SC, ST Classification : ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ కోటాపై సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు.. ప్రభుత్వం ఏం చేయనుంది?

సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఎస్సీ వర్గీకరణ అంశం కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. గతంలో వర్గీకరణను సుప్రీం కోర్టు తప్పు పట్టింది. దీనిపై ఏళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే తాజాగా దీనిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

Written By: Raj Shekar, Updated On : August 1, 2024 12:33 pm
Follow us on

SC, ST Classification :  ఎస్సీ, ఎస్టీలను వర్గీకరించే అదికారం రాష్ట్రాలకు ఉందా అనే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది. దీనిపై 23 పిటిషన్లు దాఖలు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం మూడు రోజులు సుదీర్ఘ వాదనలు విన్నది. విచారణ పూర్తి చేసింది ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. వర్గీకరణ అంశం చాలా ఏళ్లుగా డిమాండ్‌ ఉంది.. న్యాయస్థానంలోనూ పెండింగ్‌లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం సుధీర్ఘ పోరాటమే జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణలో ఏర్పాటు చేసిన సభలో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. ఈమేరకు సుప్రీకోర్టుకు కేంద్రం తరఫున విన్నవిస్తామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణను న్యాయమైన డిమాండ్‌గా పేర్కొన్నారు. దీంతో ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం మద్దతు బీజేపీకే ఇవ్వాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. అసెంబ్లీతోపాటు, లోక్‌సభ ఎన్నికల్లోనూ మాదిగలు బీజేపీకి అనుకూలంగా ఓటువేశారు. హైదరాబాద్‌ సభలో చెప్పినట్లుగానే మోదీ వర్గీకరణపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా సుప్రీం కోర్టు కూడా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం.

ఏడుగురు సభ్యుల ధర్మాసనం..
షెడ్యూల్డ్‌ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్‌ తరగతుల్లో (ఎస్టీ) వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం సుదీర్ఘ విచారణ తర్వాత సంచలనమైన తీర్పు వెల్లడించింది. 6–1 తేడాతో వర్గీకరణను సమర్ధించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు పూర్తి చేసిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం(ఆగస్టు 1న) తీర్పు వెల్లడించింది. వర్గీకరణ సమంజసమేనని స్పష్టం చేసింది. అయితే, ధర్మాసనంలోని జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు రాశారు. ఉప–వర్గీకరణ సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వాలకే అధికారం..
ఇదిలా ఉంటే.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని సీజేఐ జస్టిస్‌ డీవై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ వర్సెస్‌ దవిందర్‌ సింగ్‌ కేసులో తొలుత ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టింది. 2020లో దీనిని విస్తృత ధర్మాసనానికి నివేదించింది. వర్గీకరణ అనుమతించదగినది కాదని ఈవీ చిన్నయ్య వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో కో–ఆర్డినేట్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫిబ్రవరిలో మూడు రోజులు వరుసగా విచారణ పూర్తిచేసి.. తీర్పు వాయిదా వేసింది.

30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం..
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్‌ ఉద్యమిస్తోంది. రెండు రాష్ట్రాల్లో 59 ఎస్సీ కులాలు ఉన్నాయి. వీటిలో మాల, మాదిగ ప్రధానమైనవి. ఎస్సీల్లో మాల సామాజికవర్గానికి చెందినవాళ్లు సామాజికంగా, విద్యాపరంగా ముందజంలో ఉన్నారు. వారి జనాభా మాదిగలతో పోలిస్తే, చాలా తక్కువ. అయినా ఎస్సీ రిజర్వేషన్లన్నీ వారే అనుభవిస్తున్నారంటూ మాదిగ, దాని ఉప కులాలు ఆరోపిస్తున్నాయి.

1965లో కమిషన్‌..
ఎస్సీ రిజర్వేషన్లపై అధ్యయనం కోసం 1965లో లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రభుత్వం లోకూర్‌ కమిషన్‌ను నియమించింది. కమిషన్‌ నివేదిక మాదిగలు అన్యాయానికి గురవుతున్నట్టు తెలిపింది. 1996 సంవత్సంలో ఎస్సీ వర్గీకరణ కోసం మందకష్ణ మాదిగ నేతృత్వంలో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఉద్యమాలు ప్రారంభించింది. దీంతో నాటి తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం జస్టిస్‌ రామచంద్ర రాజు కమిషన్‌ వేసింది. ఈ కమిషన్‌ నివేదిక ప్రకారం.. 2002లో నాటి ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించింది. మొత్తం 15 శాతంలో మాదిగ దాని ఉప కులాలకు 7 శాతం, మాల, దాని ఉప కులాలకు 6 శాతం, ఇతర కులాలకు 2 శాతం వర్గీకరించి అమలు చేసింది.

నాడు వ్యతిరేకించిన కోర్టు..
అయితే ఎస్సీ వర్గీకరణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ రిజర్వేషన్లు కాస్తా రద్దయ్యాయి. 2008 లో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మరోసారి వర్గీకరణపై అధ్యయనం చేయడానికి ఉషా మెహ్రు కమిషన్‌ వేసింది. ఆ కమిషన్‌ నివేదిక ప్రకారం కూడా ఎస్సీల్లో మాదిగలు వెనుకబడి ఉన్నారని తేల్చింది. అన్ని వర్గాలకు సమన్యాయం చేయడానికి వర్గీకరణ ఒక్కటే మార్గమని సూచించింది. దీనికి పార్లమెంట్‌లో చట్టం తేవడం ఒక్కటే మార్గం అని సూచించింది. ఎట్టకేలకు సుప్రీ కోర్టే ఎస్సీ, ఎస్టీల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.