2000 Note Withdrawal Effect: పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా ప్రజలకు షాక్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…ఇప్పుడు 2000 నోటు ఉపసంహరించుకోవడంతో దేశవ్యాప్తంగా మళ్ళి చర్చ మొదలైంది. పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆకస్మాత్తు నిర్ణయం లాగా కాకుండా 2000 నోటు సెప్టెంబర్ 30 వరకు చలామణిలో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. అయితే ప్రజలు తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోట్ల మార్పిడికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో మార్చుకోవాలంటే క్యూ లైన్, కే వైసీ అంటూ గంటల సమయం పడుతున్న నేపథ్యంలో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం చూస్తున్నారు.
బంగారం షాప్ లో కొనుగోలు
ఈ క్రమంలో కొందరు బంగారం కొనుగోలు, షాపుల్లో వస్తువుల కొనుగోలు చేస్తున్నారు. వీటికోసం 2000 రూపాయలను మార్పిడి చేస్తున్నారు.. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ప్రజల నుంచి 2000 నోటు స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు. కొందరైతే 2000 రూపాయల నోటు తిరిగి ఇచ్చేసి తన వస్తువులను మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నారు. ఇలాంటి విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలౌన్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
ఓ వాహనదారుడు పెట్రోల్ బంక్ కు వెళ్లి తన స్కూటీలో పెట్రోల్ పోయించుకున్నాడు. అనంతరం బంకులోని సిబ్బందికి తన వద్ద ఉన్న 2000 నోటు తీసి ఇచ్చాడు. ఆ సిబ్బంది రెండు వేల రూపాయల నోటు వద్దని, మేము స్వీకరించడం లేదని, దయచేసి 500 లేదా అంతకంటే తక్కువ విలువ ఉన్న నోట్లు ఇవ్వాలని కోరాడు. అయితే దీనికి సదరు వాహనదారుడు స్పందిస్తూ తన వద్ద ఈ నోటు మాత్రమే ఉందని చెప్పాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకోమని చెప్పింది కదా అంటూ ఆ పెట్రోల్ బంక్ ఉద్యోగికి నిబంధనల సారం వివరించాడు. అతగాడు హితబోధకు మెంటల్ ఎక్కిపోయిన పెట్రోల్ బంక్ ఉద్యోగి రెండవ మాటకు తావు లేకుండా స్కూటీలో నింపిన పెట్రోల్ ను పైపు సహాయంతో బయటకు లాగాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. అయితే అలా పెట్రోల్ లాగొద్దని స్కూటీ ఓనర్ అన్నప్పటికీ.. ” నీ రెండు వేల నోటు మడచి పెట్టుకో.. నా పెట్రోల్ నేను తీసుకుంటా అంటూ” పోసిన ఇంధనాన్ని మొత్తం బయటకు లాగాడు.
దేశ వ్యాప్తంగా ఇదే సమస్య
2000 నోటు సమస్య కేవలం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఇలానే ఉంది. కొంతమంది వ్యాపారులు 2000 నోటు తీసుకుంటుండగా.. మరికొందరు బహిరంగంగానే 2000 నోటు స్వీకరించబోమని బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు ముందుగానే మీ దగ్గర 2000 నోటు ఉందా అని అడుగుతున్నారు. 2000 నోటు కనక ఉండి ఉంటే మా షాపులోకి రావద్దని మొహం మీద చెప్పేస్తున్నారు. మొత్తానికి ₹2,000 నోటు ఉపసంహరణలతో ప్రజలకు పెద్ద నోట్ల రద్దు నాటి పరిస్థితులు మళ్లీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి.
A petrol pump of Maharaja Chowk, Durg chattisgarh is denying acceptance of Rs 2000 Notes. Have 2000 notes lost their legal tender status? @RBI @FinMinIndia @nsitharaman pic.twitter.com/57FdunTURo
— Tejas (@railmintejas) May 20, 2023