IAS And BJP MLA Marriage: ఆయన ఓ ఎమ్మెల్యే, ఆమె ఐఏఎస్ అధికారిణి. వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. అయితే అదేదో సాదాసీదా వివాహం కాదు. ఏకంగా మూడు లక్షల మంది అతిధులకు శుభలేఖలు పంపించారు. దాదాపు 100 గ్రామాల ప్రజలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు రిసెప్షన్ లను ఏర్పాటు చేయనున్నారు. వినడానికి వింతగా ఉంది కదూ. మరి నిజంగానే ఆ పెళ్లి జరుగుతుండడం మరింత విస్తుగొల్పడం ఖాయం. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
హర్యానాలోని అదంపూర్ నియోజకవర్గం నుంచి భవ్య బిస్నోయ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనుమడు. బిజెపి సీనియర్ నాయకుడు కులదీప్ బిస్నోయ్ కుమారుడు. భవ్యకు పరి బిష్నోయ్ అనే ఐఏఎస్ అధికారిణితో వివాహం జరగనుంది. ఆమె 2019లో సివిల్స్ సాధించారు. సిక్కిం క్యాడర్ కింద గ్యాంగ్ టాక్ లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ వివాహానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ లో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 22న వివాహం జరగనుంది.
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు, ఆపై ఎమ్మెల్యే కావడం, వధువు ఐఏఎస్ అధికారిని కావడం, ఆమె స్వస్థలం రాజస్థాన్ కావడంతో వివాహం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఇరు కుటుంబాల వారు నిర్ణయించారు. వివాహం మాత్రం యువతి రాష్ట్రమైన రాజస్థాన్లోని ఉదయపూర్ లో జరగనుంది. అక్కడే పుష్కర్ నగరంలో రిసెప్షన్ నిర్వహించనున్నారు. అనంతరం అదంపూర్, ఢిల్లీలో సైతం రిసెప్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
అదంపూర్ నియోజకవర్గంలో భజన్ లాల్ కుటుంబం కి మంచి పట్టు ఉంది. దాదాపు అక్కడ 100 గ్రామాలకు పైగా వారికి పెట్టని కోటలే. అందుకే ప్రతి గ్రామానికి ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. హర్యానా, రాజస్థాన్, ఢిల్లీలోని పార్టీ ప్రముఖులకు ప్రత్యేకంగా ఒక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3 లక్షల మంది అతిధులు హాజరుకానున్నట్లు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.