
Holi 2023: హోలీ అంటే రంగులు పూసుకోవడం, నీళ్లు చల్లుకోవడం, నెత్తి మీద కోడిగుడ్లు కొట్టుకోవడం, దావత్ చేసుకోవడం.. ఇప్పుడు పండుగ పరమార్థమే మారిపోయింది. అసలు దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం తెలిస్తే బాగుండు.. ఎవరైనా చెబితే బాగుండు. పెద్దలు చెప్తే వినే తరమా ఇది.. పోపోవోయ్ మాకు చెప్పొచ్చావు అని ఈసడించుకుంటారు.. ఒక రెండున్నర దశాబ్దాలు వెనక్కి వెళ్తే హోలీ పండుగ ఇలా ఉండేది కాదు. అసలు పండుగే ఇది కాదు. విరగబోసిన మొదుగు పూలను, తంగేడు పూలను తెంపి రోట్లో వేసి మెత్తగా నూరి, అందులో నీళ్లను పోసి కలిపి మీద చల్లుకునేవారు. అంతకు మునుపే కాముని పౌర్ణమి ప్రారంభమైన నాటి నుంచి చిన్నపిల్లలు కోలలు ఆడేవారు.
తుమ్మ కర్రలను కొట్టుకొచ్చి వాటి బెరడు తీసి, కోలలు పగలకుండా ఉండేందుకు పసుపు రాసేవారు.. తెలంగాణ సమాజంలో చారిత్రక వారసత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఈ కోలలు ఆడేటప్పుడు కూడా చిన్నారులు ఆ చారిత్రక వారసత్వం నుంచి వచ్చిన పాటలను అత్యంత సులువుగా పాడేవారు.. “రింగు రింగు బిళ్ళ రూపాయి దండ, దండకాదురో దామర మొగ్గ, వీరన్న బుల్లి కోడె, వీరగంధం పూసుకుని, జామ చెట్ల పండబోతే” ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని బోలెడు పాటలు.. నాడు కోలాటం ఆడే పిల్లల్లో ఉత్సాహం ఉండేది.. ఇప్పటిలాగా కార్పొరేట్ విద్య లేదు కాబట్టి, ఆర్థిక అంతరాలు అంతంత మాత్రమే కాబట్టి, తల్లిదండ్రులు ర్యాంకులు, మార్కులు అంటూ ఇబ్బంది పెట్టకపోయే వారు కాబట్టి.. అప్పటి పిల్లల్లో చురుకుదనం ఎక్కువగా ఉండేది.. పైగా చదువుకునే పాఠశాలల్లో ఆటలకు ప్రత్యేకంగా సమయం ఉండేది. అందుకే వారు పాట పాడే విధానం లోనూ, కోలలు ఆడే విధానంలోనూ పల్లె సంస్కృతి కొట్టొచ్చినట్టు కనిపించేది.
ఇలా ఇంటింటికి తిరిగి కోలలు ఆడిన తర్వాత వసూలు చేసిన బియ్యాన్ని భద్రపరచుకునేవారు.. వచ్చిన నగదును వంట సామగ్రి కొనుగోలు కోసం ఖర్చు చేసేవారు. హోలీ పండుగ నాడు మోదుగు పూల మిశ్రమాన్ని చల్లుకొని, ఉత్సాహంగా ఆడిన తర్వాత పిల్లలంతా కలిసి ఊరి బయటకు వన భోజనాలకు వెళ్లేవారు. అక్కడ ప్రకృతి మధ్యలో వంటలు చేసుకునేవారు. తర్వాత చెరువు ఒడ్డున ఉన్న ఒండ్రు మట్టి తీసుకొచ్చి దానిని దేవుడి ప్రతిమగా మలిచే వారు. వండిన వంటలో మొదటి భాగం ఆ దేవుడికి పెట్టేవారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేసేవారు. తిరిగి సాయంత్రం ఇళ్లకు చేరేవారు. ఇలా వారి హోలీ పండగ ముగిసేది.

నాడు ఆటలాడేవారు. పాటలు పాడేవారు. వేళకు ఇంత తినేవారు. సాయంత్రం 8 దాటితే పడుకునేవారు. కానీ ఇప్పుడు అలా ఉందా పరిస్థితి? ఆటలెరుగని బాల్యం, ర్యాంకులు, మార్కులు తప్ప మరొకటి తెలియని బాల్యం, అయితే డాక్టర్ లేదా ఇంజనీర్ అంటూ ఒత్తిడి తెచ్చే తల్లిదండ్రులు, కనీసం క్రీడా మైదానాలు లేని కార్పొరేట్ స్కూళ్ళు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా.. అభివృద్ధి ముసుగులో, ఆర్థిక స్థిరత్వం అనే భ్రమలో మనుషుల జీవితం ఎంత విచ్చిన్నమవుతోంది? చివరికి మనదైన పండుగను, మనదైన సంస్కృతి కనుమరుగవుతోంది. ఒక్క హోలీ మాత్రమే కాదు..ఎన్నో పండుగలు ఏదో అకేషన్ గా మారాయంతే.
మారిన పరిస్థితుల వల్ల హోలీ కాస్త రంగోలి అయింది.. కామ దహనం కాస్త భోగి పండుగను తలపిస్తోంది.. మోదుగ పూల చెట్టు కాలగర్భంలో కలిసిపోయింది. దాని స్థానంలో కృత్రిమ రంగు మన శరీరాలను తాకుతోంది. ప్రకృతి మధ్యలో తినాల్సిన భోజనం కాస్త సత్తె కాలపు సాంప్రదాయం అయింది. దాని స్థానాన్ని బిర్యానీ ఆక్రమించింది. ఇంకొన్ని రోజులు పోతే అసలు హోలీ పండుగ నేపథ్యం పూర్తిగా కనుమరుగయిపోయి.. రంగులు చల్లుకోవడం, తాగటం, అది దిగేదాకా ఊగటం వరకు ఎదుగుతుంది.. కొత్త దాని కోసం చింత ఏర్పడినప్పుడు… పాత దాంట్లో ఉన్న ఆనందం, అందులో ఉన్న గొప్పదనం ఏం అర్థమవుతాయి?!