
YS Viveka Murder Case: జగన్ చుట్టూ ఉన్నవారు… ఆయన గురించి ఒక మాటలో చెప్పాలంటే తిక్క కేసు అంటారు. ఎవరి ముందూ తలవంచడు. ఎవరితోనూ సఖ్యత కొనసాగించడు.. తన అవసరం మేరనే నడుచుకుంటాడు..ఆఫ్ కోర్స్ లౌక్యం అనేవి అతని డిక్షనరీలో కనిపించవు.. అప్పట్లో 2014లో ఖమ్మంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కనీసం వారిని కలిసేందుకు కూడా ఇష్టపడలేదు.. తమ్మినేని వంటి వారు ఫోన్ చేసినా కూడా స్పందించని దాఖలాలు ఉన్నాయి. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బిజెపితో ఎందుకు సఖ్యతగా ఉంటున్నాడు అంటే… అది అతడి అవసరం. పైగా అక్రమస్తుల కేసులో ఇప్పటికీ తన బెయిల్ మీద ఉన్నాడు. జగన్ బెయిల్ రద్దు పై సిబిఐ దూకుడుగా వ్యవహరించకుండా బిజెపి హై కమాండ్ కాపాడుతోంది అని ప్రచారం పొలిటికల్ సర్కిల్లో ఎప్పటి నుంచి సాగుతోంది.. అంతేకాదు వైయస్ వివేకా మర్డర్ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ తన కుటుంబాన్ని ఇన్వాల్వ్ చేయకుండా జగన్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది.
-మొదటి నుంచీ తలనొప్పి
వివేకానంద రెడ్డి మర్డర్ కేసప్పుడు జగన్ తీసుకున్న స్టాండ్ కు ఒక నిలకడ లేకుండా పోయింది. వివేకానంద రెడ్డి హత్యకు గురైనప్పుడు మొదట్లో జగన్ తన పేపర్ ద్వారా చంద్రబాబు మీద విమర్శలు చేశాడు.. నారాసుర చరిత్ర అంటూ పేజీలకు పేజీల వార్తలు కుమ్మరించాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలి అని డిమాండ్ చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత సిబిఐ అవసరం లేదు, లోకల్ పోలీసులు చూసుకుంటారు అని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ వివేకానంద రెడ్డి కూతురు అస్సలు ఊరుకోలేదు. ఢిల్లీ వెళ్ళింది. కోర్టు మెట్లు ఎక్కింది. డాక్టర్ కాబట్టి… తనకు విస్తృత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో పలు కీలక ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించింది. కోర్టు కూడా ఆమె వాదనతో ఏకీభవించి ఈ కేసులో సిబిఐని ఇన్వాల్వ్ చేసింది. ఇక వివేకానంద మర్డర్ కేసులో మొదటి నుంచి అవినాష్ రెడ్డి వైపే అందరి వేళ్ళూ చూపిస్తున్నాయి. హత్యకు గురయిన వివేకానంద రెడ్డి జగన్ సొంత బాబాయ్ అయినప్పటికీ… జగన్ ఇప్పటికీ అవినాష్ రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇక ఈ కేసు ఇప్పట్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. అలాగని త్వరలో ముగిసే అవకాశం కూడా కనిపించడం లేదు. అతడు సినిమాలో శివారెడ్డి హత్య కేసు మాదిరే సిబిఐ విచారిస్తోంది.. అంటే ఎప్పటికైనా నిందితులు జైలుకు వెళ్లక తప్పదు అనే సంకేతాలు కూడా ఇస్తుంది.. మరి నిజానిజాలు ఎప్పుడు తేలుతాయి అనే ప్రశ్నకు కాలమే సమాధానం అని చెప్తోంది. ఇదంతా జరుగుతుండగానే సిబిఐ తాజాగా ఈ కేసులో కీలకంగా ఉన్న సునీల్ ను వ్యతిరేకిస్తూ కోర్టుకు సమర్పించిన కౌంటర్ పిటిషన్లో దిమ్మతిరిగి పోయే వాస్తవాలు బయటపెట్టింది.. హత్య ఎలా జరిగింది? దీని వెనుక ఉన్నది ఎవరు? తర్వాత నిందితులు ఏం చేశారు? అనే వివరాలను పూస గుచ్చినట్టు చెప్పింది. ఇక ఇందులో అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం 6:30 నిమిషాలకు 9000 266234 నెంబర్ కు ఫోన్ చేశాడు. ఆ నంబర్ తో అవినాష్ 351 సెకండ్లు మాట్లాడాడు. 6.40 గంటలకు, 6.41 గంటలకు మరో రెండు కాల్స్ చేశాడు. సిబిఐ ఇక్కడ వరకే పరిమితమైంది.. కానీ ఒక సెక్షన్ మీడియా మాత్రం తన కథనంలో మైండ్ బ్లాక్ అయ్యే విషయాలను పొందుపరుస్తున్నది. ఈ నెంబర్ జగన్ సతీమణి భారతి రెడ్డి ఇంట్లో పనిచేసే నవీన్ పేరిట ఉందని ప్రచారం చేసత్ోంది.. భారతి రెడ్డి తో మాట్లాడాలి అంటే ఈ నెంబర్ కి కాల్ చేశారని.. నవీన్ ను ఇదే విషయం మీద సిబిఐ ప్రశ్నించిందని చెబుతోంది.

దీని అంతరార్థం ఏమిటయ్యా అంటే.. ఆమె కాల్స్ రిసీవ్ చేసుకునే నెంబర్ కు అవినాష్ కాల్ చేసి, మొత్తం వివరాలు చెప్పాడు అంటూ భారతి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఈ మర్డర్ కేసులో కీలక పాత్ర పోషించారని చెబుతోంది. ఒకవేళ ఆ మీడియా చెప్పింది కనుక నిజమైతే ఈ కేసు మరింత క్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.. మరో వైపు కేసులో బిజెపి చేసిన సహాయం కూడా పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ జగన్ పాత్ర ఈ కేసులో గనుక ఉండి ఉంటే.. తను మొదట్లో సిబిఐ ఎంక్వయిరీ ఎందుకు కోరతాడు? అనేది చిక్కుముడి ప్రశ్నగా ఉంది. మరోవైపు ఈ కేసు ఏపీ రాజకీయాల్లో పూర్తి సంక్లిష్టంగా మారే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక ఈ దర్యాప్తులో సిబిఐ పలు సాంకేతిక అంశాలను వాడుకుంటున్నది. అవినాష్ కాల్ హిస్టరీని సేకరించి, దాని ఆధారంగా కేసును బిల్డప్ చేస్తోంది. మర్డర్ కేసును గుండెపోటుగా ప్రచారం చేయడం దగ్గర నుంచి సాక్షాల తుడిపివేత ప్రయత్నాల దాకా అవినాష్ కు వ్యతిరేకంగా వివరాలు క్రోడీకరిస్తుంది. గూగుల్ మ్యాప్ ఆన్ లో ( అన్ లో లేకున్నా) ఉంటే కస్టమర్ ఎప్పుడెప్పుడు ఏ ఏ ప్రాంతాల్లో సంచరించడం తెలుసుకోవచ్చు. దీనికి సిబిఐ ఢిల్లీలోని సిఎఫ్ఎస్ఎల్ సహాయం తీసుకుంది. నేర చరిత్ర ఉన్నవాళ్లు, కాన్ఫిడెన్షియల్ పర్యటనలు చేసే వాళ్ళు, గూగుల్ టేక్ అవుట్ గురించి తెలిసినవాళ్లు ఎప్పుడూ మ్యాప్స్ ను ఆఫ్ లో ఉంచుతారు. లేదా మ్యాప్స్ ఫీచర్ డిసేబుల్ చేస్తారు. ఇప్పుడు ఇదే వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకంగా మారబోతోంది.