LSG Vs GT: హాలిడే రోజు లక్నో -గుజరాత్ ఆసక్తికర పోరు.. ఎవరు గెలుస్తారో?

పాయింట్ల పట్టికలో ఈ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది. చివరిగా పంజాబ్ జట్టుతో ఆడిన మ్యాచ్లో 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : April 7, 2024 1:39 pm

LSG Vs GT

Follow us on

LSG Vs GT: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఈ ఆదివారం రాత్రి మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్లో లక్నో, గుజరాత్ జట్లు తలపడనున్నాయి.. ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 200 పరుగుల విజయ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ జట్టు అన్ని రంగాల్లో విఫలమైంది. అటు లక్నో బెంగళూరు ను ఓడించి మంచి జోరు మీద ఉంది. ఈ సీజన్లో అటు గుజరాత్, ఇటు లక్నో నిలకడగా ఆడుతున్నాయి. పాయింట్ల పట్టికలో లక్నో నాలుగో స్థానంలో.. గుజరాత్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాయి.. మరి ఆదివారం జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో ఒకసారి పరిశీలిస్తే..

లక్నో

ఈ సీజన్లో నిలకడగా ఆడుతోంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడి.. రెండిట్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్ ఇటీవల బెంగళూరు తో ఆడింది. ఆ మ్యాచ్ లో డూ ప్లెసిస్ సేనను మట్టికరిపించి విజయాన్ని దక్కించుకుంది. దీంతో గుజరాత్ జట్టుతో జరిగే మ్యాచ్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. ఓపెనర్ డికాక్ బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో తన పూర్వపు ఫామ్ లోకి వచ్చాడు. పూరన్ సైతం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దేవ దత్ ఇంకా తన లయను దొరకబుచ్చుకోలేదు. స్టోయినిస్, కృణాల్ పాండ్యా వంటి వారు స్థాయికి తగ్గట్టుగా ప్రదర్శన చేయాల్సి ఉంది. ఇక ఈ జట్టుకు మెరుపు బౌలర్ మయాంక్ అగర్వాల్ ప్రధాన అస్త్రంగా మారాడు. బుల్లెట్ వేగంతో బంతులు సంధిస్తూ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్యా మెరుగ్గా బౌలింగ్ వేస్తే లక్నో జట్టుకు తిరుగుండదు.

గుజరాత్

పాయింట్ల పట్టికలో ఈ జట్టు ఏడవ స్థానంలో కొనసాగుతోంది. చివరిగా పంజాబ్ జట్టుతో ఆడిన మ్యాచ్లో 200 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది. రెండిట్లో విజయాలు సాధించింది. కెప్టెన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్ వంటి వారు ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నప్పటికీ.. భారీ స్కోరుగా మలచడంలో విఫలమవుతున్నారు. డేవిడ్ మిల్లర్, విలియంసన్ ఆశించినంత స్థాయిలో ఆటం లేదు. మోహిత్ శర్మ జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. ఒమర్ జాయ్, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ రాణిస్తే గుజరాత్ జట్టుకు అడ్డు ఉండదు.

విశ్లేషణ

రెండు జట్లు బలంగా ఉన్నాయి. అయితే కీలక సమయంలో రాణించిన దానిని బట్టే విజయావకాశాలుంటాయి. ప్రదర్శన పరంగా చూస్తే గుజరాత్ వైపు కాస్త మొగ్గు కనిపిస్తోంది.. అలా అని లక్నో జట్టు చేతులు ఎత్తేసే రకం కాదు.. గుజరాత్ బ్యాటింగ్లో డెప్త్ కనిపిస్తోంది. బౌలింగ్ లో కూడా అన్ని వనరులున్నాయి. లక్నోలో కూడా ఉన్నప్పటికీ.. ఆ జట్టు బౌలింగ్ విభాగంలో ఒక్కరి మీదే ఆధారపడుతోంది. ఈ మ్యాచ్ లో బౌలర్లు కనుక సత్తా చాటితే లక్నో నుంచి గుజరాత్ కు గట్టి పోటీ ఖాయం.

జట్ల అంచనా ఇలా

గుజరాత్

మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్, విజయ్ శంకర్, రాహుల్ తేవాటియ, ఓమర్ జాయ్, సాయి సుదర్శన్, గిల్(కెప్టెన్), కేన్ విలియంసన్, వృద్ధిమాన్ సాహ, రషీద్ ఖాన్.

లక్నో

మయాంక్ యాదవ్, సిద్ధార్థ్, నవీన్, రవి, కృనాల్ పాండ్యా, పూరన్, స్టోయినిస్, దేవదత్ పడిక్కల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్.