
India vs Australia: అహ్మదాబాద్ టెస్ట్ లో రెండో రోజు ఆటలో ఎట్టకేలకు టీమిండియా కు కెమెరాన్ గ్రీన్ రూపంలో తొలి వికెట్ దక్కింది. సెంచరీ పూర్తి చేసుకుని ప్రమాదకరంగా మారుతున్న ఈ ఆల్ రౌండర్ ను రవిచంద్రన్ అశ్విన్ పెవిలియన్ కు పంపాడు. దీంతో వికెట్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసిన భారత జట్టుకు బ్రేక్ లభించింది. కాగా, బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ 2023 లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య ఆఖరి నాలుగో టెస్ట్ మార్చి 9న ఆరంభమైంది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచిన ఆసీస్ రెండో రోజు కూడా దూకుడును ప్రదర్శించింది.
అశ్విన్ మ్యాజిక్..
మొదటి రోజు శతకం పూర్తి చేసుకున్న ఉస్మాన్ ఖవాజాకు సహకారం అందిస్తూనే గ్రీన్ సైతం బ్యాట్ ఝులిపించాడు. గ్రీన్ ఎదుర్కొన్న 170 బంతుల్లో 114 పరుగులు చేసి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యి గా తయారయ్యాడు. ఖవాజా – గ్రీన్ జోడిని విడగొట్టేందుకు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఫలితం రాకపోవడంతో బౌలర్లు నిరాశ చెందాల్సి వచ్చింది. అయితే 131 వ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన వెటరన్స్పిన్నర్ అశ్విన్ తన మాయాజాలంతో గ్రీన్ వికెట్ పడగొట్టాడు. ఈ ఓవర్ లో రెండో బంతిని స్వీప్ షాట్ ఆడేందుకు గ్రీన్ యత్నించాడు. అయితే వికెట్ల వెనక చురుగ్గా కదిలిన కీపర్ కేఎస్ భరత్ చక్కగా బంతిని ఒడిసి పట్టడంతో వికెట్ దక్కినట్టు అయింది.

ఒకే ఓవర్ లో రెండు వికెట్లు..
దీంతో గ్రీన్ సెంచరీ ఇన్నింగ్స్ కు ముగింపు పడింది. 378 పరుగులు వద్ద ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయినట్టు అయింది. ఇక అదే ఓవర్లో అశ్విన్ అలెక్స్ క్యారీ వికెట్ కూడా తీయడం విశేషం. అశ్విన్ బౌలింగ్లో ఆఖరి బంతికి అక్షరకు క్యాచ్ ఇచ్చి క్యారీ డకౌట్ గా వెనుతిరిగాడు. ఎందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నేటిజన్లు అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘ఎట్టకేలకు వికెట్లు పడగొట్టడం మొదలుపెట్టారు. అశ్విన్ అనుభవం అక్కరకొచ్చింది’ అనే కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రెండో రోజు మూడో సెషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 429 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. టాడ్ మురఫీ 23 బంతుల్లో 15 పరుగులు, నాథన్ లియాన్ 60 బంతుల్లో 11 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇక భారత్ బౌలింగ్ విషయానికొస్తే అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకోగా, మహమ్మద్ షమీ రెండు, రవీంద్ర జడేజా, అక్షర పటేల్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. అయితే నాలుగో టెస్టులో భారత్ ముందు ఆస్ట్రేలియా భారీ స్కోర్ ను ఉంచబోతోంది.