Gold : బంగారం అంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినా కొనేందుకు వెనుకాడడం లేదు కొందరు.. మరి కొందరు బంగారం రేటు ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్నారు. బంగారం ధర తగ్గింది అని తెలిస్తే వెంటనే ఎంతో కొంత కొని తెచ్చుకోవాలని తెగ ఆరాటపడుతుంటారు. మమూలుగానే మన దేశ సంప్రదాయంలో బంగారానికి ఎప్పటి నుంచో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో శుభకార్యాలు, పండుగలు, ఫంక్షలు జరిగితే తప్పనిసరిగా బంగారం టాపిక్ వస్తూనే ఉంటుంది. మహిళలు ఎక్కడ ఉన్నా వారి మధ్య బంగారం టాపిక్ రాకుండా ఉండదు. ఏదైనా ఫంక్షన్ కు వెళితే వారు తప్పుకుండా ఉన్నంత వరకు బంగారు ఆభరణాలు ధరించి కనిపిస్తుంటారు. కొంత మంది బంగారాన్ని పెట్టుబడిలా భావించి కొనుగోలు చేసి పెట్టుకుంటారు.
ఇది ఇలా ఉంటే మరి బంగారాన్ని ఎంతైనా కొనుగోలు చేయవచ్చా.. సంపాదించిన డబ్బుల పై పన్నులు ఉన్నట్లే ఇంట్లో కూడబెట్టిన బంగారం పై కూడా ఏమైనా ట్యాక్స్ ఉంటుందా అని చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. అవును.. బంగారానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో బంగారం ఎంత మొత్తంలో బంగారం ఉండాలో ప్రభుత్వం కొన్ని నియమనిబంధనలను రూపొందించింది. వీటి ప్రకారం పెళ్లి అయిన మహిళ తన ఇంట్లో 500 గ్రాము(1/2కేజీ)ల బంగారాన్ని పెట్టుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ( CBDT ) నిబంధనల ప్రకారం.. బంగారాన్ని నిర్దేశించిన మొత్తం వరకే బంగారాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. అంత బంగారం ఎలా వచ్చిందో ఒక వేళ అధికారులు అడిగితే అన్నింటికీ లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ప్రూఫ్స్ చూపించాలి.
వివాహిత మహిళలు ఎక్కువగా బంగారం కొనుగోలు చేస్తుంటారు. అందుకే పెళ్లి అయిన మహిళలు తమ ఇంట్లో 500 గ్రామలు బంగారాన్ని పెట్టుకోవచ్చునని ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం పేర్కొంది. పెళ్లి కాని వాళ్లు అయితే 250 గ్రాముల గోల్డ్ ఉంచుకోవచ్చు. ఒక ఫ్యామిలీలోని ఎవరైనా పురుషులు 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే ఉంచుకోవాలి. ఒకవేళ వారసత్వంగా బంగారం లభిస్తే అంటే.. వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం, చట్టబద్ధమైన వారసత్వం ద్వారా వచ్చే ఆదాయంతో బంగారం కొనుగోలు చేస్తే మాత్రం ఎలాంటి పన్ను ఉండదు. అలాంటి బంగారంపై పన్ను ఉండదు. కానీ ఆ బంగారం అమ్మేవారు మాత్రం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. బంగారం కోనుగోలు చేసిన మూడు ఏళ్ల తర్వాత విక్రయిస్తే.. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (LTCG) కట్టాల్సి ఉంటుంది. దానిపై వచ్చే లాభంపై 20శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.