Foreign Universities In India: విదేశీ విశ్వవిద్యాలయాలు తమ ప్రాంగణాలను భారత్ లో ప్రారంభించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు “భారత్ లో విదేశీ విద్యాసంస్థల ప్రాంగణాల ఏర్పాటు- నియమ నిబంధనలు 2023” పేరిట ముసాయిదాను విడుదల చేసింది.. ఈ సందర్భంగా యుజిసి చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ ఆన్ లైన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18 లోపు ముసాయిదాపై, అభిప్రాయాలు సూచనలను యూజీసీకి పంపించాలని కోరారు.. నూతన జాతీయ విద్యా విధానం_2020 సిఫారసుల మేరకు విదేశీ వర్సిటీ ప్రాంగణాల ఏర్పాటుకు యు జి సి అనుమతి ఇస్తున్నది.. నెలాఖరుకల్లా గెజిట్ విడుదల చేసే అవకాశం ఉంది. మనదేశంలో ప్రతి సంవత్సరం 4.5 లక్షల మంది విద్యార్థులు విదేశీ విద్య నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్తున్నారు.. అవి ఇక్కడికి వస్తే విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు.. ఇక కోర్సులకు సంబంధించి ఫీజు విషయం ఆయా యూనివర్సిటీలే నిర్ణయిస్తాయి.

పారదర్శకంగా ప్రక్రియ
యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యోచిస్తోంది. తుది గెజిట్ విడుదలైన అనంతరం దరఖాస్తులను ఆహ్వానించనుంది.. ఆసక్తి ఉన్న విదేశీ విద్యాసంస్థలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.. అవి దరఖాస్తు చేసుకున్న 45 రోజుల్లో అనుమతులు ఇస్తారు.. ఎంపికైన సంస్థలు రెండు సంవత్సరాలలో ప్రాంగణాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.. తొలుత పది సంవత్సరాలకు మాత్రమే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనుమతి ఇస్తుంది.. ప్రపంచ ఓవరాల్ సబ్జెక్టు ర్యాంకింగ్లో 500 లోపు ఉన్న యూనివర్సిటీలకే అనుమతి ఇస్తారు.. ఒకవేళ ర్యాంకింగ్ లో పాల్గొనకుండా ఆ దేశంలో మంచి గుర్తింపు, ప్రతిష్టాత్మక వర్సిటీ అయితే ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటారు.. కేవలం ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే ఫుల్ టైం కోర్సులను మాత్రమే అందించాలి.. ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్, దూరవిద్య కోర్సులను అనుమతించరు. ఇందులో పనిచేసే ప్రొఫెసర్ల ఎంపిక యూనివర్సిటీలకు మాత్రమే ఉంటుంది.. విదేశీ ప్రొఫెసర్లను నియమించుకుంటే సెమిస్టర్ లేదా రెండు సెమిస్టర్లు పూర్తయ్యే వరకు వారు ఇక్కడే పనిచేయాలి.. ప్రాంగణాన్ని ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు ఉంటుంది.. సాంకేతిక కోర్సులకు ఏఐసీటిఈ అనుమతి ఉండాలా? వద్దా? తదితర అనేకాంశాలపై ముసాయిదా నియమావళిలో స్పష్టత లేదు..

గేమ్ చేంజర్
యుజిసి తీసుకున్న నిర్ణయం పట్ల యువత హర్షం వ్యక్తం చేస్తోంది.. మనదేశంలో ఏటా 4.5 లక్షల మంది వివిధ కోర్సుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్నారు. అక్కడే ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. దీనివల్ల విలువైన మానవ వనరులు దేశానికి దక్కకుండా పోతున్నాయి.. ఇది దేశ అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.. మేథో వలస కారణంగా ఇతర దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి. దీనికి అడ్డుకట్ట వేసేందుకే యుజిసి ఈ నిర్ణయం తీసుకుంది.. పైగా భారతదేశంలో విద్యార్థులు వెంటనే నేర్చుకునే స్వభావం ఉన్న వారు కావడంతో విదేశీ విద్యాసంస్థలు తమ ప్రాంగణాలను ఇక్కడ ఏర్పాటు చేస్తాయని యుజిసి భావిస్తోంది.