
Chiranjeevi- Mahesh Babu: భోళా శంకర్ ఉగాది అప్డేట్ మహేష్ బాబు అండ్ టీమ్ కి షాక్ ఇచ్చింది. ఆగస్టు 11 భోళా శంకర్ విడుదల తేదీగా ప్రకటించడంతో కొత్త రచ్చ మొదలైంది. ఈ మధ్య టాలీవుడ్ లో విడుదల తేదీల కొట్లాటలు ఎక్కువైపోయాయి. 2020 సంక్రాంతికి థియేటర్స్ కోసం మహేష్ , అల్లు అర్జున్ మధ్య వివాదం నెలకొంది. థియేటర్స్ సర్దుబాటు విషయంలో ఇరు చిత్రాల నిర్మాతల మధ్య పంచాయితీ జరిగింది. దీంతో రిలీజుకి ఒక్క రోజు ముందు కూడా స్పష్టత రాలేదు. అడిగినన్ని థియేటర్స్ ఇవ్వకపోతే అల వైకుంఠపురంలో కూడా జనవరి 11న సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో పాటు విడుదల చేస్తామంటూ… సితార ఎంటర్టైన్మెంట్స్ పట్టుబట్టింది.
దిల్ రాజు ఈ పంచాయితీకీ ఫుల్ స్టాప్ పెట్టి మహేష్ 11న అల్లు అర్జున్ 12న వచ్చేలా డీల్ సెట్ చేశారు. థియేటర్స్ పంపకాల విషయంలో ఇరు చిత్రాలకు న్యాయం జరిగేలా చూశారు. 2023 సంక్రాంతికి అంతకు మించిన వివాదం నడిచింది. దిల్ రాజు వారసుడు మూవీతో విడుదల తేదీలు, థియేటర్స్ పంపకాల వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. డబ్బింగ్ మూవీ వారసుడు సంక్రాంతి బరిలో దింపేందుకు వీలు లేదని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. దిల్ రాజు దాన్ని బేఖాతరు చేశారు.
అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లాక్ చేసి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాల మేకర్స్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. వారసుడు విడుదల తేదీ మిగతా సంక్రాంతి చిత్రాలను భయపెట్టింది.థియేటర్స్ లో సింహభాగం వారసుడు చిత్రానికి కేటాయిస్తే మా పరిస్థితి ఏంటన్న పరిస్థితి ఏర్పడింది. వారసుడు జనవరి 11కి బదులు 14కి షిఫ్ట్ చేయడంతో మైత్రీ మూవీ మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. అది వాళ్లకు ప్లస్ అయ్యింది.

సంక్రాంతికే ఈ జంఝాటం అనుకుంటే మామూలు సీజన్స్ కి కూడా తప్పేలా లేదు. తాజాగా భోళా శంకర్ టీమ్ ప్రకటన మహేష్ బాబుకి షాక్ ఇచ్చిందంటున్నారు. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న భోళా శంకర్ నుండి ఉగాది అప్డేట్ ఇచ్చారు. ఆగస్టు 11న మూవీ విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. నిజానికి ఈ తేదీ ఎస్ఎస్ఎంబి 28కోసం అనుకుంటున్నారట. ఇప్పుడు భోళా శంకర్ ఆ తేదీని లాక్ చేయడంతో మహేష్ టీం అసహనంగా ఉందట.
ఆగస్టు 11కి మంచి అడ్వాంటేజ్ ఉంది. 15న పండగ 12న సెకండ్ సాటర్ డే మధ్యలో 14 మాత్రమే వర్కింగ్ డే. లాంగ్ వీకెండ్ కలిసొచ్చినట్లు అవుతుంది. అందుకే మహేష్-త్రివిక్రమ్ ఈ డేట్ పై కన్నేశారు. ఆగస్టు విడుదల టార్గెట్ గా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే అధికారిక ప్రకటన చేయలేదు. మహేష్ టీం నిర్లక్ష్యాన్ని చిరంజీవి క్యాష్ చేసుకున్నారు. మరి మహేష్ టీమ్ మంచి ఛాన్స్ కోల్పోయామని సైలెంట్ గా వేరే డేట్ వెతుక్కుంటారా? లేక చిరంజీవితో పంచాయితీకి దిగుతారో చూడాలి.