Pawan Kalyan: అసలు జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తుంది? టీడీపీతో కలిస్తే ఆ పార్టీకి కేటాయించే సీట్లు ఎన్ని? అసలు ఏయే నియోజకవర్గాల్లో జనసేన బరిలో దిగనుంది? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్. పవన్ యువశక్తిలో మాట్లాడిన తరువాత పొత్తులు తప్పవని సంకేతాలిచ్చారు. ‘గౌరవం’ అన్న పదాన్ని ఉపయోగించారు. గౌరవం ఉన్నచోట మాత్రమే ఉండగలమని.. అగౌరవంగా చూస్తే మాత్రం ఆలోచించే ప్రసక్తే లేదని తేల్చేశారు. అది టీడీపీకి పంపిన సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం పొత్తు కుదిరిపోయిందని.. 22 నుంచి 28 అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్ సభ స్థానాలంటూ ప్రచారం మొదలు పెట్టింది. ఎల్లో మీడియాతో పాటు టీడీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఇదే రకంగా ప్రచారం చేస్తోంది.

వాస్తవానికి గత ఎన్నికల్లో.. ట్రయాంగిల్ ఫైట్ మూలంగా 53 స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. అక్కడ జనసేన గణనీయమైన ఓట్లు చీల్చడం వైసీపీ విజయానికి ప్రధాన కారణం. అందుకే 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు తగ్గకుండా సీట్లు ఇవ్వాలని జన సైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది సహేతుకమైన డిమాండ్ అని వారు భావిస్తున్నారు. అన్ని సీట్లు కేటాయించడం కుదిరే పని కాదని తెలుగు తమ్ముళ్లు వాదిస్తున్నారు. జనసేనకు బలమైన అభ్యర్థులు లేరని.. ఏ మాత్రం తేడా కొడితే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు. అందుకే 25లోపు అసెంబ్లీ స్థానాలను సర్దుబాటు చేసుకుంటే ఇరు పార్టీలకు బాగుంటుందని సూచిస్తున్నారు.
అయితే జనసేన హైకమాండ్ ఆలోచన వేరే విధంగా ఉంది. వచ్చే ప్రభుత్వంలో కీలక భాగస్వామ్యం ఉండాలని పవన్ కోరుకుంటున్నారు. సీఎం పదవి సైతం షేరింగ్ చేయాలన్న డిమాండ్ ఆ పార్టీ నుంచి ఉంది. ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి 88 మ్యాజిక్ ఫిగర్ దాటాలి. అందుకే 50 స్థానాలు డిమాండ్ చేసి.. అందులో అత్యధిక స్థానాల్లో గెలుపొందితే రాబోయే ప్రభుత్వంలో కీ రోల్ పోషించవచ్చన్నది జనసేన భావన. అందుకే పవన్ గౌరవమన్న మాట ప్రయోగించారు. తగిన స్థానాలు కేటాయించకుండా అగౌరవపరిస్తే మాత్రం ఒప్పుకునేది లేదన్నట్టు మాట్లాడారు. పవన్ టీడీపీకి మానసికంగా సిద్ధం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

టీడీపీతో అధికారికంగా పొత్తు పెట్టుకున్నా.. సీట్లు పరంగా మెరుగైన స్థితిలో ఉండాలని జనసేన భావిస్తోంది. కేవలం ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలే కాకుండా అన్ని జిల్లాలో ప్రాతినిధ్యం ఉండాలన్నది జనసేన హైకమాండ్ భావన. అయితే టీడీపీ మాత్రం జనసేన బలంగా ఉన్న ఉభయగోదావరి, విశాఖ, విజయవాడ నగరాల్లో సీట్లు కేటాయించాలని చూస్తోంది. 3 నుంచి 5 లోక్ సభ స్థానాలను ఆఫర్ చేస్తోంది. జనసేన మాత్రం 50 అసెంబ్లీ స్థానాలకు తక్కువ కాకుండా చూసుకోవాలన్న ఆలోచనతో ఉంది. అందుకే టీడీపీకి అటు కాస్తా హెచ్చరికలతో కూడిన అల్టిమేటే.. గౌరవం, అగౌరవం అన్న పదాలను పవన్ సంభోదించారని విశ్లేషణలు వెలువడుతున్నాయి.