Dogs Chase: ప్రపంచంలో విశ్వాసమైన జంతువు కుక్క. మనుషులతో చాలా స్నేహంగా ఉంటాయి. అయితే ఇటీవల కుక్కలు మనుషులపైనే తిరగబడతున్నాయి. చిన్న పిల్లలను చంపేస్తున్నాయి. వేసవి ప్రారంభంలో క్రూరంగా మారుతున్నాయి. వేడి కారణంగానే ఇలా వ్యవహరిస్తాయని పశువైద్యులు పేర్కొంటున్నారు. ఇక కుక్కలు కొన్నిసార్లు కదిలే వాహనాలను చూసి కోపంతో వెంబడిస్తాయి. తరుముతాయి. ద్విచక్రవాహనదారులు కిందపడిన సందర్భాలూ ఉన్నాయి.
కారణం ఇదే..
జంతు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కుక్కలకు మనుషులపై శత్రుత్వం ఉండదు. అయితే వాహనాల టైర్లపై ఎక్కువగా కుక్కలు మూత్ర విసర్జన చేస్తాయి. వాసనను వేగంగా గురి‍్తంచే కుక్కలు వాహనాలు వెళ్తున్నప్పుడు వాసనను పసిగట్టి వెంటపడతాయట. మనం కారు ఎక్కడైనా పార్కింగ్ చేసినప్పుడు వీధి కుక్కలు మూత్ర విసర్జన చేస్తాయి. ఇతర ప్రాంతం కుక్కలు లేదా స్థానిక ఇతర కుక్కలు మూత్ర విసర్జన చేసి ఉంటే కుక్కలు గుర్తించి శత్రువులుగా భావిస్తాయట. అందుకే కారు లేదా బైక్‌ను చూసి మొరగడం, వెంటపడడం చేస్తాయట.
కొత్త కుక్కలు వచ్చినా..
కొత్తగా వీధుల్లోకి కుక్కలు వచ్చినప్పుడు దానిని తరిమేందుకు ఆ ఏరియాలోని కుక్కలన్నీ జట్టుగా ముందుకు కదులుతాయి. ఎందుకంటే కుక్కలు కూడా తమ ఏరియాను ఇష్టపడతాయి. అక్కడకు కొత్తవారి రాకను అంగీకరించవు. అందుకే మరొక కుక్క వచ్చినప్పుడు, లేదా ఇతర ప్రాంత కుక్కలు మూత్ర విసర్జన చేసిన కారు లేదా బైక్ వచ్చినప్పుడు ఇట్టే గుర్తిస్తాయి. తమ ప్రాంతంలోకి మరో కుక్క వచ్చిందని భావిస్తాయి. అందుకే కొత్త కుక్కలను తరలిమినట్లుగానే వాహనాలు వచ్చినప్పుడు కూడా వాటి వెంటపడతాయి.
విషయం తెలియక..
ఈ విషయం తెలియక వాహనదారులు ఆందోళన చెందుతారు. కారులో ఉన్నవారు పెద్దగా భయపడకపోయినా ద్విచక్రవాహనదారులు అయితే అదుపు తప్పి కిందపడిన సందర్భాలూ ఉన్నాయి. వాసన ఒక కారణమైతే అతివేగం, విత శబ్దాలతో డ్రైవింగ్ చేయడం వంటి కారణాలు కూడా కుక్కలు వెంటపడేందుకు కారణమంటున్నారు. వాహనం మెల్లగా నడిపితే కుక్కలు వెంటపడడం మానేస్తాయని జంతు నిపుణులు పేర్కొంటున్నారు.