Rinku Singh IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో హీరోగా మారిన వ్యక్తుల్లో ముందు వరుసలో ఉంటాడు రింకూ సింగ్. ఒకే ఓవర్ లో ఐదు సిక్సులు కొట్టి రాత్రికి రాత్రి హీరోగా మారిపోయాడు. అప్పటి వరకు రింకూ సింగ్ గురించి పట్టించుకోని ఎంతో మంది.. ఆ తర్వాత అతని నేపథ్యం గురించి తెలిసి ఎంతో బాధపడ్డారు. ఎన్నో కష్టాలు దిగమింగుకుని ఈ స్థాయికి వచ్చాడంటూ అభినందనలు తెలియజేశారు. ఐపీఎల్ 16వ ఎడిషన్ తర్వాత స్టార్ డమ్ వచ్చినప్పటికీ తన మూలాలను మర్చిపోకుండా ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రింకూ సింగ్.
ఐపీఎల్ ద్వారా ఎంతో మంది ప్రతిభావంతులు ప్రపంచానికి పరిచయమయ్యారు. కూటికి గతి లేని నిరుపేద ఆటగాళ్లు కూడా ఈ లీగ్ ద్వారా కోటీశ్వరులుగా మారిపోయారు. ఎంతో మంది చాంపియన్ ప్లేయర్లుగా గుర్తింపు సంపాదించారు. జస్ ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్ వంటి ఆటగాళ్లు ఇలానే వరల్డ్ బెస్ట్ క్రికెటర్లుగా ఎదిగారు. తాజాగా కోల్ కతా నైట్ రైడర్స్ ప్లేయర్ రింకూ సింగ్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో వరుసుగా ఐదు సిక్సులు భాది ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. ఆ తరువాత అదే జోరును కొనసాగించిన ఈ ఉత్తర ప్రదేశ్ కుర్రాడు.. పంజాబ్ తో ఆఖరి బంతికి బౌండరీ బాది కేకేఆర్ ను గెలిపించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో బిగ్ హిట్టింగ్ తో కేకేఆర్ ను గెలిపించినంత పని చేశాడు.
ఇండియా జట్టుకు ఎంపిక చేయాలనే రీతిలో మన్ననలు..
గత నాలుగేళ్లుగా ఐపీఎల్ ఆడుతున్న రింకూ సింగ్.. ఈ సీజన్ తోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. అసాధారణమైన ఆటతో అదరగొడుతున్న రింకూ సింగ్ ను టీమిండియాకు ఎంపిక చేయాలని ప్రతి ఒక్కరూ మాట్లాడేలా మన్ననలు పొందాడు. తాజాగా ఇండియన్ ఎక్స్ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రింకూ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు వచ్చిన ఫేమ్ అంతా టెంపరరీ మాత్రమే అనే విషయం తనకు బాగా తెలుసునని స్పష్టం చేశాడు. ఇప్పుడు పొగుడుతున్న వారే తాను బాగా ఆడుకుంటే తిడతారని తెలిపాడు. చాలా మందికి తన సక్సెస్ మాత్రమే తెలుసని, తాను పడ్డ కష్టం తెలీదు అన్నాడు.
ఆ ఒక్క ఇన్నింగ్స్ జీవితాన్నే మార్చేసింది అన్న రింకూ సింగ్..
ఈ సందర్భంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ తో రింకూ సింగ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ” నేను గతంలో ఎలా ఆడానో.. ఇప్పుడు అలానే ఆడుతున్న. కానీ, చివరి 5 బంతుల్లో ఐదు సిక్సులు కొట్టి విజయానందించడంతో అందరి దృష్టి నాపై పడింది. ఈ ఇన్నింగ్స్ నా జీవితాన్నే మార్చేసింది. అంతకు ముందు నేను చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఐదు సిక్సులు కొట్టిన తర్వాత నా పేరు చాలా మందికి తెలిసింది. ఈడెన్ గార్డెన్స్ లో ప్రేక్షకులు రింకూ రింకూ అని అరవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ తరువాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇదంతా రెండు నిమిషాల ఫేమ్ మాత్రమే. దీన్ని నేను ఏమాత్రం తలకు ఎక్కించుకోను. ఎందుకంటే నేను పడ్డ కష్టం నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పొగుడుతున్న వారే రేపు బాగా ఆడకుంటే తిట్టని తిట్టు తిడతారు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. నేను పెద్దగా చదువుకున్నది కూడా ఏం లేదు” అని రింకూ సింగ్ స్పష్టం చేశాడు.
ఆ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడేసింది క్రికెట్ ఒక్కటే..
మా కుటుంబం గడవడానికి మా అమ్మ నన్ను స్వీపర్ గా పని చేయమని చెప్పిందని రింకూ సింగ్ వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను బయట పడేసింది క్రికెట్ ఒక్కటే అని ఈ సందర్భంగా రింకూ గుర్తు చేసుకున్నాడు. అందుకే నాకు ఇష్టమైన ఆట కోసం ఎంతటి హార్డ్ వర్క్ చేసేందుకు అయినా సిద్ధమని స్పష్టం చేశాడు. నా క్రికెట్ ప్రయాణంలో చాలా మంది చాలా రకాలుగా సాయం చేశారని, గత కొంత కాలంగా కేకేఆర్ నాకు అండగా నిలిచిందని ఈ సందర్భంగా రింకూ వెల్లడించాడు. దాంతోనే నేను ఈ స్థాయికి చేరుకోగలిగాను అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.