Google Search: గూగుల్ లో ఎక్కువ ఏం వెతుకుతున్నారో తెలుసా?

గూగుల్ ఏర్పడి ఈనెల 4 నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. 2003_22 వరకు ప్రజలు ఎక్కువ వెతికిన పదాలపై అల్ జజీరా అనే ఒక సంస్థ జాబితా సిద్ధం చేసింది.

Written By: Bhaskar, Updated On : September 7, 2023 12:35 pm

Google Search

Follow us on

Google Search: మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ తల్లిని అడిగేస్తాం. ఎటువంటి అనుమానం ఉన్నా.. క్లారిటీ కోసం గూగుల్ లో శోధిస్తాం. ఇంతకుముందు అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి పుస్తకాలు తిరగేయాల్సిన పని ఉండేది. లేదా ఆ విషయం మీద పరిజ్ఞానం ఉన్న వారిని సంప్రదించాల్సి వచ్చేది. ఇప్పుడు ఇటువంటి ప్రయాస పడాల్సిన అవసరం లేదు. గూగుల్ లో మనకు కావలసిన సబ్జెక్టును టైప్ చేస్తే సరిపోతుంది. ఇక స్మార్ట్ ఫోన్లో అయితే వాయిస్ కమాండ్ ద్వారా ఒక్క మాట చెప్తే సరిపోతుంది. ఇక ఆ అంశానికి సంబంధించిన సమస్త సమాచారం మొత్తం మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది.

గూగుల్ ఏర్పడి ఈనెల 4 నాటికి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా.. 2003_22 వరకు ప్రజలు ఎక్కువ వెతికిన పదాలపై అల్ జజీరా అనే ఒక సంస్థ జాబితా సిద్ధం చేసింది. ఆరు విభాగాల్లో వ్యక్తులపరంగా బ్రిట్నీ స్పియర్స్ కోసం ఎక్కువ మంది శోధించారు. సాంకేతిక విభాగంలో ఫేస్బుక్, స్పోర్ట్స్ కేటగిరీలో ఫిఫా, ప్రకృతి విపత్తులకు సంబంధించి సునామి, మూవీ, టీవీ షో లల్లో హ్యారీ పోటర్, ఇతర విభాగాల్లో దేశానికి సంబంధించి ఎక్కువగా వెతికినట్టు తెలుస్తోంది… అయితే మిగతా కేటగిరీలో అశ్లీల సైట్లను వెతికే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. అయితే వీరిని పరిగణనలోకి తీసుకోలేదని అల్ జజీరా పేర్కొన్నది. ఇక ఈ సర్వే జాబితాను రెండు కేటగిరీలుగా విభజించిన ఆల్ జజీరా.. మగవాళ్ళు ఎక్కువగా ఫ్యాషన్ దుస్తులను ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్టు ప్రకటించింది. కోట్లాదిమంది ఇంటర్నెట్ యూజర్లలో మిలీనియం తరం సాంకేతిక అంశాల కంటే సౌందర్య ఉత్పత్తులపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారని ప్రకటించింది.

ఇంటర్నెట్ యూజర్లలో దాదాపు ఆరు కోట్ల మంది మహిళలు చక్కగా తమ జీవితాన్ని మార్చుకునేందుకు గూగుల్ ను వాడుతున్నట్టు ఆల్ జజీరా పేర్కొన్నది. సౌందర్య ఉత్పత్తులను, వ్యక్తిత్వ వికాస తరగతులను, విద్యకు సంబంధించిన విషయాలను నేర్చుకునేందుకు ఎక్కువగా గూగుల్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ సమయంలో పోటీ పరీక్షలకు ప్రిపరయ్యే వారంతా గూగుల్ ను ఆశ్రయించినట్టు సర్వే నివేదికలో ఆల్ జజీరా పేర్కొంది. ఇక ఇంటర్నెట్ వాడే వారిలో 75% మందిలో 15 నుంచి 34 ఏళ్ల వారే ఉన్నారని తెలుస్తోంది.. ఇక వ్యక్తిగత విషయాలకు వచ్చేసరికి.. భారతీయ మహిళలు ఎక్కువ మంది గోరింటాకు డిజైన్ల గురించి సెర్చ్ చేస్తున్నారు. ఎక్కువగా రొమాంటిక్ పాటలు, రొమాంటిక్ కవితల గురించి కూడా వెతుకుతున్నారు. అందరికంటే అందంగా ఉండేందుకు, భిన్నంగా కనిపించేందుకు ఇంటర్నెట్ వాడుతున్నారని ఆల్ జజీరా పేర్కొంది. ఆన్లైన్ షాపింగ్ సైట్లను కూడా అమ్మాయిలు ఎక్కువగా చూస్తున్నారని, దుస్తులు, కొత్త కలెక్షన్లు వంటి వాటిని కూడా చర్చిస్తున్నారని ఆల్ జజీరా వివరించింది. వీటితోపాటు ఎటువంటి కెరియర్ ఎంచుకోవాలి? ఎటువంటి కోర్సులో చేరాలి? ఏ విద్యాసంస్థ బాగుంది? అనే విషయాల పట్ల కూడా మహిళలు ఎక్కువగా శోధిస్తున్నట్టు ఆల్ జజీరా వివరించింది.