Garasia Tribe: పెళ్లికి ముందే కార్యం చేసుకోవాలి. నచ్చితేనే కళ్యాణం చేసుకోవాలి. కార్యమంటే అదేనండి శృంగారం,శోభనం, ఆపై సహజీవనం. వినడానికి వింతగా ఉంది కదూ. ఇదేదో పాశ్చాత్య దేశాల్లో వ్యవహార శైలిలా ఉంది కదూ. అయితే ఇలాంటి ఆచారాలు పాటిస్తున్న పలు తెగలు మనదేశంలో కూడా ఉండడం విశేషం. సహజీవనం అనేది ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతి అనేవారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లో అలా కలిసి ఉంటే వేరే వేరే పేర్లతో పిలుస్తారు. అయితే రాజస్థాన్లోని ఓ గ్రామంలో మాత్రం ఇదో ట్రెండ్ గా కొనసాగుతోంది. అది తమకు సహేతుకంగా ఉండటమే కాకుండా.. లింగ వివక్ష, దంపతుల మధ్య గొడవలు, విడాకులు వంటివి ఉండవని అక్కడివారు చెబుతున్నారు. ఓసారి ఆ సాంప్రదాయాన్ని తెలుసుకుందాం.
రాజస్థాన్ లోని గారాసియా తెగలో ఈ వింత ఆచారం నడుస్తోంది. యువతీ యువకులు ఒకరికొకరు నచ్చితే సహజీవనం చేస్తారు. వారికి సంతానం కలిగి.. అతడిని ఆమె ఇష్టపడితేనే.. భర్తగా అంగీకరిస్తేనే వివాహం చేస్తారు. రాజస్థాన్ లోని ఉదయపూర్, పాలీ జిల్లాల్లో ఈ తెగ ఎక్కువగా కనిపిస్తుంది. గుజరాత్ లో సైతం ఈ తెగ కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉంది. వీరి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గ్రామాల్లో రెండు రోజులపాటు జరిగే జాతరలే వాళ్లకు పెళ్లిచూపులు వేదికగా పరిగణిస్తారు. జాతరలో కలుసుకునే యువతి యువకులు తమకు నచ్చిన వాళ్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఒకరినొకరు ఇష్టపడితే లేచిపోతారు. తిరిగి వచ్చి ఆ విషయం పెద్దలకు చెప్పి సహజీవనం మొదలు పెడతారు. పిల్లలు పుట్టిన తర్వాత తమకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే వివాహం చేసుకుంటారు. కొందరైతే పిల్లలు లేకుండానే జీవితాంతం సహజీవనం కొనసాగిస్తారు.
ఇక్కడ వింత ఏమిటంటే 50,60 ఏళ్ల వయసు వారు కూడా పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. వారి పిల్లలు పెళ్లిళ్లు చేసిన ఘటనలు ఉన్నాయి. రాజస్థాన్లోని ఓ మారుమూల గ్రామంలో 70 ఏళ్ల నానియా గారాసియా, 60 ఏళ్ల కాలీని వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ బంధానికి 40 ఏళ్లు పూర్తయింది. అప్పటినుంచి సహజీవనం చేస్తున్నారు. వీరికి కొడుకులు, కుమారులు కోడళ్ళు, మనువులు అందరూ ఉన్నారు. ఇప్పటివరకు లివింగ్ రిలేషన్ షిప్ లోనే కొనసాగారు. ఆమె తనకు సరైన భర్త ని భావించడంతో పిల్లలే వివాహం చేయడం విశేషం. గరాసియా తెగలో గత 1000 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో కనిపించే ఈ సంస్కృతి కుగ్రామాల్లో సైతం వెలుగు చూడడం విశేషం.