Balineni Srinivasa Reddy : వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. నిన్నటికి నిన్న తుని మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు టిడిపిలో చేరారు. దీంతో అక్కడ పాలకవర్గం మైనారిటీలో పడింది. మున్సిపల్ చైర్ పర్సన్ సైతం రాజీనామా చేశారు. త్వరలో అక్కడ టిడిపి జెండా ఎగరనుంది. తాజాగా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ లో సైతం వైసీపీకి పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 20 మంది కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీరంతా బాలినేని శ్రీనివాస్ రెడ్డి అనుచరులుగా గుర్తింపు పొందారు. ఈరోజు సమావేశమైన వారు జనసేనలోకి వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు.
* ఎన్నికల తరువాత గుడ్ బై
2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( balineni Srinivasa Reddy ). భారీ ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. తరువాత కొద్ది రోజులకే జనసేనలో చేరిపోయారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు నుంచే బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉండేవారు. నాయకత్వం ఆదేశించడంతో బలవంతంగా పోటీ చేశారు. ఓటమి తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక రాజీనామా చేశారు. వెంటనే జనసేనలో చేరి ప్రకాశం జిల్లాలో జనసేన బలోపేతానికి కృషి చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఒంగోలు పై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తన అనుచరులను జనసేనలోకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా 20 మంది కార్పొరేటర్లు ఒకేసారి జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారు.
* పవన్ లేకపోవడంతో
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( YSR Congress)నుంచి భారీగా కార్పొరేటర్లు బయటకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. వీరంతా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరుతారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ అందుబాటులో లేకపోవడంతో.. కొంత జాప్యం జరిగింది. త్వరలో వారంతా పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతారని తెలుస్తోంది. అదే జరిగితే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కూటమి వశం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
* కీలక నేతగా మారాలని
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరారు బాలినేని. కానీ ఆ పార్టీ నుంచి పెద్దగా ఆదరణ లభించడం లేదు. కూటమి ప్రభుత్వంలో సైతం బాలినేనికి పెద్దగా ప్రాధాన్యం లేదు. అందుకే సత్తా చాటాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి భావిస్తున్నారు. ఒకేసారి 20 మంది కార్పొరేటర్ లను జనసేనలో చేర్చి.. ఆ పార్టీలో కీలకం కావాలని చూస్తున్నారు.