Pet Parenting: జంతువులను మచ్చిక చేసుకోవడం.. వాటిని ప్రేమపూర్వకంగా సాకడం ఇవాల్టి నుంచే కాదు.. పూర్వకాలం నుంచి కూడా అమల్లో ఉంది. జంతువుల్లో కుక్కలను మనుషులు విపరీతంగా ప్రేమిస్తుంటారు. కుక్కలు కూడా అదే స్థాయిలో మనుషులపై విశ్వాసాన్ని చూపిస్తుంటాయి. కుక్క – మనిషి మధ్య ఆవినాభావ సంబంధం ఈనాటిది కాదు.. కొన్ని వందల సంవత్సరాలుగా అది కొనసాగుతూనే ఉంది.
ఆర్థిక స్థిరత్వం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది కుక్కలను విశేషంగా పెంచుకుంటున్నారు. తమ డాబును, దర్పాన్ని ప్రదర్శించేలా కుక్కలను పెంచుకుంటున్నారు. ఇందులో రకరకాల జాతులను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని.. వాటికి అద్భుతమైన ఆహారాన్ని.. రకరకాల మందులను ఇస్తున్నారు. ఇంకా కొందరైతే కుక్కలతో నిర్వహించే ఫ్యాషన్ షోలకు హాజరవుతున్నారు. ఆ పోటీలలో తమ కుక్కలు బహుమతులు పొందుతే ఎగిరి గంతులు వేస్తున్నారు. కుక్కలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారు. వాటికి ఏదైనా జరిగితే తట్టుకోలేకపోతున్నారు. చివరికి వాటి ఆరోగ్య సంరక్షణ విషయంలోనూ వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. వాటి తిండి విషయంలోనూ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అంతేతప్ప కుటుంబ సంబంధాల విషయంలోనూ.. వివాహాలు చేసుకునే విషయంలోనూ వారు ఏమాత్రం ఆసక్తిని చూపించడం లేదు. ఒకవేళ పెళ్లిళ్లు చేసుకున్నా పిల్లలు కనే ప్రక్రియను నిత్యం వాయిదా వేస్తున్నారు.
ఇదేం మాయ రోగం
ఇక మన దేశంలో జననాల సంఖ్య తగ్గుతోంది. ఇది అంతిమంగా దేశ అభివృద్ధిపై ప్రభావం చూపిస్తుందని ఆర్థికవేత్తలు వాపోతున్నారు. ఇప్పటికే జననాల సంఖ్య తగ్గడం వల్ల అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ దేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. తమ దేశంలో బర్త్ రేటు ను పెంచడానికి అవి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. జననాల సంఖ్యను పెంచడానికి రకరకాల పథకాలను అమలు చేస్తున్నాయి. అయితే మనదేశంలోనూ బర్త్ రే ట్ తగ్గుతోంది. దీనివల్ల భవిష్యత్తు కాలంలో అనేక ముప్పులు ఏర్పడతాయని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. తాజాగా మార్స్ పెట్ కేర్ అనే ఓ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియాలో జనరేషన్ జెడ్ (generation z), మిలీనియల్ ( millennial) తరాలు తాము పేరెంట్స్ కావడానికి ఇష్టం చూపించడం లేదు. ఆసక్తిని కూడా ప్రదర్శించడం లేదు. కేవలం పెంపుడు జంతువులను (pet dogs) ను తమ కుటుంబ సభ్యులు(family members)గా భావిస్తున్నారు. పెట్ పేరెంటింగ్ (pet parenting) ను స్వీకరిస్తున్నారు. దీనివల్ల జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందుతోంది.. పట్టణ ప్రాంతంలో జనరేషన్ జెడ్, మిలీనియల్ తరం వారు ఎక్కువగా జీవిస్తున్నారు. వీరంతా ఐటి, ఫార్మా, ఇతర రంగాలలో స్థిరపడ్డారు. దీనివల్ల వారికి ఒత్తిడి అధికంగా ఉంటోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి వారు పెట్స్ ను ఆశ్రయిస్తున్నారు. ఇదే సమయంలో సంసార జీవితానికి దూరంగా ఉంటున్నారు. అదే సందర్భంలో పిల్లలు కనడానికి కూడా వారికి ఓపిక ఉండడం లేదు. ప్రతి విషయంలోనూ లెక్కలు వేసుకుంటున్నారు. చివరికి జీవిత భాగస్వామిని కూడా అనేక వడపోతల తర్వాతనే ఎంపిక చేసుకుంటున్నారు. ఇది అంతిమంగా జనాభా పెరుగుదలపై ప్రభావం చూపిస్తోందని.. ఇలానే ఉంటే పరిస్థితి దారుణంగా మారుతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.