
YCP: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏ ఎన్నికైనా వార్ వన్ సైడ్ గా ఉండేది. అన్ని ఎన్నికల్లో ఫలితాలు ఆ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. అయితే తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో ఓటమి భయం అధికార పార్టీని వెంటాడుతోంది. ముఖ్యంగా పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. అన్నింటికీ మించి టీడీపీ, వామపక్షాలు పరస్పర అవగాహనకు రావడం కలవరం పుట్టిస్తోంది. రెండో ప్రాధాన్యత ఓటు విషయంలో ఉభయులు ఒక నిర్ణయానికి వచ్చారు. దీంతో తమ గెలుపుపై ప్రభావం చూపిస్తుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. తొలిసారిగా ఓటమి తప్పదని అంతర్గత సమావేశాల్లో చెప్పుకుంటున్నారు. ఓటర్లుగా ఉన్న గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయుల మద్దతు కోరే క్రమంలో వారి నుంచి నీలదీతలు వ్యక్తమవుతుండడంతో అధికార పార్టీ ఆందోళన చెందుతోంది.
ప్రధానంగా తూర్పు, పశ్చిమ రాయలసీమకు సంబంధించి గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎన్నికలు వైసీపీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలోనూ అదే పరిస్థితి. సాధారణ ఎన్నికల తరహాలో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సహజంగానే ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి.విశాఖకు పరిపాలన రాజధాని ప్రకటించిన నేపథ్యంలో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఫలితం వైసీపీకి అనుకూలంగా రాకపోతే మాత్రం ఆ పార్టీ ఆత్మరక్షణలో పడుతుంది. రాయలసీమలో రెండు పట్టభద్రుల స్థానాల ఫలితాలపై టఫ్ ఫైట్ కొనసాగుతోంది. అటు ఉపాధ్యాయ స్థానాల విషయంలో మాత్రం వైసీపీకి ఎదురు గాలి తప్పదని ప్రత్యర్థులు ఎంతో ధీమాగా చెబుతున్నారు.
తూర్పు, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి పీడీఎఫ్ అభ్యర్థులుగా బాబురెడ్డి, కత్తి నరిసంహారెడ్డిలు బరిలో ఉన్నారు. వీరిద్దరు సిట్టింగ్ లు. ఉపాధ్యాయవర్గాల్లో పట్టుంది. ప్రభుత్వంపై ఉపాధ్యాయులు ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులంతా ఏకపక్షంగా మద్దతు తెలుపుతారని భావిస్తున్నారు. అయితే సుమారు 10 వేల ఓట్లను ప్రైవేటు ఉపాధ్యాయులతో నమోదు చేయించారు. వీటిపైనే వైసీపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు రెండో ప్రాధాన్యత ఓట్లతో సైతం గట్టెక్కగలమని వైసీపీ నేతలు భావిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితులు లేవని తెలుస్తుండడంతో అధికార పార్టీలో కలవరం పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటమి పలుకరిస్తే.. అది ప్రభుత్వ వ్యతిరేకతను తారస్థాయికి చేర్చే చాన్స్ ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.