
Visakhapatnam Real Estate: ఏ ప్రాంతంలో అభివృద్ధికి అవకాశం ఉంటుందో.. ఆ ప్రాంతంలో భూ క్రయ, విక్రయాలు జోరుగా సాగుతాయి. అభివృద్ధికి అవకాశమున్న ప్రాంతాల్లో ముందుచూపుతో ఎక్కువ మంది భూములు కొనుగోలు చేస్తుంటారు. ఆ లెక్కన విశాఖతో పాటు పరిసర ప్రాంతాల్లో భూముల క్రయ, విక్రయాలు పెరగాలి. అక్కడ పాలనా రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండడమే అందుకు కారణం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అమరావతిని నిర్వీర్యం చేస్తూ.. విశాఖకు పెద్దపీట వేస్తూ జగన్ భూ కేటాయింపులు, ప్రాధాన్యత ప్రాజెక్టులను కేటాయిస్తూ వస్తున్నారు. అది అల్టిమేట్ గా భూ క్రయ, విక్రయాలపై ప్రభావం చూపాలి. కానీ అందుకు విరుద్ధంగా పరిస్థితులు ఉన్నాయి. పాలనా రాజధాని ఏర్పాటుచేయాలనుకుంటున్న భీమిలి, విజయనగరం ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు డల్ గా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఆశించిన పురోగతి లేక..
విశాఖతో పాటు చుట్టపక్కల జిల్లాల్లో ఆస్తుల క్రయ, విక్రయాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకుండా పోతోంది. అదే సమయంలో రాజధాని అమరావతి ప్రాంతమైన ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో స్థిరాస్థి క్రయ, విక్రయాలు పెరుగుతుండడం విశేషం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో రాజధాని మార్పుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతం పడిపోయింది. అయితే ఇటీవల క్రమేపీ పెరుగుతుండడంతో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాదే ఉన్న నేపథ్యంలో అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరందుకోవడం, విశాఖలో తగ్గముఖం పట్టబడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిని రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితికి ఇది సంకేతంగా వారు భావిస్తున్నారు.
విశ్వసించని ఉత్తరాంధ్ర ప్రజలు..
పాలనా రాజధానితో ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని వైసీపీ పాలకులు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ అక్కడి ప్రజలు పెద్దగా విశ్వసించలేదు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రెఫరెండంగా భావించినా విద్యాధికులు, పట్టభద్రులు తిరస్కరించారు. టీడీపీ అభ్యర్థికి జైకొట్టారు. అటు వ్యాపార వర్గాలు సైతం రాజధాని అంశాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదని స్థిరాస్థి వ్యాపార గణాంకాలు తెలియజేస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతంలో వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. పాలనా రాజధాని విశాఖను అధిగమించి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆదాయపరంగా కూడా విశాఖ కంటే అమరావతి ప్రాంతం ముందుండి ప్రభుత్వానికి గట్టి సంకేతాలే పంపుతోంది. విశాఖ రాజధాని అంటున్న భూముల కొనుగోలుదారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అచీచూతీ వ్యవహరిస్తున్నారు. అనవసరంగా కొనుగోలు చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకని భావిస్తున్నారు.
పడిపోయిన ఆదాయం..
పాలనా రాజధాని ప్రాంతంగా భీమిలి ఉంది. ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఏడాది కంటే తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి భీమిలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రిజిస్ట్రేషన్ల రూపంలో రూ.56.94 కోట్ల ఆదాయం సమకూరితే..ఈ ఏడాది మాత్రం రూ.50 కోట్లు మాత్రమే వచ్చింది. వాణిజ్యపరంగా గుర్తింపు పొందిన పెందుర్తిలోనూ వెనుకబాటే. గత ఫిబ్రవరి మాసాంతం లో రూ.73 కోట్ల ఆదాయం ఉండగా.. ఈ ఏడాది రూ.10 కోట్లు వెనుకబడింది. రూ.63 కోట్లే సమకూరింది. స్పష్టమైన లోటు కనిపిస్తోంది. అటు శ్రీకాకుళం, విజయనగరంలో సైతం రిజిస్ట్రేషన్ల పరంగా ఏమంత పురోగతి లేదు. కొత్తగా లేఅవుట్లు వేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. గతంలో ఏడాదికి వంద లేఅవుట్ల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకొచ్చేవారు. కానీ ఇప్పుడు ఏక సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

అమరావతిలో జెట్ స్పీడ్ తో..
అదే సమయంలో రాజధాని అమరావతి పరిసర జిల్లాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జెట్ స్పీడులో సాగుతోంది. వృద్ధి రేటు గణనీయంగా నమోదవుతోంది. గుంటూరులో 17.48 శాతం, పల్నాడులో 24.95 శాతం, బాపట్లలో 18.44 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 25.86 శాతం చొప్పున ఆదాయం పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. వాటితో పోల్చుకుంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో పెరిగిన ఆదాయం 2.84 శాతం మాత్రమే. మధ్యలో భూమి మార్కెట్ ధర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతోనే ఈ వృద్ధి సాధ్యమైంది. అయితే విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పట్టడానికి రాజధాని ఇష్యూయే ప్రధాన కారణం. వైసీపీ పాలనా రాజధానిగా విశాఖను ప్రకటించి మూడేళ్లవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదు. పైగా న్యాయపరిధిలో ఉండడం, అనేక చిక్కుముళ్లు ఉండడంతో అనుకూల భావన రావడం లేదు. దీంతో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. పైగా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. అమరావతికి మద్దతు పెరుగుతోంది. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారులు పునరాలోచనలో పడ్డారు. ఒక ఏడాది వెయిట్ చేయాలని భావిస్తున్నారు.