
Chanakya Niti Success: జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కృషి, దీక్ష కావాలి. దానికి అనుగుణంగానే మన పనులు ఉండాలి. లక్ష్యం చేరుకునే క్రమంలో ఎన్ని బాధలు, అవాంతరాలు వచ్చినా వెనుదిరగొద్దు. అదే ఒక లక్ష్యకుడి లక్ష్యం. వేయి మైళ్ల దూరమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభిస్తాం. అలాగే ఎంత పెద్ద విజయమైనా మనం కష్టపడితే వస్తుంది. ఊరికే కూర్చుంటే ఏది రాదు. మన లక్ష్యం మీదే గురి ఉండాలి. అందుకనుగుణంగా మన పని ఉండాలి. అప్పుడే విజయం నీ దాసోహం అవుతుంది. విజయం సాధించాలంటే ఏం చేయాలనే దానిపై ఆచార్య చాణక్యుడు వివరించాడు.
త్వరగా మేల్కోవాలి
విజయం సాధించాలనుకునే వాడికి సమయం విలువ తెలిసి ఉండాలి. త్వరగా నిద్ర నుంచి లేవాలి. మనకు కావాల్సిన సమయంలోనే నిద్ర పోవాలి. మిగతా సమయంలో అనుకున్న పని చేస్తూనే ఉండాలి. నిద్ర లేవగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చేసే పనుల్లో తప్పులు ఉండవు. నేర్చుకునే విషయాల మీద ఏకాగ్రత ఉంటుంది. తెల్లవారు జామున నిద్ర లేవడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే మన పనులు సాఫీగా సాగడానికి ఆస్కారం ఏర్పడుతుంది.
నిర్లక్ష్యం వద్దు
రేపు చేద్దాంలే అనే ధోరణికి టాటా చెప్పండి. రేపు చేసే పనిని ఈ రోజు చేయాలి. ఈ రోజు చేసే పనిని ఇప్పుడే చేయాలని రామాయణంలో రాముడికి రావణాసురుడు చెప్పిన సత్యం. రావణాసురుడు రాక్షసుడు అయినా అతడి విజయాలను చూసి రాముడు అతడిని అడుగుతాడు. అప్పుడు అతడు చెప్పిన సందేశం ఇదే. ఆచార్య చాణక్యుడు కూడా అదే చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృథా చేయొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీకు జీవితంలో ఎదురుండదు.
పద్ధతి ప్రకారం
పనులు అందరు చేస్తారు. కానీ పద్ధతి ప్రకారం చేసే వారే ముందుంటారు. రోజు మనం చేయాల్సిన పనులు ప్రణాళిక ప్రకారం చేసుకుంటే మంచిది. దీనికి గాను పక్కా ప్రణాళిక వేసుకోవాలి. పని ప్రాధాన్యం ప్రకారం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చేసే పనులు విభజించుకోవాలి. పక్కాగా అమలు చేసుకుంటే మంచి ఫలితాలు రావడం ఖాయం. ఇలా చేయడం వల్ల జీవితంలో మంచి ఫలితాలు అందుకునే ఆస్కారం ఉంటుంది. ఇదే విజయానికి తొలి మెట్టు అని భావించుకోవాలి.

ఆరోగ్యం విషయంలో..
పనుల హడావిడిలో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. జీవితంలో మనం ముందుకెళ్లాలంటే మన ఆరోగ్యంపై దృష్టి సారించాలి. మన కలలను సాధించుకునే క్రమంలో ఉదయం వాకింగ్, యోగా, వ్యాయామం వంటివి చేయాలి. దీంతో మన ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రోగాలు లేకుండా హాయిగా ఉంటే మనం పనులు సులభంగా చేసుకోవచ్చు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. దీంతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది.