Daggubati Venkateswara Rao : ఇటీవల ఎన్టీఆర్( Nandamuri Taraka Rama Rao ) అల్లుళ్ల మధ్య సఖ్యత పెరిగింది. దశాబ్దాల వైరాన్ని మరిచి నారా, దగ్గుబాటి కుటుంబం ఒకటైంది. అయితే వారి మధ్య దశాబ్దాల వైరం నడుస్తూ వచ్చింది. మూడు దశాబ్దాల వైరానికి.. ఎన్నికలకు ముందు కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు మిగిలిన కొద్దిపాటి వైరం సైతం ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబుతో ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైరం ఈనాటిది కాదు. టిడిపిలో సంక్షోభం తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు. వెంకటేశ్వరరావు ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పటినుంచి వైరం కొనసాగుతూనే ఉంది.
* టిడిపి ఆవిర్భావం నుంచి దగ్గుబాటి
ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara ). తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ వెనుక ఉండేవారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు చిన్న అల్లుడు చంద్రబాబు. 1979 ఎన్నికల్లో ఎమ్మెల్యే అయిన చంద్రబాబు మంత్రిగా కూడా ఉండేవారు. ఎన్టీఆర్ అల్లుడు అయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రబాబుపై టిడిపి అభ్యర్థి గెలుపొందారు. అటు తరువాత టిడిపిలో చేరారు చంద్రబాబు.
* ఇద్దరి పాత్ర కీలకం
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) చంద్రబాబుతో పాటు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీ రోల్ ప్లే చేశారు. 1995 వరకు ఇద్దరూ కలిసి మెలిసి ఉండేవారు. 1995 ఆగస్టు సంక్షోభంతో చంద్రబాబు సీఎం అయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మంత్రి అయ్యారు. అయితే కొద్ది రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు టిడిపికి గుడ్ బై చెప్పారు. అటు తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. భార్య పురందేశ్వరి కేంద్రమంత్రి అయ్యారు.
* ఈ ఎన్నికలకు ముందు నుంచే..
అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కాగా.. దగ్గుబాటి దంపతులు ఇద్దరూ బిజెపిలోకి( BJP) వెళ్లారు. తరువాత వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అటు తరువాత రాజకీయాలనుంచి వైదొలిగారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు మనసు మార్చుకున్నారు. చంద్రబాబు కుటుంబానికి దగ్గర ఏ ప్రయత్నం చేశారు. వెంకటేశ్వరరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక వారి మధ్య సత్సంబంధాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. బిజెపి ఏపీ చీఫ్ గా పురందేశ్వరి ఎన్నిక కావడం.. టిడిపి తో ఆ పార్టీకి పొత్తు కుదర్చడం వెనుక పురందేశ్వరి కీలక పాత్ర పోషించారు. కూటమి గెలవడంతో రెండు కుటుంబాల మధ్య సఖ్యత ఏర్పడింది. ఈ తరుణంలో తొలిసారిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి వెళ్లారు. తాను రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో ఆ ఇద్దరు నేతలు ఆత్మీయంగా మాట్లాడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.