Famous YouTubers: అరచేతిలో ప్రపంచం ఇమిడి పోతున్నది. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతోంది. ఒక స్మార్ట్ ఫోన్ మనిషి జీవితాన్ని ఎంతలా మార్చింది అంటే.. మాట, పాట, ఆట, బతుకు, భవిత, కవిత, విద్య, వైద్యం ఉద్యోగం, వ్యాపారం, వినోదం, ఆనందం, ఆహ్లాదం, ఆహారం, పర్యాటకం, విమానయానం.. ఒకటా రెండా.. మన దేహంలో పుట్టకపోయినప్పటికీ.. మన శరీరంలో ఒక భాగం అయిపోయింది స్మార్ట్ ఫోన్.. దీని ఆధారంగా జరిగే కార్యక్రమాలు చెప్పాల్సి వస్తే.. చాంతాడంత జాబితా ఉంటుంది.. ఇలాంటి స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కరి వద్ద యూట్యూబ్ అనేది ఉంటుంది. ఇక దాని గురించి చెప్పాల్సి వస్తే అది ఒక మహాసముద్రం. దానిని ఆధారంగా చేసుకొని చాలామంది కోట్లల్లో సంపాదిస్తున్నారు. అలా మనదేశంలో ఫేమస్ అయిన కొంతమంది యూట్యూబర్ల గురించి తెలుసుకుంటే..
క్యారీ మీనాటి
ఈ యూట్యూబ్ ఛానల్ కు దాదాపు నాలుగు కోట్లకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. దీనిని అజయ్ నాగర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్ ప్రాంతానికి చెందిన ఇతడు.. హాస్యం, వ్యంగ్యం, వీడియో గేమ్స్ కు సంబంధించి మూడు యూట్యూబ్ చానల్స్ నడుపుతుంటాడు. పది సంవత్సరాలకే గేమింగ్ వీడియోలతో యూట్యూబ్లోకి అడుగు పెట్టాడు. దాన్ని కెరియర్ గా మలుచుకున్నాడు. దూర విద్యలో చదువుకున్నాడు. అనతి కాలంలోనే మూడు కోట్ల సబ్స్క్రైబర్లతో.. దేశంలోనే ఆ ఘనతను సాధించిన తొలి యూట్యూబర్ గా రికార్డు సృష్టించాడు. ప్రకటనలు, స్పాన్సర్ ల ద్వారా పాతికేళ్ల అజయ్ సంపాదించిన ఆస్తులు దాదాపు 50 కోట్లు.
నవ్విస్తూనే సంపాదించాడు
అతని పేరు ఆశిష్ చంచ్లానీ.. అతడి సొంత రాష్ట్రం మహారాష్ట్ర.. ఇతడికి నటన అంటే ఇష్టం. ఇంజనీరింగ్ చదివినప్పటికీ.. ఉద్యోగం వైపు వెళ్లకుండా 2014లో ఆశిష్ చంచ్లానీ వైన్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. వీడియోలు చేస్తూనే బాలీవుడ్ సినిమాల ప్రమోషన్ కు, ఈవెంట్లకు వెళ్లేవాడు.. హాస్యాన్ని పండించడంలో ఆశిష్ దిట్ట. తమాషా మాటలతో నవ్విస్తుంటాడు. సరదా నేపథ్యాలను సృష్టించి అలరిస్తుంటాడు. ఇప్పటివరకు 3.3 కోట్ల సబ్స్క్రైబర్లను సంపాదించాడు. ఎన్నో పురస్కారాలు గెలుచుకున్నాడు. యూట్యూబర్ గా ఇతడు 41 కోట్లు సంపాదించాడు.
కామెడీ వీడియోలతో..
నవ్వడం ఒక యోగం.. దానిని చాలామందికి అందించేందుకు ఢిల్లీకి చెందిన భువన్ అనే పాటల రచయిత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు.. కాశ్మీర్ వరదల్లో కొట్టుకుపోయిన తన కొడుకు గురించి ఒక తల్లిని ఓ విలేఖరి అడుగుతున్న ప్రశ్నలతో ఉండే వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.. అది అపరిమితమైన వ్యూస్ సొంతం చేసుకుంది. దీంతో అతడు సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నాడు. అలా 2015లో షార్ట్ కామెడీ వీడియోలతో ఛానల్ మొదలుపెట్టాడు. రెండున్నర కోట్లకు పైగా సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. 30 సంవత్సరాల భువన్ సంపాదన ప్రస్తుతం 122 కోట్లు. ఫ్యాషన్ దుస్తుల కంపెనీలకు ప్రచారకర్తగా భువన్ పని చేస్తున్నాడు.
నవ్వించడమే ఉపాధి మార్గం
నిత్య జీవితంలో ఎదుటి వ్యక్తిని నవ్వించడం అంత సులభం కాదు. కానీ ఢిల్లీకి చెందిన అమిత్ నవ్వించడాన్నే ఉపాధి మార్గంగా మార్చుకున్నాడు. తమాషా డబ్బింగ్ వీడియోలతో 2017లో సొంతంగా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. ఎగ్జామ్ బి లైక్ అండ్ చేసిన వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది. దీంతో అతడు ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. హ్యూమర్.. పేరడీని కలిపి వీడియోలు రూపొందించే అతడు ఇప్పటివరకు యూట్యూబ్ ద్వారా 50 కోట్లకు పైనే సంపాదించాడు.
టెక్నాలజీ పై పట్టు సాధించి..
ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు చాలా ఉపకరణలు మార్కెట్ ను ముంచెత్తుతున్నాయి.. ఇలాంటి సమయంలో ఎలాంటి వస్తువు కొనాలి? మోసాల పట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలి? అనే విషయాలపై 32 సంవత్సరాల గౌరవ్ చౌధురి సోదాహరణంగా వివరిస్తున్నాడు. టెక్ గురు అవతారం ఎత్తి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన గౌరవం తన తండ్రితో కలిసి దుబాయ్ వెళ్ళాడు. అక్కడ పనిచేస్తూనే.. మైక్రో ఎలక్ట్రానిక్స్ విభాగంలో చదువు కొనసాగించాడు. తనకు వచ్చిన సందేహాలను తీర్చుకునేందుకు యూట్యూబ్ ను వినియోగించుకునే వాడు. అలా సాంకేతిక పరిజ్ఞానం పై పట్టు సాధించి 2015లో సొంతంగా ఛానల్ మొదలుపెట్టాడు. దాదాపు రెండున్నర కోట్ల మంది సబ్స్క్రైబర్లను పొందాడు. ఇప్పటివరకు 350 కోట్లకు పైగానే సంపాదించి దేశంలోనే రిచెస్ట్ యూట్యూబర్ల జాబితాలో చేరిపోయాడు.
65 ఏళ్ల వయసులో యూట్యూబ్ స్టార్
ఆమె వయసు 65 సంవత్సరాలు. ఈ వయసులో సాధారణంగా ఏ పనీ చేతకాదు. చేద్దామన్నా శరీరం సహకరించదు.. కానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిషా మధులిక సరికొత్త ప్రయోగం చేసింది. కుకింగ్ వీడియోలతో పాపులర్ అయింది. ఆమె యూట్యూబ్ ఛానల్ కు దాదాపు కోతిన్నర సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా ఆమె 43 కోట్ల రూపాయలను సంపాదించారు.. అంతేకాదు టాప్ యూట్యూబర్ల జాబితాలో చేరారు. మొదట ఆమె తన బ్లాగులో శాఖాహార వంటకాల గురించి రాసేవారు. 2009లో ఛానల్ పెట్టి తాను చేసిన వంటల గురించి సబ్ స్క్రైబ్ ర్లకు వివరిస్తున్నారు.
మీరు మాత్రమే కాదు ఇంకా చాలామంది యూట్యూబ్ స్టార్స్ ఉన్నారు. మాటలతో, పాటలతో, పాటలతో అలరిస్తూ దర్జాగా సంపాదిస్తున్నారు.