
Rayalaseema- CM Jagan: రాయలసీమ సమస్య ఈనాటిది కాదు. దశాబ్ధాల నాటిది. ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పాలకుల నిర్లక్ష్యం రాయలసీమను అగాధంలోకి నెట్టేశాయి. సోదర ప్రాంతాల ముందు చులకన చేశాయి. దేహీ అని అర్థించడమో.. హక్కుల కోసం పోరాడటమో తప్ప.. మరోమార్గం లేకుండా చేశాయి. సమానత్వాన్ని, సోదరభావాన్ని దూరం చేశాయి. నీళ్ల కోసం కొట్లాడటమే పనిగా పెట్టాయి. ఇప్పుడు మరో కొట్లాటకు రాయలసీమ సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుడి, ఎడమల దగాను నిలదీయాల్సిన అవసరం ఏర్పడింది. ఇంతకీ రాయలసీమలో ఏం జరుగుతోంది ? మరో నీటి యుద్ధానికి కారణమేంటో వివరంగా తెలుసుకోండి.
Also Read: Maoist Letter: శ్రీకాకుళం జిల్లాలో మావోయిస్టుల లేఖల కలకలం.. ఆ మంత్రికి రెండోసారి హెచ్చరికలు
రాయలసీమ నిత్య కరువులకు కారణం నికర జలాల కేటాయింపుల్లో అన్యాయం జరగడం. కేవలం వరద జలాల పై ఆధారపడటం. నీటి లభ్యత ఉన్నా.. వేలాది టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నా.. పాలకులు పట్టించుకోకపోవడం రాయలసీమకు ప్రధాన శాపం. తాజాగా రాయలసీమలో అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం పై తీవ్ర దుమారం రేగుతోంది. అప్పర్ భద్ర నిర్మిస్తే రాయలసీమ ఎడారిగా మారుతుందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీనికి కారణం.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్వాకమే. బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 5300 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. త్వరలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తుంగ, భద్ర నదుల సంగమంతో తుంగభద్ర నది పుడుతుంది. ఇది కృష్ణానదికి ఉపనది. అప్పర్ భద్ర ప్రాజెక్టు.. ఓ ఎత్తిపోతల పథకం అని చెప్పవచ్చు. అప్పర్ భద్ర ప్రాజెక్టులో భాగంగా తుంగ నది నుంచి భద్రకు 17.40 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తారు. ఆ తర్వాత భద్ర నుంచి 29.90 టీఎంసీల నీటిని అజ్జంపుర టన్నెల ద్వార కర్ణాటకలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు లక్ష్యం.. చిక్ మగళూరు, దావణగెరె, చిత్రదుర్గ, తుమకూరు ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడం. ఈ ప్రాజెక్టుతో రెండు లక్షల హెక్టార్ల భూమికి మైక్రో డ్రిప్ ఇరిగేషన్ తో నీటి వసతి అందిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2018-19 అంచనాల ప్రకారం 21473 కోట్లు అవసరం అవుతాయి. అదే సమయంలో బడ్జెట్లో రూ. 5300 కోట్లు కేటాయించారు. జాతీయ హోదా కల్పించారు.
అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాయలసీమ ఎడారిగా మారుతుంది. తాగు, సాగు నీరు గగనమవుతుంది. తుంగభద్ర నది మీద కర్ణాటకలోని బళ్లారి జిల్లాలోని హొస్పేట వద్ద డ్యాం నిర్మించారు. ఇది ఏపీ, కర్ణాటకల ఉమ్మడి ప్రాజెక్టు. డ్యాం నిర్మాణ సమయానికి దీని సామర్థ్యం 133 టీఎంసీలు. పూడికతో ప్రస్తుతం 100 టీఎంసీల సామర్థ్యం మాత్రమే ఉంది. అందులో ఏపీకి 72 టీఎంసీలు, తెలంగాణకు 6.51 టీఎంసీలు, కర్ణాటకకు 151.49 టీఎంసీలు కేటాయించారు. ఈ డ్యామ్ కు పూర్తీస్థాయి నీటి సామర్థ్యం దక్కాలంటే భద్ర నది నుంచి వచ్చే వరద నీరే ఆధారం. అప్పర్ భద్ర పూర్తయితే .. భద్ర నది నుంచి కర్ణాటక నీటిని తరలిస్తుంది. భద్ర నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుతుంది. తుంగభద్ర డ్యాం పూర్తీ స్థాయి నీటి మట్టం దక్కడం గగనమవుతుంది. దీంతో ఏపీలోని రాయలసీమ ప్రాంత జిల్లాలకు సాగు, తాగునీరు దక్కకకుండా పోతుంది.
రాయలసీమకు నీటి వాటా దక్కకపోవడానికి రాష్ట్రంలోని వైసీపీ, కేంద్రంలోని బీజేపీ కారణమని చెప్పవచ్చు. కేంద్రంలోని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించింది. ప్రాజెక్టులన్నీ పూర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అప్పర్ భద్రకు జాతీయ హోదా ఇచ్చి, నిధులు కేటాయించింది. నోటి నవ్వి, నొసటితో వెక్కరించడం అంటే ఇదే అనుకుంటా. అప్పర్ భద్ర ప్రాజెక్ట ద్వార రాయలసీమకు అన్యాయం జరుగుతుందని బీజేపీకి తెలియదా ? అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. జాతీయ పార్టీ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కాకుండా సంకుచిత ప్రయోజనాల కోసం వెంపర్లాడుతోందని, తమకు బలం ఉన్న రాష్ట్రాలకే న్యాయం చేస్తోందన్న విమర్శలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వ చేతగానితనం రాయలసీమకు మరో శాపమని చెప్పవచ్చు. ఏడాది క్రితమే జలశక్తి శాఖ హైపవర్ స్టీరింగ్ కమిటీ ఈ ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కోసం సిఫారసు చేసింది. కానీ ఏపీ ప్రభుత్వం ఏడాది నుంచి మీనమేషాలు లెక్కగడుతోంది. కేంద్రం అప్పర్ భద్రకు నిధులు కేటాయించే వరకు నోరు మెదపకుండా ఉంది. ఇప్పుడు సుప్రీంలో పోరాడుతామని చెబుతోంది. ముందే హెచ్చరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ?. ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు ఎంతసేపు స్వప్రయోజనాల కోసం ఢిల్లీ గల్లీల్లో తిరుగుతారు.. కానీ రాయలసీమ కోసం ఎందుకు తిరుగుతారు ?. 2019లో 52 సీట్లకు గాను 49 సీట్లు గెలిపించడమే సీమ ప్రజల చేసిన పాపం కదా.
Also Read: Bumrah Injury- Chetan Sharma: బుమ్రా గాయం పై షాకింగ్ కామెంట్స్ చేసిన టీం ఇండియా చీఫ్ సెలెక్టర్