
Chandrababu: గుర్తుంచుకోండి మళ్ళీ అధికారంలోకి వస్తాం మీ లెక్కలన్నీ తెలుస్తాం అని చంద్రబాబు ప్రతీసారి అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులపై మండిపడే మోతాదును పెంచారు. అధికార పార్టీని భూస్థాపితం చేసే వరకు విశ్రమించేది లేదని చెప్పిన ఆయన అన్నంత పని చేసేలాగే ఉన్నారు. ఆయన పెడుతున్న బహిరంగ సభలు ఎన్నికల సభల్లాగే ఉంటున్నాయి. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ, అక్కడి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై దుమదుమలాడుతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షం అనేది లేకుండా చేయాలని భావించారు. క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులను భయపెట్టో, బెదిరించో చాలాచోట్ల తమదారిలోకి తెచ్చుకున్నారు. వీరిలో పలువురు ఎమ్మెల్యేలు కూడా ఉండటం గమనించదగ్గ విషయం. తమ అనుచర వర్గాలను కాపాడుకునేందుకు తప్పని పరిస్థితుల్లో వైసీపీలోకి చేరేలా చేసుకున్నారు. ఇప్పుడు వారంతా వైసీపీ జెండా కప్పుకున్నా, టీడీపీ నేతలతో లోపాయికారికంగానే వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధిష్టానం కొంతమంది చేతుల్లోనే ఉందని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తిలో ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ లను టార్గెట్ చేసిన వైసీపీ నేతలు అసెంబ్లీలో కూడా వదల్లేదు. కించపరిచినట్లు మాట్లాడటంపై మండిపడ్డారు. ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అసెంబ్లీని బహిష్కరించారు. మరలా ఈ సభలో అడుగు పెడితే ముఖ్యమంత్రి అయ్యే వస్తానని సవాల్ చేసి వచ్చేశారు. అయితే, ఆ తరువాత కూడా వైసీపీ నేతలు ఆయనను వదల్లేదు.

రెండు రోజులు కృష్ణా జిల్లాలో ఉన్న ఆయన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఫైర్ అయ్యారు. బూతుల ఎమ్మెల్యేను సాగనంపాలని పిలుపునిచ్చారు. ఆయను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీడీపీ రాజకీయ భిక్ష పెడితే చరిత్ర హీనులుగా మారారన్నారు. ప్రతి ఒక్కరు టీడీపీ జెండా పట్టుకొని రోడ్లపైకి వస్తే ఈ బూతుల ఎమ్మెల్యే తిరగగలడా అని ప్రశ్నించారు. అలాగే, నూజివీడు ఎమ్మెల్యేపైనా విమర్శలు ఎక్కుపెట్టారు. అవినీతి అంతు లేకుండా పోయిందని అన్నారు. ఇసుకను, అటవీ భూమినీ వదలడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వీరి పని పడతామని పేర్కొన్నారు.
తెలంగాణ మంత్రులు ఏపీపై చేస్తున్న వ్యాఖ్యలు బాధగలిగిస్తున్నాయని చంద్రబాబు అన్నారు. ఇక్కడి రోడ్ల విషయాన్ని ప్రస్తావించడాన్ని గుర్తు చేశారు. వైసీపీ అవినీతి, అకృత్యాలకు పాల్పడుతున్న ప్రజలకు కోపం రావడం లేదా అని ప్రశ్నించారు. ఆయన ఫ్రస్టేషన్ లో న్యాయం లేకపోలేదు. వైసీపీ అధికారంలో ఉన్న ఈ నాలుగేళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగకపోగా, అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారు. నిరుద్యోగ రేటు పెరిగిపోయింది. ఆ మేరకు అసంతృప్తి తటస్థుల్లోనూ కనబడుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రజల్లో ఆ టెంపర్ ను అలాగే కొనసాగించాలనేది చంద్రబాబు ఉద్దేశ్యంలా కనబడుతుంది.