
Maoist Letter: శ్రీకాకుళం జిల్లాలో మరోసారి మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. చాలా రోజులుగా జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవు. గిరిజన సాయుధ పోరాటం నుంచి జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు అధికం. ప్రజాపోరాటాలకు, ఉద్యమాలకు ఖిల్లాగా సిక్కోలు నిలిచింది. శ్రీకాకుళం, ఒడిశా సరిహద్దులో మావోల స్థావరాలు ఉండేవి. అటు ఉద్దానం, తీర ప్రాంతంలో సానుభూతిపరులు అధికం. అయితే పోలీసులు ఉక్కుపాదం మోపడం, మావోయిస్టుల్లో చేరికల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కొత్త రిక్రూట్ మెంట్ లేకపోవడంతో దాదాపు జిల్లాలో వారి కార్యకలాపాలు తగ్గిపోయాయి. కానీ ఇటీవల మావోయిస్టుల పేరిట ప్రజాప్రతినిధులకు లేఖలు వస్తుండడంతో వారి ప్రభావం తగ్గనట్టుగా తెలుస్తోంది.
కొద్దిరోజులుగా పలాస నియోజకవర్గంలో జరుగుతున్న భూదందాలు, దాని వెనుక ఉన్న ప్రజాప్రతినిధులను టార్గెట్ చేసుకొని మావోయిస్టులు లేఖాస్త్రం సంధించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలాస నియోజకవర్గంలో భూ దందాలు పెరిగినట్టు ఆరోపణలున్నాయి. మంత్రి సీదిరి అప్పలరాజు ముఖ్య అనుచరులతో దందా నడిపిస్తున్నారని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలోని పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాల్లో కొండలు, కోనలు, అడవులను వదలకుండా ఆక్రమణలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. భూముల విషయంలో వివాదాలు సృష్టించడం.. వారే పరిష్కరించినట్టు చేసి భూములను కొల్లగొడుతున్నారన్న ప్రచారం ఉంది.

ఆ మధ్యన పలాస మండలంలో ఓ భూముల వ్యవహారంలో మావోయిస్టుల పేరిట లేఖ వచ్చింది. ఇందులో మంత్రి అప్పలరాజుతో పాటు ఆయన అనుచరులను హెచ్చరిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. పనితీరు మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. దీంతో అలెర్టయిన మంత్రి ఆ వివాదాస్పద భూముల్లో నిర్మాణాలను నిలిపివేయించినట్టు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు పోరాటాల పురిటిగెడ్డ బొడ్డపాడులో జరుగుతున్న భూదందాపై మావోయిస్టులు లేఖాస్త్రం సంధించారు. స్థానిక సర్పంచ్ తో పాటు మంత్రి అప్పలరాజు పేరును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది నకిలీదిగా పోలీసులు చెబుతున్నారు. అయితే పలాస నియోజకవర్గంలో మంత్రి, ఆయన అనుచరుల భూదందాలపై వైసీపీ నేతలే నిజ నిర్థారణ కమిటీ ఏర్పాటుచేశారు. ఊరూరా తిరిగి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇటువంటి సమయంలో మావోయిస్టులు లేఖలు రావడం చర్చనీయాంశంగా మారింది.