Homeజాతీయ వార్తలుMaharashtrian Farmers: పగిలిన పాదాలు: చిందిన నెత్తురు.. ఈ మహా రైతుల పోరాటం హృదయ విదారకం

Maharashtrian Farmers: పగిలిన పాదాలు: చిందిన నెత్తురు.. ఈ మహా రైతుల పోరాటం హృదయ విదారకం

Maharashtrian Farmers
Maharashtrian Farmers

Maharashtrian Farmers: పొలాలనన్నీ హలాల దున్నే రైతుల నిరసన బాట పట్టారు. విరామమెరుగక పరిశ్రమించే కర్షకులు ఆందోళనకు దిగారు. నరాల బిగువూ కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ముంబాయి పయనమయ్యారు. పనిలో, కార్ఖానాలో పరిశ్రమించే అసంఘటిత కార్మికులూ వీరితో కలిసి నడుస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌జిల్లా డిండోరా నుంచి ముంబై దాకా.. దాదాపు 200 కిలోమీటర్ల దూరం పాదయాత్రగా వెళ్లి అక్కడి ప్రభుత్వానికి తమ గోడును ప్రత్యక్షంగా వినిపించుకోవడానికి.. పదివేలమందికిపైగా ఐదురోజులుగా పాదయాత్రగా ముందుకు సాగుతున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో, ఆ పార్టీ అనుబంధ విభాగమైన ఆలిండియా కిసాన్‌ సభ నేతృత్వంలో.. ఒక్కొక్క అడుగూ ప్రభంజనమై కదులుతున్నారు. రోడ్డు పక్కన చిన్నచిన్న దుకాణాల్లో అమ్మే హవాయి చెప్పులే వారి పాదాలకు రక్ష. అవి అరిగిపోయి, ఎక్కడ తెగిపోతే అక్కడే వదిలేసి నడక సాగిస్తున్నారు.

ఎవరికైనా కాళ్లు పగిలిపోయి రక్తమోడుతుంటే.. మరీ నడవలేని పరిస్థితి వస్తే.. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి, చికిత్స చేయించుకుని మళ్లీ నడక మొదలుపెడుతున్నారు. ‘పాదాలు పగిలి రక్తమోడుతున్నాయి కదా.. యాత్ర ఆపేయొచ్చుగా?’ అని ఎవరైనా అడిగితే.. ‘ఆపే ప్రశ్నే లేదు’ అంటున్నారు! ఎందుకంటే.. పగిలి, రక్తమోడుతున్న పాదాలు పైకి కనిపించే గాయాలు మాత్రమే! ఆ బాధ కన్నా.. తమను పట్టించుకోని సర్కారు తీరుతో పగిలిన వారి గుండెల్లో బాధే ఎక్కువ.. అందుకే అడుగు ముందుకేస్తున్నారు. బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల ఘర్మజలానికి ఖరీదు లేదని మహాకవి శ్రీశ్రీ అన్నాడుగానీ.. తాము చిందించే చెమటకు కనీసం ‘మద్దతు ధర’తోనైనా ఖరీదు కట్టాలన్నది వారి ప్రధాన డిమాండ్‌. దాంతోపాటు.. ధరలు పడిపోయి నష్టాలపాలైన ఉల్లి రైతులకు క్వింటాకు రూ.600 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాలని, వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, రోజుకు 12 గంటలు విద్యు త్తు ఇవ్వాలని, విద్యుత్తు బిల్లులు మాఫీ చేయాలని, పంట నష్టపరిహారాలను సత్వరం ఇవ్వాలని.. ఇలా మొత్తం 17 డిమాం డ్లు ఉన్నాయి. ఈ రైతుల్లో చాలా మంది గిరిజన తెగలకు చెందినవారే ఉన్నారు.

Maharashtrian Farmers
Maharashtrian Farmers

ఈ నేపథ్యంలో గురువారం సీఎం ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌.. మహారాష్ట్ర సచివాలయం మంత్రాలయంలో రైతుల ప్రతినిధులతో భేటీ అయి చర్చించారు. రైతుల డిమాండ్ల పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ నేపథ్యంలో.. తమ పాదయాత్రను ముంబై శివార్లలో తాత్కాలికంగా నిలిపివేస్తామని రైతు ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు ఒప్పుకొందని.. వాటికి సంబంధించి జారీ చేసిన ఉత్తర్వులను నాలుగు రోజుల్లోగా తాలూకా స్థాయిలో అమలు చేయడానికి సమయం ఇచ్చామని.. ఆలోగా వాటి అమలు మొదలైతే తమ పాదయాత్రను ఉపసంహరించుకుని వెనుదిరుగుతామని తెలిపారు. లేదంటే పాదయాత్ర ముంబైలోకి ప్రవేశస్తుందని హెచ్చరించారు. కాగా.. 2018లో కూడా రైతులు ఇలాగే పాదయాత్రగా సాగారు. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ నెరవేర్చకపోవడంతో వారు మళ్లీ ఈ పాదయాత్ర చేపట్టారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular