The Lost Dog: గుంపులో తప్పిపోయింది.. 250 కిలో మీటర్ల నడిచి ఇంటికి చేరింది.. అద్భుతం చేసిన శునకం!

మన పెంపుడు జంతువుల్లో విశ్వాసమై జంతువు శునకం. మనుషులతో ప్రత్యేక అనుబంధం.. ప్రేమకు మారుపేరుగా ఉంటుంది. ఎనలేని విశ్వాసం చూపుతుంది. అందుకే చాలా మంది శునకాలను పెంచుకుంటారు.

Written By: Raj Shekar, Updated On : August 1, 2024 12:29 pm

The Lost Dog

Follow us on

The Lost Dog: ప్రపంచంలో విశ్వాసకరమైన జంతువు ఏదైనా ఉందంటే.. అది కుక్కే. మనం పెట్టే బుక్కెడు అన్నం తిని.. మనుషులకన్నా ఎక్కువ విశ్వాసంగా, నమ్మకంగా, తోడు నీడగా ఉంటుంది. మనకు ఏదైనా జరిగితే బాధపడుతుంది. మనకు ఆపద వస్తే మన కోసం పోరాడుతుంది. యజమాని కోసం ప్రాణాలు అర్పించిన ఘటనలు కూడా ఉన్నాయి. అందుకే చాలా మంది పెట్స్‌లో కుక్కలకే ప్రాధాన్యం ఇస్తారు. గ్రామాల్లో అయితే సాధారణ కుక్కలనే పెంచుకుంటారు. కాస్త సంపన్నుడు, పట్టణాల్లో ఉండేవారు అయితే విభిన్న జాతి కుక్కలను పెంచుకుంటూ తమ స్టేటస్‌ను చాటుకుంటారు. వాటికోసం ఎంత ఖర్చయినా పెడతారు. కరోనా తర్వాత అయితే.. మనిషికి పెట్స్‌లో అనుబంధం మరింత పెరిగింది. ఒంటరిగా ఉండేవారు చాలా మంది కుక్కలను పెంచుకోవడం ప్రారంభించారు. అనుబంధాలను, ప్రేమ, ఆప్యాయతలను వాటితో పంచుకుంటున్నారు. కొందరు అయితే పిల్లలతో సమానంగా కుక్కలను చూసుకుంటున్నారు. పుట్టిన రోజులు, సీమంతాలు, పురుడు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదైనా జరిగి పెంపుడు కుక్కలు చనిపోతే.. వాటికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల కుక్కల వార్తలు రోజూ పత్రికలు, టీవీల్లో వింటున్నాం. గ్రామ సింహాలుగా గుర్తింపు ఉన్న కుక్కలు.. ఇటీవల క్రూరంగా ప్రవర్తిస్తున్నాయి. మనుషులు.. ముఖ్యంగా చిన్న పిల్లలపై దాడులు చేస్తున్నాయి. చంపేస్తున్నాయి. అయితే విశ్వామైన ఈ కుక్క తాజాగా చేసిన ఓ పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గుంపులో తప్పిపోయి.. చివరకు యజమాని ఇంటికి చేరింది.

ఎవరి సాయం లేకుండా..
కర్ణాటకలోని బెలగవి జిల్లాలోని యమగర్ని గ్రామంలో ఈ అద్భుతం జరిగింది. మహారాష్ట్రలోని పందర్‌పూర్‌లో అదృశ్యమైన కుక్క.. యజమానిని వెతుక్కుంటూ 250 కిలోమీటర్లు ప్రయాణించి చివరకు యజమాని ఇంటికి చేరుకుంది. ఎవరి సాయం లేకుండానే సొంతగా దారి గుర్తు పెట్టుకుని వెనక్కి తిరిగి వచ్చింది. ఆ కుక్కను చూసిన వెంటనే ఓనర్‌ ఎగిరి గంతులేశాడు. దీంతో ఆ వీధి వీధంతా సందడి వాతావరణం కనిపించింది. పూలు, కుంకుమతో అంతా పండగ చేసుకున్నారు. కుక్కకు దండ వేసి బొట్టు పెట్టి డ్యాన్స్‌లు వేశారు స్థానికులు.

250 కిలోమీటర్లు ప్రయాణించి..
జూన్‌ చివరి వారంలో కమలేశ్‌ కుంభర్‌ పందర్‌పూర్‌లో పాదయాత్రకు వెళ్లాడు. ఏటా ఈ కార్యక్రమానికి వెళ్తాడు. అయితే.. ఈ సారి ఆయనతోపాటు కుక్క ‘మహారాజ్‌‘ కూడా వెళ్లింది. దాదాపు 250 కిలోమీటర్లు ఓనర్‌తో కలిసి నడిచింది. కొంత దూరం వెళ్లాక ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. చాలా చోట్ల వెతికి ఓనర్‌ అలిసిపోయాడు. ఇంకెవరితోనే ఆ కుక్క వెళ్తుండగా చూసినట్టు కొంతమంది చెప్పారు. దీంతో దానిపై ఆశలు వదులుకున్నాడు కమలేశ్‌. ఆ మరుసటి రోజే ఇంటి ముందు వచ్చి నిలబడింది. ఓనర్‌ని చూడగానే తోక ఊపుతూ పలకరించింది. ఆశ్చర్యం, అద్భుతం అంటూ చుట్టూ ఉన్న వాళ్లంతా సందడి చేశారు. ఆ దేవుడే కుక్కకి దారి చూపించి ఇంటికి పంపించాడని అంటున్నారు.