Social Media Stars: అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపాలనుకోవడం ఎంత అవివేకమో.. టాలెంట్ ను వెలుగులోకి రానీయకుండా ఆపడం అంతే అవివేకం. ఒకప్పుడు అంటే కళాకారులకు సరైన వేదికలు ఉండేవి కావు. ఒకవేళ ఏదైనా వేదిక ద్వారా ప్రతిభ బయటకు వచ్చినా అవకాశాలు దక్కేవి కాదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. టాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలకు కొదువలేదు. సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ల రూపంలో ప్రతి ఇంటిని తట్టిన తర్వాత.. కొత్త కొత్త ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. సినిమా హీరోల స్థాయిలో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు.

కోట్ల కొద్ది వ్యూస్
యూట్యూబ్ పుట్టుక అనేది ఒక సంచలనం. చాలామంది ఔత్సాహిక కళాకారులు ప్రతిభను ప్రదర్శించేందుకు అది ఒక వేదిక. అలాంటి కళాకారులకు ఇప్పుడు ఒక ఆదాయ మార్గం.*ఎక్కడో ఆంధ్రాలో పాలేరు పని చేసుకుంటున్న దుర్గారావు ఇప్పుడు ఒక సెలబ్రిటీ. కేవలం టిక్ టాక్ అనే యాప్ లో తనకు వచ్చిన ఓ నాలుగు స్టెప్పులను వీడియో తీసి పోస్ట్ చేసేవాడు. అవి కాస్త వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాను యూట్యూబ్ లో వీడియోలు చేస్తే వేలల్లో వ్యూస్ దక్కుతున్నాయి. ఈటీవీ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలల్లో స్కిట్లు కూడా చేశాడు. క్రాక్ సినిమాలో నటించాడు.
*అగ్గిపెట్టె మచ్చ.. చూడ్డానికి నాలుగు అడుగుల పొడవు ఉండే ఈ రాయలసీమ వ్యక్తి.. కేవలం తన మాట తీరుతో, రాయలసీమ మండలికంతో సెలబ్రిటీ అయ్యాడు. ఈటీవీలో ప్రసారమయ్యే పలు షో లల్లో మెరిశాడు. పది కూడా పాస్ అవని ఈ వ్యక్తి బుల్లి తెరలో కనిపిస్తున్నాడంటే అతడికి ఉన్న ప్రతిభ కారణం.
*ఉప్పల్ బాలు

టిక్ టాక్ ద్వారా వెలుగులోకి వచ్చిన మరొక కళాకారుడు. తన మాటతీరు, నాలుగు స్టెప్పులతో వేలల్లో ఫాలోయింగ్ సంపాదించుకుని సెలబ్రిటీ అయ్యాడు.
*దివ్య జ్యోతి

హైదరాబాదులో హౌస్ కీపర్ గా పనిచేసే ఈమెకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. ఇద్దరు కూతుర్లు, మంచానికే పరిమితమైన భర్త కు ఈమె ఆధారం. అయినప్పటికీ వెరవకుండా హౌస్ కీపింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని సాకుతోంది. ఈమె హౌస్ హౌస్ కీపింగ్ లో పనిచేస్తున్నప్పుడు ఒక పాట పాడింది. దాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చాలామంది మెచ్చుకున్నారు. ఈమె గురించి ఆరా తీశారు. తర్వాత ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. ఈ మధ్య ఆమె పాడిన పల్సర్ బైక్ పాట యూట్యూబ్లో ఎంత హిట్ అయిందో చెప్పాల్సిన అవసరం లేదు. తాను ఏదో యథాలాపంగా పాడిన పాట ఇవ్వాళ ఆమెకు ఎన్నో అవకాశాలను తెచ్చిపెడుతోంది.
* ఆర్టీసీ కండక్టర్ ఝాన్సీ

ఆమె పేరు ఝాన్సీ. ఎక్కడో ఆంధ్రాలో ఆర్టీసీ కండక్టర్ గా పని చేస్తోంది. పెళ్లయింది. భర్త, పిల్లలు ఉన్నారు. ఆమెకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. పెళ్లయిన తర్వాత డ్యాన్స్ కు దూరమైంది. అని అడపా దడపా స్టెప్పులు వేసేది. దానిని ఎవరో వీడియో తీసి మల్లెమాల వాళ్లకు చూపించారు. దీంతో వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో అవకాశం ఇచ్చారు. దివ్య జ్యోతి పాడిన పల్సర్ బైక్ పాటకు ఆమె వేసిన స్టెప్పులు యూట్యూబర్లను అలరించాయి. ఏకంగా కోటిన్నర వ్యూస్ దక్కాయి. గత కొన్ని నెలలుగా మల్లెమాల తీసిన స్కిట్లకు లక్షల్లోనే వ్యూస్ దక్కుతున్నాయి. కానీ ఝాన్సీ చేసిన ఒక్క డ్యాన్స్ మల్లెమాల వ్యూయర్ షిప్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది.
*లక్ష్మణ్
లక్ష్మణ్ అంటే ఎవరికి తెలిసి ఉండదు కానీ.. రివ్యూ లక్ష్మణ్ అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఐ మ్యాక్స్ లో సినిమా చూడటం.. దానికి తనదైన శైలిలో రివ్యూ ఇవ్వటం ఇతడి ప్రత్యేకత. పైగా సింక్ అయ్యేలాగా మాటలను కూర్చడంలో ఇతడికి ఇతడే సాటి. యూట్యూబ్లో ఫేమస్ అయిన తర్వాత ఈటీవీ మల్లెమాలవాళ్లు జబర్దస్త్ లో ఇతడికి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూనే ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తున్నాడు. వీరేకాక యూట్యూబ్లో “లోకులు కాకులు ఆంటీ”, “బంగారం ఒకటి చెప్పనా అంటూ” విభిన్నమైన గొంతుకతో అలరించే నెల్లూరు శాంతి.. ఇలా ఎంతమందో ఫేమస్ అయ్యారు. సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీలు గా మారారు. మున్ముందు ఇలా ఎంతమంది వెలుగులోకి వస్తారో వేచి చూడాలి. అని ఒకటి మాత్రం సుస్పష్టం. టాలెంట్ ఉన్నవాళ్లు అవకాశాల కోసం తిరగాల్సిన అవసరం లేదు. తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఎన్నో వేదికలు ఉన్నాయి. ఆ వేదికలే ఇప్పుడు వారికి అవకాశాలు కల్పిస్తున్నాయి.