Rupee vs Dollar: మూడు రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటోన్నాయి. అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి భారీగా పతనమవుతోంది. ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. రూ.90 మార్కు దాటింది. వాణిజ్య లోటు, ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ఉపసంహారణ, జీడీపీ వృద్ధి మందగించడం వల్ల జరిగింది. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘ప్రపంచంలో రూపాయికి విలువ లేదు‘ అని విమర్శించారు. ఆర్థిక నిపుణులు ఎగుమతి–దిగుమతి అసమతుల్యత, ఫారెక్స్ రిజర్వుల క్షీణతను కారణాలుగా చెబుతున్నారు.
సామాన్యుడిపై ప్రభావం
రూపాయి పతనంతో విదేశీ విద్య, ప్రయాణాలు ఖరీదైనవిగా మారాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, మందులు 10–15% ధరలు పెరుగుతాయి. 90% చమురు దిగుమతులు, వంటనూనె, ఎరువులు ధరలు పెరిగి ఇంధన బిల్లులు, ట్యూషన్ ఫీజులు భారీగా పెరుగుతాయి. ద్రవ్యోల్బణం 6–7%కు చేరవచ్చు.
దీర్ఘకాల పరిణామాలు
రూపాయి పతనంతో కుటుంబ బడ్జెట్లు ఒత్తిడికి గురవుతాయి. ఈఎంఐలు పెరగడంతో రుణాలు భారీగా మారతాయి. రూపాయి మరింత పడిపోతే (91–92) ఆహార, ఇంధన ధరలు పెరుగుతాయి. ఆర్‌బీఐ చర్యలు, ఎగుమతి ప్రోత్సాహాలు అవసరం. ఇదే సమయంలో ఎగుమతులు పెరగాల్సిన అవసరం ఉంది. అప్పుడే విదేశీ మారక నిల్వలు పెరుగుతాయి. లేదంటే బలహీన పడిన రూపాయి భారం మోయాల్సింది సామాన్యుడే అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.