Manchu Family Issue : చాలా కాలం క్రితమే మంచు ఫ్యామిలీలో లుకలుకలు మొదలయ్యాయి. మోహన్ బాబు, విష్ణులతో మనోజ్ దూరంగా ఉంటున్నాడు. హైదరాబాద్ లోని నివాసాన్ని వదిలిపోయాడు మనోజ్. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ ఉండటం లేదు. విబేధాలు తలెత్తాయని కథనాలు వెలువడ్డాయి. సిల్వర్ స్క్రీన్ కి కూడా దూరమైన మనోజ్… కొన్నాళ్ళు చెన్నైలో అద్దెకు ఉన్నాడట. తాను ప్రేమిస్తున్న మౌనికతో పాటు అక్కడ రహస్యంగా కాపురం పెట్టాడు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మనోజ్ స్వయంగా చెప్పడం విశేషం.
మౌనికతో వివాహం కూడా మోహన్ బాబుకు ఇష్టం లేదు. అందుకే ఆయన పెళ్ళికి దూరంగా ఉన్నాడు. మనోజ్ పెళ్లి బాధ్యత మంచు లక్ష్మి తీసుకుంది. తన నివాసంలో వేడుక జరిపింది. పెళ్లి రోజు, అది కూడా చివరి నిమిషంలో మోహన్ బాబు హాజరయ్యారు. ఈ వేడుక జరిగిన రోజుల వ్యవధిలో విష్ణు తనపై, తన మనుషులపై దాడి చేస్తున్నాడంటూ మనోజ్ ఓ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వెంటనే ఆ వీడియో డిలీట్ చేశాడు. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో ఆ వీడియో రుజువు చేసింది.
ఇక గత వారం రోజులుగా పెద్ద హైడ్రామా చోటు చేసుకుంది. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న వీరి విబేధాలు రచ్చకు ఎక్కాయి. మోహన్ బాబును మనోజ్ కొట్టాడని, అదే సమయంలో మోహన్ బాబు మనుషులు మనోజ్ పై దాడి చేశారంటూ వార్తలు వచ్చాయి. గాయాలతో మనోజ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రావడం సంచలనం అయ్యింది. అనంతరం ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు.
హైదరాబాద్ లో గల జుల్పల్లి ఫార్మ్ హౌస్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. విష్ణు-మనోజ్ ప్రైవేట్ సైన్యాన్ని దించారు. ఇరు వర్గాలకు చెందిన బౌన్సర్స్ అక్కకు చేరారు. అనంతరం మరిన్ని అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. తన పోరాటం, ఆవేదన ఆస్తి గురించి కాదు. నా కుటుంబం భద్రత, ఆత్మగౌరవం కోసం అని మనోజ్ మీడియాతో అన్నారు. మంచు విష్ణు బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీవిద్యా నికేతన్ లో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి.
బాధిత విద్యార్థులకు నేను అండగా ఉంటానని మనోజ్ వెల్లడించారు. ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బండారం బయటపెడతాను అన్నారు. భయపెట్టాడో.. భయపడ్డాడో తెలియదు కానీ.. మనోజ్ ప్రెస్ మీట్ పెట్టలేదు. మరోవైపు పోలీసులు ఇరువర్గాలకు వార్నింగ్ ఇచ్చారు. దాడులకు పాల్పడితే సహించేది లేదు అన్నారు. మనోజ్ తో సెటిల్మెంట్ కి మోహన్ బాబు రెడీ అయ్యాడని, ఇక ఈ వివాదం సద్దుమణిగినట్లే అంటున్నారు. మనోజ్ కి కొంత ఆస్తి కట్టబెట్టి పూర్తిగా వదిలించుకునే ఆలోచనలో మోహన్ బాబు ఉన్నారని టాక్.