Andhra Jyothi: కే శ్రీనివాస్ పదవి విరమణ వయసు అయిపోయినప్పటికీ.. ఆయన కొద్దిరోజులుగా ఎక్స్ టెన్షన్ లో కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల ముందే ఆయన ఆంధ్రజ్యోతికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. ఏం జరిగిందో తెలియదు గాని ఆయన అదే పోస్టులో కొనసాగారు. అయితే ఇప్పుడు ఆయన ఎడిటర్ పోస్టుకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. కే శ్రీనివాస్ 1983 -84 నుంచి జర్నలిజం లో కొనసాగుతున్నారు. మొదట్లో ఆయన ఊరువాడ అనే పత్రికలో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఉదయం, ఆంధ్రజ్యోతి మూతపడే సమయం వరకు అందులోనే చేశారు. ఆంధ్రజ్యోతి మూతపడటంతో కొన్ని చిన్న చిన్న పత్రికల్లోనూ పని చేశారు. ప్రజాతంత్రలో కొత్త వంతెన తో వ్యాసాలు రాసేవారు. ఆంధ్రజ్యోతి పున: ప్రారంభమైన తర్వాత అసిస్టెంట్ ఎడిటర్ గా కొనసాగే వారు. 2008 వరకు రామచంద్రమూర్తి ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా ఉన్నారు. ఆయన హెచ్ఎంటీవీ కి వెళ్లిపోవడంతో.. శ్రీనివాస్ 2008 జనవరిలో ఆంధ్రజ్యోతి పత్రికకు ఎడిటర్ గా కొనసాగుతూ వస్తున్నారు. దాదాపు 16 సంవత్సరాల పాటు ఆయన ఆంధ్రజ్యోతికి ఎడిటర్ గా పనిచేశారు. పదవి విరమణ కాలం పూర్తి కావడంతో.. కొద్దిరోజుల నుంచి ఆయన ఎక్స్ టెన్షన్ లో కొనసాగుతున్నారు. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో రాహుల్ ఎడిటర్ అవుతారని.. నవంబర్ ఒకటి నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది..
డిజిటల్ మీడియాలోకి..
పత్రికలు పతనావస్థకు చేరుకోవడం.. ముద్రణ మాధ్యమం క్రమక్రమంగా ప్రభను కోల్పోవడంతో కే శ్రీనివాస్.. మరో ఇద్దరు దిగ్గజ జర్నలిస్టులతో కలిసి డిజిటల్ మీడియా వేదికను ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో ఆ ఇద్దరు జర్నలిస్టులతో కే శ్రీనివాస్ ఆంధ్రజ్యోతిలో కలిసి పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారంతా అద్భుతమైన కథనాలను రాశారు. అందువల్ల అప్పట్లో ఆంధ్రజ్యోతి ఒక ట్రెండ్ సెట్టర్ లాగా ఉండేది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాలలో చోటుచేసుకున్న అవకతవకలపై తమదైన స్థాయిలో కథనాలను వారు ప్రచురించారు.. అందువల్లే నాడు ఆంధ్రజ్యోతి ఒక సంచలనంగా ఉండేది. అదే స్థాయిని ఇప్పటివరకు కొనసాగించడంలో శ్రీనివాస్ విజయవంతమయ్యారు. అయితే శ్రీనివాస్ జతకట్టే ఆ ఇద్దరు జర్నలిస్టులు ఎవరు? అనే చర్చ మీడియాలో ప్రముఖంగా సాగుతోంది.. వివాద రహితుడిగా.. మేనేజ్మెంట్ కోణంలో పనిచేసి.. అద్భుతమైన జర్నలిస్టుగా పేరుపొందిన కే శ్రీనివాస్.. రాజీనామా చేయడం ఆంధ్రజ్యోతి పత్రికకు ఒకింత ఇబ్బందికర పరిస్థితి అని సీనియర్ జర్నలిస్టులు అంటున్నారు.. అయితే ఆయన త్వరలో ఇద్దరు దిగ్గజ జర్నలిస్టులతో కలిసి ఒక డిజిటల్ ఫ్లాట్ ఫారం ఏర్పాటు చేస్తారని.. దానికోసం పెట్టుబడి పెట్టే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. అయితే ఆ డిజిటల్ ప్లాట్ ఫారం ఎలా ఉంటుంది? పత్రికను మాత్రమే ప్రేమించే కే శ్రీనివాస్.. అందులో ఇమడగలుగుతారా? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. ఆ దిగ్గజ జర్నలిస్టుల్లో ఒకరు ఇటీవలే తెలుగులో డిజిటల్ మీడియా పెట్టి తొలి ఆన్ లైన్ పత్రికను ప్రారంభించి సక్సెస్ అయ్యారు. అందులోంచి బయటకు రావడానికి ఆయన చూస్తున్నారు… కే శ్రీనివాస్ తో కలిసి ఒక డిజిటల్ మీడియాను స్ట్రాట్ చేయబోతున్నారని సమాచారం. మీడియా సర్కిల్స్ లో జరుగుతున్న ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది వేచిచూడాలి