India vs Sri lanka 3rd Odi: వన్డే క్రికెట్ చరిత్రలో టీం ఇండియా చరిత్ర సృష్టించింది. సంక్రాంతి రోజు భారత అభిమానులకు పండగ బహుమతి ఇచ్చింది. ఆదివారం తిరునంతపురంలో జరిగిన మూడో వన్డే లో సమిష్టిగా చెలరేగిపోయింది.. ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.. అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన ఏకైక జట్టుగా చరిత్ర సృష్టించింది..ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది.. విరాట్ కోహ్లీ ( 110 బంతుల్లో 13 ఫోర్లు, 8 సిక్సర్ల తో 166 నాట్ అవుట్), శుభ్ మన్ గిల్(97 బంతుల్లో 14 ఫోర్లు,2 సిక్సర్ల తో 116) చెల రేగడం.. కెప్టెన్ రోహిత్ శర్మ (42), శ్రేయాస్ అయ్యర్(38) మెరవడంతో భారత్ 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బౌలర్లలో కసూన్ రజిత, లాహిరు కుమార రెండు వికెట్లు, కరుణ రత్న ఒక వికెట్ తీశారు.

సిరాజ్ ధాటికి
అనంతరం బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక మహమ్మద్ సిరాజ్ (4/32) ధాటికి 22 ఓవర్లలో 73 పరుగులకే కుప్ప కూలింది.. నువవిందు ఫెర్నాండో (19), డసన్ షనక(11), కసూన్ రజితా(13 నాట్ ఔట్) మినహా ఎవరు కూడా డబల్ డిజిట్ స్కోర్ చేయలేదు. భారత బౌలర్లలో సిరాజ్ కు తోడుగా మహమ్మద్ షమీ, కులదీప్ యాదవ్ కు రెండేసి వికెట్లు దక్కాయి.. అషేన్ బండారా గాయం కారణంగా బ్యాటింగ్ కు రాలేదు. ఈ విజయంతో మూడు వన్డేలా సీరిస్ ను రోహిత్ సేన 3_0 తేడాతో క్లీన్ స్వీట్ చేసింది..

ఇదే మొదటిసారి
317 పరుగుల తేడాతో వన్డే క్రికెట్ చరిత్రలో ఓ జట్టు గెలవడం ఇదే మొదటిసారి. గతంలో ఐర్లాండ్ పై న్యూజిలాండ్ 290 పరుగుల తేడాతో గెలిచింది.. ఆ రికార్డును తాజాగా భారత్ అధిగమించింది.. భారీ విజయంతో భారత్ చరిత్ర సృష్టిస్తే… ఘోర పరాజయంతో శ్రీలంక చెత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో(1), కుశాల్ మెండీస్(4), అసలంక(1).. కీలక బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్ కే అవుట్ కావడంతో శ్రీలంక దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.