Gomatha Swayamvaram: తాము ముచ్చటగా పెంచుకున్న బిడ్డకు స్వయంవరం ప్రకటించారు ఆ దంపతులు. శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని జరిపించాలని భావించారు. ఏకంగా పత్రికల్లో ప్రత్యేక ప్రకటనతో పాటు కార్యక్రమానికి ఆహ్వానించేందుకు శుభలేఖలే ముద్రించి అందరికీ అందించారు. వింతగా ఉంది కదూ. ఇది నిజం..
పూర్వం రాజుల కాలంలో స్వయంవరం ప్రకటించేవారు. యువరాణిని వివాహం ఆడేందుకు దేశ విదేశాల నుంచి యువరాజులను ఆహ్వానించేవారు. ఇప్పుడు అటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. అయితే అది యువరాణి కోసం కాదు.. తాము పెంచుకున్న ఆవు దూడ యుక్త వయసుకు రావడంతో మంచి తోడును కల్పించాలని భావించారు. ఏకంగా స్వయంవరమే ప్రకటించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అందమైన నందులకు ఆహ్వాన పత్రికలు పంపించారు.
కాకినాడ రూరల్ రమణయ్యపేట ఏపీఎస్పీకి చెందిన తిరుమల ఆసుపత్రి అధినేత డాక్టర్ గౌరీ శేఖర్, డాక్టర్ రమాదేవి దంపతులు ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. ప్రస్తుతం విదేశాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో గౌరీ శంకర్ దంపతులు పుంగనూరు ఆవు దూడను రెండేళ్ల కిందట కొనుగోలు చేశారు. కన్న బిడ్డలా దానిని చూసుకుంటున్నారు. దానికి “సారణ”గా నామకరణం చేశారు.ఇటీవల అది యుక్త వయసుకు రావడంతో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. సరి జోడి అయిన నంది కోసం అన్వేషించారు. ఇందుకోసం ఏకంగా స్వయంవరం ప్రకటించారు. వివాహ ఆహ్వాన పత్రికల మాదిరిగా.. స్వయంవరం ఆహ్వాన పత్రికను వివిధ రాష్ట్రాలకు చెందిన మేలైన నందులకు పంపించారు. ఈనెల 29న ఉదయం 9 గంటలకు తమ ఆసుపత్రి ప్రాంగణంలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం గోమాత స్వయంవరం ఆహ్వాన పత్రికలే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.