Google Year In Search: గూగుల్.. ప్రపంచప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఏదో ఒక విషయంపై వెతుకుతూనే ఉంటారు. సినిమాల కోసం కొందరు.. క్రీడల కోసం మరికొందరు.. తమ చదువుసంధ్యలపై విద్యార్థులు.. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు.. సమస్త ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ గూగుల్ భాండాగారంలోనే నిక్షిప్తమై ఉంటుంది. అందుకే గూగుల్ ఇప్పుడు అందరికీ సర్వస్వం అయిపోయింది.. మరి 2022 ముగుస్తోంది. డిసెంబర్ తో ఈ ఏడాదికి టాటా చెప్పబోతున్నాం. మరి ఈ ఏడాది భారతదేశంలో జనాలు ఏం వెతికారు? దేని కోసం ఎక్కవగా శోధించారన్న విషయాలను ‘గూగుల్’ బయటపెట్టింది. అదిప్పుడు వైరల్ గా మారింది.

గూగుల్ తన ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ ఫలితాలను బుధవారం భారతీయ వినియోగదారుల కోసం ప్రకటించింది. 2022 సంవత్సరంలో దేశంలోని ప్రజలు సెర్చ్ ఇంజిన్‌లో ఏం శోధించారన్నది బయటపడింది. ఏటా విడుదల చేసే ఈ జాబితా విస్తృతంగా ఉంటుంది. ట్రెండింగ్ ఈవెంట్‌లు, క్రీడలు, వార్తలు, సినిమాలు.. మరిన్ని వంటి అంశాల శ్రేణిగా ఉంటుంది.

‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ జాబితాలో గూగుల్ లో ఈ సంవత్సరం అత్యధికంగా వెతికింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గురించే. ఇదే గూగుల్ లో టాప్ ట్రెండింగ్ సెర్చ్ గా నంబర్ 1 ర్యాంకులో నిలిచింది. ఆ తర్వాత కోవిన్ వ్యాక్సిన్ యాప్, అనంతరం ఫిఫా వరల్డ్ కప్ 2022. ఈ జాబితా గత సంవత్సరం ఫలితాలతో పోల్చినప్పుడు కొంచెం తేడాగా ఉంది. 2021లో కరోనావైరస్ సంబంధిత ప్రశ్నల గురించి ప్రజలు ఎక్కువగా గూగుల్ లో శోధించారు. ఈ సంవత్సరం కరోనా తగ్గడంతో శోధన ట్రెండ్‌లలో మార్పు వచ్చింది. గూగుల్ ‘ఇయర్ ఇన్ సెర్చ్ 2022’ ప్రకారం.. ప్రజలు ఎక్కువగా ఆసియా కప్ , ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ వంటి క్రీడా ఈవెంట్‌ల గురించి కూడా శోధించారు. అవి వరుసగా నాలుగు , ఐదో స్థానాల్లో ఉన్నాయి.

బాలీవుడ్ వీఎఫ్ఎక్స్-భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ’ గూగుల్ సెర్చింగ్ లో ఆరో ర్యాంక్‌ను పొందింది. ‘కేజీఎఫ్ : చాప్టర్ 2’ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. సినీ ప్రేక్షకులు కాశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్, కాంతారా, పుష్ప: ది రైజ్ , విక్రమ్ చిత్రాల కోసం కూడా శోధించారు. దీనితో పాటు, లాల్ సింగ్ చద్దా, దృశ్యం -2 , థోర్ లవ్ అండ్ థండర్ ఈ సంవత్సరం కూడా టాప్ 10 సినిమా శోధనలలో ఉన్నాయి.
ఇవి కాకుండా ప్రభుత్వ ‘అగ్నీపథ్ స్కీమ్’ గూగుల్ సెర్చ్ లిస్ట్‌లో ‘వాట్ ఈజ్’ కేటగిరీలో అగ్రస్థానంలో ఉంది. తర్వాత నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) , నాన్-ఫంగబుల్ టోకెన్ (NFT) ఉన్నాయి.

2022 కోసం గూగుల్ శోధనలోని వ్యక్తిగత అవసరాల విభాగంలో ‘నా దగ్గర కోవిడ్ వ్యాక్సిన్’ , ‘స్విమ్మింగ్ పూల్’, ‘వాటర్ పార్క్’ , ‘సినిమాలు’ అత్యంత డిమాండ్ చేయబడిన అంశంగా గూగుల్ లో ఉన్నాయి..
మరోవైపు, గూగుల్ సెర్చ్ ‘ఎలా’ జాబితాలో.. అగ్రస్థానం ‘వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా’ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ‘పిటిఆర్‌సి చలాన్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి’ అని చూపిస్తుంది.
గూగుల్ ప్రకారం.. 2022లో దేశంలో అత్యధికంగా శోధించబడిన వ్యక్తులు ఎవరని చూస్తే.. ఒక మత ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ మొదటి స్థానంలో ఉన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధాని రిషి సునక్, లలిత్ మోదీ ,సుస్మితా సేన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

2022లో ‘పనీర్ పసంద’ రెసిపీ ఎక్కువగా శోధనలో కనిపించింది. ఆ తర్వాత ‘మోదక్’ , ‘సెక్స్ ఆన్ ది బీచ్’ ఉన్నాయి.
వార్తా సంఘటనల విషయానికొస్తే.. లతా మంగేష్కర్, సిద్ధూ మూస్ వాలా, క్వీన్ ఎలిజబెత్ , షేన్ వార్న్‌ల మరణం అత్యధికంగా శోధించబడిన అంశాలని గూగుల్ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, యూపీ ఎన్నికలు , హర్ ఘర్ తిరంగా ప్రచారంపై కూడా ప్రజలు ఆసక్తి కనబరిచారు.
మొత్తంగా ప్రజలు తమకు అవసరమైన వాటిని ఎక్కువగా వెతికారు. దేశంలో అన్నింటికంటే కూడా క్రేజ్ క్రికెట్ కే ఉందని తేలింది. అందుకే ఐపీఎల్ టాప్ 1 లిస్టులో ఉంది.