https://oktelugu.com/

Mahashivratri 2024: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే..

ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు కూడా మాంసాహారం, గుడ్లను అసలు తినకూడదు. మద్యపానం కూడా సేవించకూడదు. ఉపవాసం అని.. కొందరు ఆలస్యంగా లేస్తారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 6, 2024 / 03:00 PM IST

    Mahashivratri 2024

    Follow us on

    Mahashivratri 2024: దేశవ్యాప్తంగా హిందువులు అందరూ జరుపుకునే పండుగ శివరాత్రి. అందరికి ముఖ్యమైన పండగ కూడా శివరాత్రినే. అయితే మాఘమాసం బహుళ చతుర్ధశి రోజు పరమేశ్వరుడు లింగరూపంలో ఉద్భవించారు అని పురాణాల ద్వారా తెలుస్తోంది. లింగోద్భవం జరిగిన రోజునే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడి పండుగల్లో ఇది ప్రదానమైన పండుగ.శివరాత్రి రోజు ఆ మహాశివుడికి జాగరణ, ఉపవాసం ఉండడం సంప్రదాయం.

    ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు కూడా మాంసాహారం, గుడ్లను అసలు తినకూడదు. మద్యపానం కూడా సేవించకూడదు. ఉపవాసం అని.. కొందరు ఆలస్యంగా లేస్తారు. కానీ అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయమే లేచి.. తల స్నానం చేసి శివదర్శనం చేసుకోవాలి. అంతేకాదు శివనామస్మరణతో ఉపవాసం ఉండాలి. రాత్రివేళ శివలింగానికి పూజలు చేస్తూ జాగారం ఉండాలి. పూజ విధానం, మంత్రాలు తెలియకపోతే.. ఉపవాసం, జాగరణం, బిల్వార్చన అభిషేకం వంటి వాటిలో పాల్గొన్నా కూడా శివానుగ్రహం లభిస్తుందంటున్నారు పండితులు.

    శివరాత్రి రోజు పైన తెలిపినట్టుగా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమ:శివాయ అనే పంచాక్షరీ మహమంత్రం జపం, స్మరణతో జాగరణ మీలో నిక్షప్తమై ఉన్న శక్తిని జాగృతం చేసేలా చేస్తుంది. శివరాత్రి తర్వాత రోజు శివాలయానికి వెళ్లాలి. ఆ తర్వాతనే ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేయాలి. అంతటితో ఉపవాసం ముగుస్తుంది.

    శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసేవారు తర్వాత రోజు వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుంది అంటున్నారు పండితులు. మహాశివరాత్రి రోజు శివ ప్రతిష్ట చేసినా, శివపార్వతుల కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే.. తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఎక్కువ ఇష్టపడతాడట ఆ మహాశివుడు. త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి.. చతుర్థశి నాడు ఉపవాసం చేయాలి.