిస్తుంటాయి. అలాంటి వీడియోనే ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కోతి డబ్బు వెదజల్లితే.. దాన్ని ఏరుకోవడానికి ప్రజలు పోటీపడ్డారు. ఔరైయా జిల్లా దొండాపూర్ ప్రాంతంలో అనూజ్ అనే రైతు ఒక భూమి కొనుగోలు చేశాడు. దానిని రిజిస్ట్రేషన్ చేయించడానికి 80 వేల నగదు తన ద్విచక్ర వాహనంలో ఉంచాడు. ఇందులో భాగంగా ఓ ప్రాంతంలో ఆ వాహనాన్ని ఆపాడు. అతడు మూత్రం పోయడానికి వెళ్లగా.. ఓ కోతి వచ్చి డబ్బు సంచిని తీసుకుంది. ఆ తర్వాత ఒక చెట్టు పైకి ఎక్కింది. ఆ సంచిని చేతివేళ్లతో చించి.. నోట్లను మొత్తం కిందికి విసిరేసింది.
పోటీపడ్డారు
ఆ డబ్బు తాను కష్టపడి సంపాదించిందని.. భూమి రిజిస్ట్రేషన్ కోసం దాచుకున్నదని ఆ రైతు చెప్పినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదు. నోట్లు కింద పడుతుండగా.. చేరుకోవడానికి పోటీపడ్డారు. చివరికి ఆ రైతు అష్ట కష్టాలు పడి ఆ నోట్ల సంచిని దక్కించుకున్నప్పటికీ.. అందులో కేవలం 52,000 మాత్రమే ఉన్నాయి. దాదాపు 28 వేల నగదు చూస్తుండగానే ఇతర వ్యక్తుల పాలయింది. ” నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది. భూమి రిజిస్ట్రేషన్ కోసం ఉంచుకున్నాను. కానీ కోతి వల్ల ఆ నగదు ఇతరుల పాలైంది. ఈ కష్టం పగవాడికి కూడా రావద్దు. ఆ డబ్బు తీసుకోవద్దని నేను వేడుకుంటున్నప్పటికీ చుట్టుపక్కల వారు వినిపించుకోలేదు. పైగా ఆ నగదును దక్కించుకోవడంలో పోటీపడ్డారు. మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుందని” ఆ రైతు విలపిస్తూ చెప్పాడు.
A monkey snatched a bag containing ₹80,000 and then rained cash from a tree in Uttar Pradesh. pic.twitter.com/JzjWj50qHQ
— The Tatva (@thetatvaindia) August 27, 2025