India vs New Zealand 1st Odi: హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, న్యూజీలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో శుభ్ మన్ గిల్ రెచ్చిపోయాడు. వన్డేల్లో తొలిసారి డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. అద్భుత ఆటతీరుతో కివీస్ కు భారీ లక్ష్యం నిర్దేశించాడు. 208 పరుగులతో అజేయంగా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ (34), సూర్యకుమార్ యాదవ్ (31), హార్థిక్ (28) కాస్త ఫర్వాలేదనిపించారు. కివీస్ బౌలర్లలో మిెల్, పిప్లే చెరో రెండు వికెట్లు తీయగా ఫెర్గూసన్, టిక్నర్, శాంట్నర్ తలో వికెట్ పడగొట్టారు.

వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా శుభ్ మన్ గిల్ నిలిచాడు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తరువాత స్థానంలో గిల్ సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ మూడు సార్లు డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ (208: 149 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్సులు) తో పరుగుల వరద పారించాడు. దీంతో భారత్ భారీ స్కోరు చేయగలిగింది. 145 బంతుల్లోనే 200 స్కోరు దాటడం విశేషం. 87 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 122 బంతుల్లో 150 పరుగులు రాబట్టాడు.
తరువాత 50 పరుగులను 23 బంతుల్లోనే చేరుకున్నాడు. కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరాశపరచినా గిల్ మాత్రం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆకాశమే హద్దుగా కివీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. సమయం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్సులు బాదుతూ ప్రేక్షకులకు కనువిందు చేశాడు. హైదరాబాద్ వాసుల పరుగుల దాహాన్ని తీర్చాడు. గిల్ ఆట చూసిన వారికి ఉత్సాహం ఉరకలేసింది. అతడి బ్యాటింగ్ విన్యాసాలు చూసి ముచ్చెట చెందారు. చాలా రోజుల తరువాత పరుగుల వర్షంలో అభిమానులు తడిసిపోయారు.

టీమిండియా భారీ స్కోరు సాధించడంతో విజయంపై ధీమాగా ఉంది. ఇక బౌలర్ల వంతు ఉంది. బ్యాటింగ్ లో మాత్రం ఇరగదీశారు. బౌలింగ్ లో కూడా వారిని కట్టడి చేస్తే భారీ విజయం నమోదు కావడం తథ్యమే. ఇప్పటికే శ్రీలంపై టీ20, వన్డే సిరీస్ లు రెండు కైవసం చేసుకున్న ఇండియా మరో విజయంపై కన్నేసింది. కివీస్ ను కట్టడి చేసి బ్రహ్మాండమైన విజయం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు ఆటగాళ్లు కూడా అదే విధంగా కదులుతున్నారు. మొత్తానికి ప్రేక్షకులకు పరుగుల వర్షం కురిపించి వారిని సంతోషపరిచారు.