
Ugadi 2023: కాలాన్ని దైవ స్వరూపంగా మన రుషులు భావన చేశారు. కాలగణనలో తమతమ పద్ధతులను అనుసరించి… ప్రపంచంలోని దేశాలన్నీ సంవత్సరం అనే కాల ప్రమాణాన్ని ఏర్పరచుకున్నాయి. ఆ సంవత్సరం పొడుగునా శుభాలే కలగాలని కోరుకోవడం మానవ సహజం. భారతదేశంలో ప్రాంతాల మధ్య కొన్ని వైవిధ్యాలున్నా అందరూ పరిగణించే జ్యోతిష శాస్త్రం, గణన సూత్రం ఒక్కటే. దక్షిణాదిన సౌర, చాంద్రమానాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ మాసాలు సూర్య, చంద్రుల ఆధీనమైన కాలచక్రభ్రమణంలో ఏర్పడ్డాయి. తెలుగునాట చాంద్రమానం పాటిస్తారు. చైత్రంతో ప్రారంభమై, ఫాల్గుణం వరకూ సాగే సంవత్సరానికి… చైత్ర శుద్ధ పాడ్యమి తొలిరోజు. చంద్రుడు వివిధ నక్షత్రాలతో సంచరించే స్థితిని బట్టి దీన్ని ‘చాంద్రమానం’ అన్నారు. ఈ తొలిరోజును ఉగాది పర్వదినంగా జరుపుకొంటున్నాం.
ఇంతకుముందు మూడు సంవత్సరాలలో… ‘వికారి’ అనే పేరులోనే వికారం ఉంది. తూర్పు దిశలో ఒక మహమ్మారి ఏర్పడింది. తరువాత ‘శార్వరి’ వచ్చింది. ‘శార్వరి’ అంటే చీకటి. వికారిలో పుట్టిన బీభత్సం శార్వరిలో ప్రపంచమంతటా ప్రభంజనంలా విజృంభించి… కరోనా పేరిట… మారణహోమాన్ని సృష్టించింది. భారతదేశం కూడా దీని ప్రభావానికి లోనయింది. తర్వాత వచ్చింది ప్లవ నామ సంవత్సరం. ‘ప్లవ’ అంటే ‘తెప్ప’, ‘జువ్వి’ అనే అర్థాలున్నాయి. ఈ సంవత్సరంలో మహమ్మారి నుంచి చాలావరకూ ఉపశమనం పొందగలిగాం. మరుసటిగా వచ్చిన ‘శుభకృత్’ ఉగాదిలోకి అడుగుపెట్టాం. ఇందులో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఇప్పుడు శోభకృత్‌లోకి అడుగుపెట్టాం.

జాతవేదన మీదేహం శోభకృన్నామకం సదా
ఆందోళికా సమారూఢం ఖడ్గఖేటధరం శుభం
‘శోభకృత్’ అంటే శోభాలను కలిగించేది. ఈ సంవత్సరానికి అధిపతి ‘జాతవేద’… అంటే ‘సర్వజ్ఞుడైన అగ్ని’ అని భావం. ప్రపంచాన్ని సంరక్షించే శక్తిగా పంచభూతాలలో అగ్నిది అగ్రాధిపత్యం. ఆయన రక్షణలో జగత్తు ఉంటుంది. ప్రకృతికి రక్షణ కలుగుతుంది. సంపదలను, శుభాలను ప్రసాదించే ఈ శోభకృత్ ఉగాదికి ఎంతో ప్రాధాన్యం ఉంది.
చైత్రమాసం అనగానే ఉగాది గుర్తుకు వస్తుంది. ‘ఉగం’ అంటే నక్షత్ర గమనం. ఏడాదిని ‘ఉగం’గానూ, దాని తొలిరోజును ‘ఉగాది’గానూ వ్యవహరిస్తున్నాం. అదే విధంగా సూర్యోదయం నుంచి మరుసటి రోజు సూర్యోదయం వరకూ ‘వారం’ (రోజు). సూర్యోదయ సమయంలో ఏ గ్రహ హోర ఉంటుందో… ఆ రోజును ఆ గ్రహ నామంతో పిలుస్తారు.