Telangana Cabinet Expansion: విశ్వసనీయ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం.. వెనుకబడిన కులాల నుంచి శ్రీహరి ముదిరాజ్, షెడ్యూల్డ్ కులాల నుంచి మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు మంత్రి పదవులు లభించినట్టు తెలుస్తోంది. ఇక శాసనసభకు ఉప సభాపతిగా రామచంద్రనాయక్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.. మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటించామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అధిష్టానం నిర్ణయం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.. మంత్రివర్గ విస్తరణలో ముందుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపించినప్పటికీ.. ప్రస్తుతానికైతే ఎస్సీ, బీసీలకు మాత్రమే అవకాశం ఇవ్వాలని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఉమ్మడి ఇందూరు జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డికి చోటు కల్పించాలని పట్టుబడుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి గనుక మంత్రిగా అవకాశం ఇస్తే.. అతడి సోదరుడు వెంకటరెడ్డిని మంత్రిగా కొనసాగించే అవకాశం లేదని.. ఒకరికి మాత్రమే చోటు కల్పించాల్సి ఉంటుందని అధిష్టానం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది..
ఖాళీగా మూడు స్థానాలు..
ఇప్పుడు ముగ్గురికి గనుక మంత్రులుగా అవకాశాలిస్తే.. ఇంకా మూడు స్థానాలు ఖాళీగా ఉంటాయి. అంతేకాదు చీఫ్ విప్ పదవి కూడా భర్తీ చేసే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తోంది. అయితే ఈ జాబితాలో ఆది శ్రీనివాస్ ముందు వరుసలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేకపోవడంతో వికారాబాద్ ఎమ్మెల్యే, ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను మంత్రివర్గంలోకి తీసుకొని.. ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరొక వ్యక్తిని నియమిస్తే ఎలా ఉంటుందనే ప్రచారం కూడా జరుగుతోంది.. ఇక మంత్రి పదవుల కోసం గట్టిగా పట్టుబడుతున్న ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చేలా కసరత్తు జరుగుతోందని తెలుస్తోంది. ఇక నాలుగు రోజులుగా హైదరాబాద్లో పార్టీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఇతర నాయకులు విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. సామాజిక న్యాయాన్ని పాటించే విధంగా మంత్రివర్గ విస్తరణ ఉండాలని అధిష్టానం సూచనలు చేయడంతో.. ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారు.
తొలిసారిగా ఎస్సీ వర్గీకరణ
దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు శ్రీకారం చుట్టింది. దాని ప్రకారం మంత్రివర్గ కూర్పులో న్యాయం చేస్తున్నట్టు పార్టీ పెద్దలు చెబుతున్నారు. మరోవైపు కొంతమంది మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనకు వినతి పత్రాలు అందించారు. కాలె యాదయ్య, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, లక్ష్మణ్ కుమార్, సామెల్ వంటి వారు ముఖ్యమంత్రిని కలిశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తమ సామాజిక వర్గానికి అనుకున్న స్థాయిలో అవకాశాలు ఇవ్వలేదని.. ఈసారి మంత్రివర్గంలో తప్పనిసరిగా చోటు కల్పించాలని వారు కోరారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు చేసిన వినతి మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముగ్గురికి మినిస్టర్ పోస్టులు లభించడం.. లాంచనమే అయినప్పటికీ.. ఖాళీగా ఉన్న మిగతా మూడు స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది చూడాల్సి ఉంది.