Dropout Chaiwala: చదువుకుంటే జీవితంలో గొప్ప స్థానానికి వెళ్తాం అనేకుంటే తప్పే. చదువు మనకు మంచి చెడు విచక్షణ తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. కష్టపడే తత్వం, పట్టుదల, కృషి ఉంటే.. చదువు లేకపోయినా జీవితంలో ముందుకు వెళ్లవచ్చు. మనసుకు నచ్చిన రంగంలో రాణిస్తే.. అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా మంది నిరూపించారు. తాజాగా మరోసారి ప్రూవ్ చేశాడు నెల్లూరు కుర్రాడు. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కానీ చదువు మీద ఆసక్తి లేకపోవడంతో.. వ్యాపారం చేద్దామనుకున్నాడు. ఈ క్రమంలో అతడికి వచ్చిన ఆలోచన ఆ యువకుడి జీవితాన్ని పూర్తి మార్చేసింది.

డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా..
ఆంధ్రప్రదేశ్ నెల్లూరుకు చెందిన కొండా సంజిత్ ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ యూనివర్శిటీలో బ్యాచిలర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) చదివేందుకు అవకాశం లభించింది. ఎన్నో ఆశలతో విమానం ఎక్కి.. ఆస్ట్రేలియాకు వెళ్లాడు. అయితే సరిగా చదవకపోవడంతో.. కాలేజీ డ్రాప్ అవుట్‌గా మారాడు. ఇంత దూరం వచ్చి.. ఇలా ఓడిపోవడం సంజితను కుంగదీసింది. అయితే ఓడిన చోట తనను తాను నిరూపించుకోవాలని భావించాడు. తన అపజయాన్ని సూచించేలా డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా అనే టీ కొట్టు స్టార్ట్ చేశాడు. ఈ విషయం గురించి తల్లిదండ్రులకు చెప్పిన వెంటనే.. వారు భయపడ్డారు. ఇంత ఖర్చు చేసి.. ఆస్ట్రేలియా పంపిస్తే.. చదువుకోకుండా.. ఇలా టీ కొట్టు పెట్టుకోవడం ఏంటని బాధపడ్డారు.
నచ్చిన పనిలో రాణింపు..
సంజిత్‌కు చిన్నతనం నుంచే చాయ్ అంటే చాలా ఇష్టం. టీ మీద మక్కువతోనే.. ఆస్ట్రేలియాలో టీ షాప్ స్టార్ట్ చేయాలని భావించాడు. ఈ క్రమంలో అస్రార్ అనే ఒక ఎన్‌ఆర్‌ఐ సంజిత్ ఆలోచనను నమ్మి.. ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించాడు. వచ్చే నెలతో ఈ చాయ్ దుకాణం ప్రాంరభించి ఏడాది పూర్తి అవుతుంది. ఇక పన్నులు పోగా.. సంజిత్‌కు ఇప్పటికే రూ.5.2 కోట్ల లాభం మిగిలింది. మెల్‌బోర్న్ వాసులు ఎక్కువగా కాఫీ అంటే ఇష్టపడతారు. కానీ ప్రస్తుతం డ్రాప్‌అవుట్ చాయ్‌వాలా తయారు చేసే టీ అంటే మక్కువ కనబరుస్తున్నారు.

గర్వపడుతున్నారు..
తన డ్రాప్ అవుట్ చాయ్‌వాలా షాప్‌కు వచ్చే వారిలో భారతీయులు, ఆస్ట్రేలియా వాసులు కూడా ఉన్నారని సంజిత్ తెలిపారు. చాయ్ విత్ సమోసా అంటే తెగ ఇష్టపడుతున్నారన్నారు. మన భారతీయులైతే.. బాంబే కటింగ్ టీ అంటే చాలా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఆస్ట్రేలియన్లు అయితే మసాలా చాయ్, దాంతోపాటు పకోడాలు తింటూ.. సరదాగా గడుపుతారని తెలిపాడు. త్వరలోనే మరో ఔట్‌లెట్ తెరిచే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు. టీ షాప్ తెరుస్తాను అన్నప్పుడు వద్దన్న నా తల్లిదండ్రులు.. ఇప్పుడు నా విజయం చూసి గర్వ పడుతున్నారని తెలిపాడు. ఇక సోషల్ వర్క్‌లో డిగ్రీని కూడా పూర్తి చేసినట్లు వెల్లడించాడు. సంజిత్ మాటలు విన్న వారు.. మనసుకు నచ్చిన రంగంలో కృషి చేస్తే.. తప్పకుండా విజయం సాధిస్తామని మరో సారి నిరూపించాడని ప్రశంసిస్తున్నారు.