Diwali Gift: దీపావళి అంటే చాలామందికి దివ్వెల పండుగ గుర్తుకు వస్తుంది. దీపాలు మెరుస్తూ ఉంటే చెడుపై మంచి సాధించిన విజయం గుర్తుకు వస్తూ ఉంటుంది. దీపావళి వేడుకను మనదేశంలో ప్రాంతాలను బట్టి విభిన్నంగా నిర్వహించుకుంటూ ఉంటారు. కొన్ని ప్రాంతాలలో కేదారేశ్వర స్వామి వ్రతాలు నిర్వహిస్తుంటారు. మరి కొన్ని ప్రాంతాలలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు చేస్తుంటారు. సాయంత్రం పూట గృహాలలో దీపాలు పెట్టి.. లక్ష్మీ దేవతకు పూజలు చేస్తూ ఉంటారు. పూజలు, పునస్కారాలను పక్కన పెడితే.. మనదేశంలో దీపావళి సందర్భంగా సాయంత్రం పూట కాల్చే బాణసంచా మరో విధంగా ఉంటుంది. ఇటీవల కాలంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం దీపావళి వేడుకలపై రకరకాలుగా తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు పోటాపోటీగా బాణసంచా కాల్చుతున్నారు.
దీపావళి సందర్భంగా కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనసులు ఇస్తుంటాయి. విలువైన కానుకలు సమర్పిస్తుంటాయి. ఇటీవల చండీగఢ్ ప్రాంతానికి చెందిన ఓ కంపెనీ తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏకంగా కార్లను బహుమతులుగా ఇచ్చింది. దాంతోపాటు మిఠాయి ప్యాకెట్లను కూడా కానుకలుగా ఇచ్చింది. ఆ కానుకలు అందుకున్న ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే హర్యానా రాష్ట్రంలోని సోనిపేట ప్రాంతంలో ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం దీపావళి సందర్భంగా తమ ఉద్యోగులకు ఇచ్చిన కానుకలు సంచలనంగా మారాయి. కంపెనీ యాజమాన్యం దీపావళి వేడుకలను పురస్కరించుకొని ఉద్యోగులకు ఇచ్చిన కానుకలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో.. అది కాస్త చర్చకు దారి తీసింది.
దీపావళి వేడుకల సందర్భంగా సోనిపేట ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీ యాజమాన్యం ఉద్యోగులకు బహుమతులుగా స్వీట్ ప్యాకెట్లను అందించింది. పండుగ కానుకగా సోంపాపిడి స్వీట్ ఇవ్వడంతో ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చిన సోంపాపిడి బాక్స్ లను ఫ్యాక్టరీ గేట్ ఎదుట పడేశారు. అంతేకాదు కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సంచలనం సృష్టిస్తోంది. వాస్తవానికి ఉద్యోగులకు కంపెనీలు దీపావళి వేడుక సందర్భంగా భిన్నమైన కానుకలు ఇస్తుంటాయి. చివరికి స్వీట్ ప్యాకెట్ల విషయంలో కూడా విభిన్న తత్వాన్ని చూపిస్తాయి. కానీ ఆ కంపెనీ మాత్రం స్వీట్ ప్యాకెట్ల విషయంలో పిసినారితనాన్ని ప్రదర్శించింది. పైగా అత్యంత నాసిరకమైన సోంపాపిడి ప్యాకెట్లను ఇవ్వడంతో ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం అయింది. అంతేకాదు ఇలాంటి ప్యాకెట్లు ఇచ్చి తమ మనోభావాలను ఫ్యాక్టరీ యాజమాన్యం దెబ్బతీసిందని ఉద్యోగులు వాపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ సందడి చేస్తోంది.