YCP: వైసీపీని వెంటాడుతున్న ‘విశాఖ’ భయం.. తాజా ఎన్నికలను ఫేస్ చేయడం జగన్ కు కష్టమే!

వైసీపీ అధినేత జగన్ చాలా పదవులు చేపట్టారు. ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా, మరో ఐదేళ్ల పాటు సీఎంగా ఉన్నారు. కానీ ఓ విషయంలో మాత్రం ఆయనకు అసంతృప్తి వెంటాడుతూనే ఉంది. అదే విశాఖలో పట్టు సాధించడం. ఇంతవరకు ఆయనకు విశాఖపట్నం పట్టు దొరకలేదు. ఇప్పుడు తాజాగా ఓ అవకాశం వచ్చింది.

Written By: Dharma, Updated On : August 1, 2024 12:22 pm

YCP

Follow us on

YCP: గత ఐదేళ్లుగా విశాఖ కేంద్రంగా చేసుకొని వైసిపి రాజకీయాలు నడిపింది. పాలన రాజధానిగా సాగర నగరాన్ని చేసి రాష్ట్రాన్ని పాలించాలని జగన్ భావించారు. కానీ ఆయన ఒకటి తలిస్తే.. ప్రజలు ఒకటి తలిచారు. వైసీపీని దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఓటమి నుంచి జగన్ ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తరుణంలో అదే విశాఖ ఇప్పుడు సవాల్ విసురుతోంది. విశాఖ నగర పాలక సంస్థ స్థాయి సంఘం ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఫేస్ చేయాల్సిన తప్పని పరిస్థితి ఎదురైంది. ఈనెల 7న స్థాయి సంఘం ఎన్నికలు జరగనున్నాయి. గత మూడేళ్లుగా జరిగిన స్థాయి సంఘం ఎన్నికల్లో పదికి పది చైర్మన్ పదవులను వైసీపీయే దక్కించుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వైసిపి గెలవలేదు. దీంతో కార్పొరేటర్లు భవిష్యత్తు వెతుక్కుంటూ ఇతర పార్టీలో చేరారు. ఇప్పటికే 12 మంది పార్టీని వీడారు. ఏడుగురు టిడిపిలో చేరగా.. ఐదుగురు జనసేనలో చేరారు. మరో పదిమందికి పైగా వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో స్థాయి సంఘ సమావేశాలు జరుగుతుండడంతో వైసీపీలో ఒక రకమైన అలజడి రేగింది. దీంతో జగన్ అలెర్ట్ అయ్యారు. విశాఖ కార్పొరేటర్ లను ప్రత్యేకంగా బస్సుల్లో తాడేపల్లి కి రప్పించారు. వారితో సుమాలోచనలు జరుపుతున్నారు. అయితే అయిష్టంగానే జగన్ను కలిసిన కార్పొరేటర్లలో చాలామంది.. కూటమి పార్టీలకు టచ్ లో ఉన్నారు. దీంతో స్థాయి సంఘ సమావేశాల్లో గెలుపు అంత ఈజీ కాదని తెలుస్తోంది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే మాత్రం.. ఆ పార్టీకి మరింత దెబ్బ ఖాయం.

* విజయవాడ ఫలితాలు గుణపాఠం
మొన్నటికి మొన్న విజయవాడ నగరపాలక సంస్థ స్థాయి సంఘ చైర్మన్ పదవులను వైసీపీ దక్కించుకుంది. టిడిపి ముందస్తు వ్యూహం లేక దెబ్బతింది. అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో.. విశాఖ నగరపాలక సంస్థ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే మంత్రులతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. కార్పొరేటర్లతో మంతనాలు చేస్తున్నారు. వైసీపీకి 58 మంది కార్పొరేటర్లు ఉన్నారు. టిడిపికి 29 మంది, జనసేనకు ముగ్గురు, బిజెపి, సిపిఐ, సిపిఎం కు చేరొకరు.. ఐదుగురు ఇండిపెండెంట్ లు ఉన్నారు. ఇప్పటికే 12 మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడారు. మరికొందరు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ స్థాయి సంఘ చైర్మన్ పోస్టులకు విపరీతమైన గిరాకీ ఉంది. 24 నామినేషన్లు దాఖలు కావడంతో.. అధికార వైసిపి కార్పొరేటర్లలో చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఎదురు దెబ్బ తగులుతుందని వైసీపీ ఒక అంచనాకు వచ్చింది.

* ఎమ్మెల్సీ ఉప ఎన్నిక
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కి సంబంధించి ఉప ఎన్నిక జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి ఫిరాయించారు. దీంతో ఆయనపై అనర్హత వేటు పడింది. జనసేన తరఫున ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని టిడిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్థానిక సంస్థల తరఫున ఎన్నికైనఎంపీటీసీలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు ఓట్లు ఉంటాయి. సంఖ్యాపరంగా వైసీపీకి ఎక్కువమంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్న ఎన్నికలకు ముందు చాలామంది టీడీపీ కూటమి పార్టీల్లో చేరారు. ఎన్నికల అనంతరం కూడా చాలామంది సానుకూలంగా పనిచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు.

* కొరకరాని కొయ్య
వైసీపీకి విశాఖ అంటే కొరకరాని కొయ్యగా మారింది. గత ఏడాది మార్చి వరకు వైసీపీకి తిరుగులేదు. కానీ అప్పట్లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి విజయం సాధించారు. అప్పటి నుంచే వైసిపికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రతికూల పరిస్థితులు మొదలయ్యాయి. విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించినా ప్రజలు ఆహ్వానించలేదు. పెద్దగా మొగ్గు చూపలేదు. ఈ ఎన్నికల్లో విశాఖ నగరం తో పాటు పరిసర ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా వైసిపికి దక్కలేదు. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఏజెన్సీలో మాత్రం రెండు స్థానాల్లో అధికారంలోకి రాగలిగింది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీకి విశాఖ దొరకదు, చిక్కదు అన్నట్టు మారింది.