
Khammam: “ఒక్కడై రావడం.. ఒక్కడైపోవడం.. నడుమ ఈ నాటకం”.. ఆ నలుగురు సినిమాలో ఒక మనిషి మరణానికి సంబంధించిన ఈ పాట ఆ యువకుడి విషాదాంతానికి సరిగ్గా సరిపోతుంది.. అందుకే తన చివరి యాత్రకు కూడా ఏర్పాట్లు చేసుకుని కన్నుమూశాడు. అతడి అంతిమ ప్రయాణం గురించి తెలుసుకుంటే గుండె చెమ్మగిల్లక మానదు.
ప్రాణాలు హరించే వ్యాధి సోకిందని తెలుసు, త్వరలో ప్రాణాలు కోల్పోతానని తెలుసు, కానీ అతడు కుంగిపోలేదు, చావుకు లొంగిపోలేదు, చావును ధైర్యంగా ఆహ్వానించాడు.. తన ఆత్మవిశ్వాసం ముందు మరణాన్ని ఓడించాడు. ” నేను చనిపోతున్న.. నా మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసుకున్నా” అంటూ తన అమ్మానాన్నలకు ధైర్యవచనాలు చెప్పాడు.. వినేందుకు విషాదం లాగా కనిపిస్తున్నప్పటికీ.. కళ్ళు చెమ్మగిల్లే వాస్తవం ఇది. చివరకు అనారోగ్యంతో ఆ యువకుడు కన్నుమూయగా.. ఖమ్మంలో బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఖమ్మం నగరానికి చెందిన ఏపూరి శ్రీనివాసరావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. శ్రీనివాసరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ప్రమీల ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేసే పదవి విరమణ పొందారు.. వీరి ఇద్దరి సంతానంలో హర్షవర్ధన్ (33) పెద్దవాడు, అఖిల్ చిన్నవాడు. హర్షవర్ధన్ బీఫార్మసీ పూర్తి చేయగానే పై చదువుల నిమిత్తం 2013 లో ఆస్ట్రేలియా వెళ్ళాడు. బ్రిస్బేన్ లోని ఓ యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్మెంట్ జనరల్ మెడిసిన్ చదివాడు. క్వీన్స్ లాండ్ నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్ గా చేరాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం నగరానికి వచ్చి వివాహం చేసుకున్నాడు. వీసా వచ్చిన తర్వాత భార్యను తీసుకెళ్తానని చెప్పి అదే నెల 29న ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. ఆ ఏడాది అక్టోబర్ నెలలో వ్యాయామం చేస్తుండగా దగ్గుతోపాటు ఆయాసం రావడంతో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా ఊపిరితిత్తుల క్యాన్సర్స్ అవుతుందని వైద్యులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఇంటికి తిరిగి వచ్చేయమని తల్లిదండ్రులు కోరగా.. ఇక్కడ మంచి వైద్యం లభిస్తుంది, మీరు కంగారు పడవద్దని తల్లితండ్రులకు సూచించాడు.

ఇక హర్షవర్ధన్ కు సోకిన క్యాన్సర్ నయమయ్యేది కాదని అక్కడ వైద్యులు తేల్చి చెప్పడంతో.. యువకుడు కుంగిపోలేదు. ముందుగా తన భార్యకు విడాకులు ఇచ్చాడు. ఆమె జీవితంలో స్థిరపడేందుకు ఏర్పాట్లు చేశాడు. తొలుత క్యాన్సర్ కు హర్షవర్ధన్ చికిత్స చేసుకున్నప్పుడు నయమైందని వైద్యులు చెప్పారు. అయితే 2022 సెప్టెంబర్ లో ఖమ్మం వచ్చి 15 రోజులు గడిపి వెళ్ళాడు. ఏమైందో తెలియదు కానీ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. ఈసారి చికిత్సకు వ్యాధి లొంగదని, ఇక మరణం తప్పదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో హర్షవర్ధన్ కుంగిపోలేదు. ఇదే విషయాన్ని బంధువులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.. తను కన్ను మూసిన తర్వాత తన మృతదేహాన్ని ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు.. ఆస్ట్రేలియా దేశపు చట్టాలకు అనుగుణంగా అనుమతులు తీసుకున్నందుకు ఒక న్యాయవాదిని కూడా నియమించుకున్నాడు.. ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుండడంతో చివరి రోజుల్లో తరచూ బంధువులకు, తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అంతేకాదు తన చివరి రోజుల్లో ఆస్ట్రేలియాలో స్థిరపడిన తన స్నేహితులను తన వద్దకు పిలిపించుకొని మాట్లాడేవాడు.. ఈలోగా అంటే మార్చి 24న హర్షవర్ధన్ కన్నుమూశాడు.
ఇక హర్షవర్ధన్ చేసుకున్న ఏర్పాటు ప్రకారం అతని మృతదేహం ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు చేరుకుంది. ఇక బంధువుల సందర్శనార్థం అతడి మృదేహాన్ని ఇంటి వద్ద ఒకరోజు ఉంచారు. ఇక బుధవారం ఉదయం ఖమ్మం లోని హిందూ స్మశాన వాటికలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. అన్ని బాగుంటే మే 21న హర్షవర్ధన్ ఇండియాకు రావాల్సి ఉండేది. ఆ నెలలో అతని తమ్ముడు అఖిల్ వివాహం ఉంది. అందరూ సంతోషంగా గడపొచ్చు అని అనుకున్నారు. కానీ ఈ లోగా హర్షవర్ధన్ విగతజీవిగా స్వగృహానికి రావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బంధువులు ఈ విషాదాన్ని తట్టుకోలేకపోతున్నారు. పుట్టుక మన చేతిలో లేదు, చావు కూడా మన చేతిలో లేదు అంటారు పెద్దలు. కానీ ఎలా చనిపోతానో తెలుసుకున్న హర్షవర్ధన్.. గుండె ధైర్యం కోల్పోలేదు. ఆత్మ విశ్వాసాన్ని సడలనీయలేదు.. తల్లిదండ్రుల్లో ధైర్యాన్ని నింపాడు. స్నేహితులతో కడుపునిండా మాట్లాడాడు. తన మృతదేహాన్ని తన స్వగృహానికి చేర్చుకున్నాడు. చివరకు చావు మీద గెలిచాడు.