Solar Storm: సౌర తుఫాన్.. అది కూడా అత్యంత శక్తివంతమైనది. గత ఆరేళ్ల కాలంలో ఇంతటి బలమైన సౌర తుఫాన్ భూమిని తాకడం ఇదే తొలిసారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి నుంచి ఏర్పడే శక్తివంతమైన పేలుళ్ల కారణంగా సౌర జ్వాలలు అంతరిక్షంలోకి వెళ్తుంటాయి. అయితే ఈ సౌర తుఫాన్ ఎందుకు వచ్చింది..? దీని వలన కలిగే ప్రభావాలు ఏంటి? అనేది మనం తెలుసుకుందాం.
అతి పెద్ద భూ అయస్కాంత తుఫాన్ గా వర్ణించబడిన ఈ సౌర తుఫాన్ కారణంగా భూ అయస్కాంత క్షేత్రంలో తీవ్ర అవరోధాలు తలెత్తాయని అగ్రరాజ్యం అమెరికా వాతావరణ సంస్థ కూడా తెలిపింది. అంతేకాదు దీని వలన నావిగేషన్, విద్యుత్ గ్రిడ్ లు, కమ్యూనికేషన్ సిస్టంలో చిన్న చిన్న అవంతరాలు తలెత్తాయి. సాధారణంగా… కరోనల్ మాస్ ఎజెక్షన్ గా పిలిచే సౌర జ్వాలలు అత్యంత ఆవేశిత కణాలను కలిగి ఉంటాయి. అయితే భూమి కలిగి ఉండే అయస్కాంత క్షేత్రం ఈ జ్వాలలను అడ్డుకుని, భూమిపై ఉండే జీవజాలాన్ని రక్షిస్తుంది.
కానీ అంతరిక్షంలోని శాటిలైట్లపై కూడా వీటి ప్రభావం పడుతుంది. సౌర జ్వాల భూమిని ఢీకొనే సమయంలో శాటిలైట్లు సేఫ్ మోడ్ లో కనుక ఉంటే వాటిని రక్షించవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. సౌర తుఫాన్ కారణంగా శాటిలైట్ సేవల సంస్థలు ఉపగ్రహాల గమనాన్ని నిశితంగా పరిశీలించడం కష్టంగా మారే ప్రమాదం ఉంది. ఈ క్రమంలోనే పవర్ గ్రిడ్లకు ఇబ్బందులు కలగవచ్చు. అంతేకాకుండా లోహ విహంగాల్లో చాలా వరకు ఉపగ్రహ ట్రాన్స్ మిషన్ వ్యవస్థను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
సౌర జ్వాలలు భూమిపై కొన్ని ప్రాంతాల్లో హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్లకు విఘాతం కలిగే ఛాన్స్ ఉంది. దాదాపు పదకొండు ఏళ్లకు ఒకసారి అయస్కాంత తీరుతెన్నులు మారుతుంటాయట. ఈ కాల చక్రానికి తగినట్లుగానే సౌర చర్యల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే సూర్యుడు ధృవాన్ని మార్చకుంటాడు. దక్షిణ ధృవం ఉత్తరంగా, ఉత్తర ధృవం దక్షిణంగా మారుతుంది.. ప్రస్తుతం సౌర చర్యలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఈ దశను సోలార్ మ్యాగ్జిమం అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.