Pendurthi: తెల్లవారితే శ్రావణ శుక్రవారం. వరలక్ష్మీదేవి పూజ చేసేందుకు సామాగ్రిని సిద్ధం చేశారు. లక్ష్మీ కటాక్షం పొందడానికి సన్నాహాలు పూర్తి చేశారు. అంతలోనే తీవ్ర మనస్తాపంతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు ఇద్దరూ మృతి చెందగా.. కుమార్తె చావు బతుకులతో కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన విశాఖలోని పెందుర్తిలో శుక్రవారం వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
పెందుర్తి మండలం గొరపల్లిలో కల్లూరి సత్తిబాబు కుటుంబంతో నివాసముంటున్నారు. ఆయనకు భార్య సూర్యకుమారి, కుమార్తె నీలిమ, కుమారుడు సంతోష్ కుమార్ ఉన్నారు. సత్తిబాబు కిరాణా దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా సత్తిబాబు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చే క్రమంలో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో రుణ దాతల నుంచి ఒత్తిడి ఎదురవుతోంది. అవమానాలు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి సత్తిబాబు, భార్య, కుమార్తెలకు పురుగుల మందు ఇచ్చి…తాను కూడా తాగాడు. దీంతో ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు హుటాహుటిన వారిని విశాఖ కేజిహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ సత్తిబాబు శుక్రవారం ఉదయం మృతి చెందాడు. మధ్యాహ్నం భార్య సూర్య కుమారి మరణించారు. కుమార్తె నీలిమ పరిస్థితి విషమంగా ఉంది.
కుమారుడు సంతోష్ కుమార్ఇంట్లో లేని సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్నారు. పిల్లలను చదివించడంతో పాటు కుటుంబ అవసరాల నిమిత్తం సత్తిబాబు అప్పులు చేసినట్లు తెలుస్తోంది. అప్పులకు వడ్డీలు అధికమవుతుండడంతో ఏం చేయాలో తెలియక మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కావడంతో.. అందుకు అవసరమైన సామాగ్రిని సత్తిబాబు తీసుకొచ్చారు. పూజ చేయకముందే ఈ ఘాతుకానికి వారు పాల్పడడం విచారకరం.