Homeఆంధ్రప్రదేశ్‌CM Jagan: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా జగన్?

CM Jagan: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఎలా జగన్?

CM Jagan
CM Jagan

CM Jagan: ఏ ప్రభుత్వమైనా అద్భుతంగా పనిచేస్తే.. తరువాత జరిగే ఎన్నికల్లో ప్రజలు మరోసారి పట్టం కడతారు. ప్రభుత్వ పనితీరు అద్వానంగా ఉంటే ఎన్ని ప్రయాసలు పడినా ఓటమి తప్పదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా రెండో కోవలోకే వస్తున్నట్లు కనిపిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో సంక్షేమం పేరుతో బటన్ నొక్కుడు తప్పా మరో అభివృద్ధి లేదన్న భావన రాష్ట్ర ప్రజలలో వ్యక్తం అవుతోంది. దీంతో మొన్న జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో అధికార పార్టీకి ఓటర్లు గట్టిగా బుద్ధి చెప్పారు. దీంతో సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. అయితే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమిటి ప్రయోజనం అన్న భావన ఇప్పుడు ఆ పార్టీలోనే వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వాలు ఏవైనా ప్రజా పరిపాలన సాగిస్తూ ఉంటే.. దానికోసం ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉండదు. ప్రజలే ప్రభుత్వం చేసే మంచి ప్రచారం చేస్తారు. అందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా.. మొదటి ఐదేళ్లు ఆయన చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు పరిగణలోకి తీసుకొని రెండోసారి ఆయనను గెలిపించారు. రెండోసారి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఆయన ప్రత్యేకంగా ఎటువంటి ప్రచార ఆర్భాట కార్యక్రమాలను నిర్వహించలేదు. తన ప్రభుత్వం మంచి చేస్తే గెలిపించాలని కోరారు. ఆయన చేసిన మంచిని గుర్తించుకున్న ప్రజలు రెండోసారి ఓటు వేసి గెలిపించారు. కానీ ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎంతో చేశామని గొప్పలు చెబుతోంది. ప్రజలకు మేలు చేశాను అన్న భావన ఉంటేనే ఓటు వేయాలని బహిరంగ సభల్లో చెబుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. తాము అందించిన సంక్షేమ పథకాల గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార ఆర్భాట కార్యక్రమాలు సిద్ధమవుతున్నారు. అందుకోసం కొద్ది రోజుల్లోనే ఇంటికి వెళ్లి స్టిక్కర్లు అంటించే కార్యక్రమానికి వైసీపీ సిద్ధం అవుతోంది. ప్రతి ఇంటికి మంచి చేసినట్లయితే ఈ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం ఎందుకు అన్న ప్రశ్న పలు వర్గాల నుంచి వినిపిస్తోంది.

గడపగడపకు అంటూనే.. స్టిక్కర్లు అంటించే కార్యక్రమం..

వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెబుతోంది. ఆ సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు వస్తే.. ఎవరు ఎన్ని చెప్పినా మళ్ళీ వైసీపీకే వాళ్లు ఓట్లు వేస్తారు. అలా చేయకుండా ఉంటే.. ఎన్ని ప్రచారాలు చేసినా ఉపయోగం మాత్రం ఉండదు. వైసీపీ అగ్ర నాయకులు ప్రజల సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించామని గొప్పలు చెబుతున్నారు.. మరి అంత గొప్పగా చేసి ఉంటే ఇప్పుడు స్టిక్కర్లు అంటించే కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు నెలల తరబడి గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కొత్తగా మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్తు అనే రెండు ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ఇలా రకరకాల పేర్లతో క్యాడర్ ను ఎన్నికలకు రెడీ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో మార్పు వచ్చినది నిజమైతే ఈ కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం వైసీపీకి వచ్చి ఉండేది కాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.

లబ్ధిదారుల్లో కొరవడిన సంతృప్తి..

రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు రూపంలో డబ్బులు అందిస్తున్నప్పటికీ.. ప్రజల్లో సంతృప్తి లేకుండా పోయింది. ఒకపక్క సంక్షేమ పథకాలు పేరుతో డబ్బులు జమ చేస్తూనే.. మరోపక్క పన్నులు, ధరలు పెంచి భారీగా వసూలు చేస్తున్నారనే భావన ప్రజల్లో ఉంది. పది రూపాయలు ఇచ్చి 100 వెనక్కి లాక్కుంటున్నారని ఎంతోమంది చెబుతున్నారు. ప్రజల్లో గూడు కట్టుకుని ఉన్న అసంతృప్తిని తగ్గించుకునే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశారనే ప్రచారం జరుగుతుంది.

CM Jagan
CM Jagan

ప్రచారంతో నమ్మకాన్ని రుద్దే ప్రయత్నం..

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వల్ల ప్రజల్లో సానుకూల భావన వ్యక్తం కాలేదు. దీంతో ఎలాగైనా సానుకూల వైఖరి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ఈ కొత్త కార్యక్రమాలను వైసీపీ ప్రభుత్వం చేపడుతుంది. ఐ ప్యాక్, ఇతర పార్టీ అనుబంధ విభాగాల ద్వారా ప్రభుత్వంపై తీవ్రమైన ప్రచారంతో నమ్మకాన్ని కల్పించాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రచార ఆర్భాట కార్యక్రమాలకు తెర లేపిందని చెబుతున్నారు. ప్రజల్లో ఇప్పటి వరకు కల్పించలేకపోయినా నమ్మకం, విశ్వసనీయతను స్టిక్కర్ల ఉద్యమం ద్వారా కొంతైనా బలవంతంగా కల్పించే ప్రయత్నం చేయాలని వైసిపి అగ్ర నాయకులు భావిస్తున్నారు.

ఏమిటి ప్రయోజనం అన్న భావనలో కేడర్..

చేయాల్సిన పనులు చేయకుండా, అభివృద్ధికి ఆస్కారం లేకుండా, పార్టీ కేడర్, నాయకులను పట్టించుకోకుండా, వారికి మేలు చేయకుండా.. ఈ తరహా స్టిక్కర్ల కార్యక్రమం పెట్టుకుంటే ప్రయోజనం ఏమిటి అన్న భావన ఆ పార్టీ నాయకుల్లోనే వ్యక్తం అవుతుంది. ఈ తరహా పనుల వల్ల మరింత వ్యతిరేకత పెరుగుతుందే తప్ప.. సానుకూలత రాదన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉండి.. స్థానిక నాయకుల అవసరాలను పట్టించుకోకుండా, గ్రామస్థాయిలో అభివృద్ధికి ఆస్కారం లేకుండా చేసి.. ఇప్పుడు ఈ తరహా కార్యక్రమాలతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు ఫలితం ఇస్తుందన్న భావనను వారు వ్యక్తం చేస్తున్నారు. ఇది చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉందన్న విమర్శ ఆ పార్టీ నాయకుల నుంచే వినిపిస్తోంది.

RELATED ARTICLES

Most Popular